
పనికో రేటు..!
జిల్లాకేంద్రంలో ఓ రెవెన్యూ అధికారి అవినీతి లీలలు
గద్వాల: ఆయనొక రెవెన్యూ అధికారి. నిబంధనల ప్రకారం జరగాల్సిన పనులను తాత్సారం చేస్తూ.. ఎవరైతే లంచం ఇస్తారో వెనువెంటనే నిబంధనలను తుంగలో తొక్కేసి ఠక్కున పనిచేసి పెడుతూ అక్రమార్కుల నీరాజనాలు పొందుతున్నారు. ఈ అవినీతి వసూళ్లను చక్కబెట్టేందుకు ఏకంగా ఓ వ్యక్తిని దళారీగా పెట్టుకున్నాడు. ప్రభుత్వ అసైన్డ్ భూములు.. ఇనామ్ భూములు..లిటిగేషన్ ఉన్న పట్టా భూముల్లో ఏ మార్పులు చేయాలన్నా.. ఇసుక, మట్టి అక్రమ రవాణా చేయాలన్నా.. ఇలా ఏ పనైనా సరే లంచం ఇస్తే తెల్లారేసరికి అంతా ఓకే చేసి అందినకాడికి రూ.లక్షల్లో జేబులు నింపుకొంటున్నాడు. సదరు రెవెన్యూ అధికారి అవినీతిపై ఇప్పటికే సోషల్ మీడియాలో పోస్టులు చక్కర్లు కొడుతుండడంతో జిల్లాలో హాట్‌టాపిక్‌గా మారింది.
మధ్యవర్తి ఆధ్వర్యంలోనే సెటిల్‌మెంట్లు
ఇదిలాఉంటే రాత్రి వేళలో సదరు రెవెన్యూ అధికారి ఇంటి వద్ద భూపైరవీకారులు, ఇసుక, మట్టి దందా చేసే వ్యక్తులతో పెద్ద క్యూలైనే ఉంటుందని ప్రచారం వినిపిస్తోంది. రాత్రి వేళ వచ్చి సెటిల్‌మెంట్ చేసుకున్న వారికి మరుసటినాడే పని పక్కా అయిపోతుందని పైరవీకారులు బాహటంగా చెబుతున్నారు. ఈ అవినీతి దందాలకు సంబంధించి సెటిల్‌మెంట్ చేసేందుకు వడ్డేపల్లి మండలం రామాపురానికి చెందిన ఓ వ్యక్తిని మధ్యవర్తి (బ్రోకర్)గా నియమించుకున్నాడు. ఇతని ద్వారానే అన్ని రకాల లావాదేవీలు కొనసాగుతాయని కార్యాలయ సిబ్బందే పేర్కొంటున్నారు. ఒకవేళ సదరు మధ్యవర్తి అధికారి కార్యాలయంలో ఉన్నాడంటే.. బయటి వ్యక్తులతోపాటు కార్యాలయ సిబ్బంది కూడా ఆ గదిలోకి వెళ్లాలంటే హడలెత్తిపోతున్నారని సమాచారం.
ప్రజాప్రతినిధి ఆగ్రహం
ప్రజలకు సేవలందించాల్సిన కీలక శాఖలో ఉండే అధికారి ఇలా బరితెగించి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న వైనంపై ఓ నియోజకవర్గ ప్రజాప్రతినిధికి పలువురు ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంలో వారి కుటుంబ సభ్యుల పేర్లు సైతం వినిపిస్తుండడంతో దీనిపై సదరు ప్రజాప్రతినిధి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. తప్పుడు పనులకు తమను బదనాం చేస్తే సహించేది లేదని సదరు రెవెన్యూ అధికారిని తీవ్రంగా హెచ్చరించినట్లు సమాచారం. అదేవిధంగా రామాపురానికి చెందిన మధ్యవర్తి ఎవరు, అతని గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలని కొందరిని ఆదేశించినట్లు సమాచారం.
మధ్యదళారులతో పనులన్నీ చక్కదిద్దుతున్న వైనం
వడ్డేపల్లి మండలం రామాపురానికి చెందిన మధ్యవర్తే కీలకసూత్రధారి
అధికారి అవినీతిపై
సోషల్ మీడియాలో దుమారం
నియోజకవర్గ
ప్రజాప్రతినిధి ఆగ్రహం

పనికో రేటు..!
Comments
Please login to add a commentAdd a comment