
వైభవంగా చెన్నకేశవస్వామి రథోత్సవం
గద్వాలటౌన్: చెన్నకేశవస్వామి రథోత్సవం కనులపండువగా సాగింది. గద్వాల చుట్టుపక్కల ప్రాంతాలతో పాటు కర్ణాటకకు చెందిన భక్తులతో జిల్లా కేంద్రంలోని పురవీధులు కిటకిటలాడాయి. బుధవారం రాత్రి 10:49 గంటల ప్రాంతంలో భూలక్ష్మీ చెన్నకేశవస్వామి రథాన్ని భక్తులు పోటీపడి లాగారు. పగ్గాలు చేతపట్టి రథాన్ని లాగగా.. ఆ ప్రాంతం గోవిందనామస్మరణలతో మార్మోగింది. అంతకుముందు శోభాయమానంగా రథాన్ని తీర్చిదిద్దారు. రథోత్సవానికి ముందు స్థానిక పాతబస్టాండ్‌లోని రథశాల దగ్గర మంత్రాలయ పీఠాధిపతి సుబుధేంద్రతీర్థ శ్రీపాదులు రథానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ప్రజలు పీఠాధిపతి సుబుధేంద్రతీర్థ శ్రీపాదుల నుంచి ఆశీర్వాదం పొందారు. సుమారు 10వేల మంది భక్తులు రథోత్సవంలో పాల్గొన్నారు.
గద్వాలకు పూర్వవైభవం..
తెలంగాణలో కృష్ణా, తుంగభద్ర నదుల మధ్యలో ఉండటం వల్ల గద్వాల చాలా ప్రాశస్త్యం గల ప్రాంతమని.. ఈ పాంత్రంకున్న ప్రాస్యస్తం, కోటకున్న ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకుని గద్వాలకు పూర్వవైభవం తీసుకవస్తామని మంత్రాలయ పీఠాధిపతి సుబుధేంద్ర తీర్థ శ్రీపాదుల స్వామి అన్నారు. బుధవారం రాత్రి రథోత్సవం సందర్భంగా స్వామి భక్తులనుద్ధేశించి మాట్లాడారు. గద్వాలను పవిత్ర యాత్ర స్థలంగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తున్నామన్నారు. గద్వాల సంస్థానంలో రాజగురువు భువనేంద్రునికి ఇచ్చిన స్థలంలో బృందావనాన్ని ఏర్పాటు చేయడం, కోటలో చెన్నకేశవస్వామి ఉత్సవాలు నిర్వహించడం వలన అంతా శుభం జరుగుతుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment