గద్వాలటౌన్: పట్టణ అభివృద్ధి మొత్తం ‘ఆక్రమణలు.. అనధికార నిర్మాణాలు.. అధికారుల అవినీతి..’ అన్న చందంగా సాగిపోతోంది. ఇందులో మున్సిపాలిటీ టౌన్ ప్లానింగ్ విభాగం కీలకపాత్ర వహిస్తోంది. నిబంధనల ప్రకారం నిర్మాణాల్లో అధికారులు సూచించిన ప్రమాణలేవీ అమలుకావడం లేదు. అధికారులు వివిధ వర్గాల ఒత్తిళ్లకు తలొగ్గుతుండటమే ఇందుకు కారణమవుతోంది. అదే సందర్భంలో కొందరు అధికారులు ఇంటి యజమానులను వేధిస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. టౌన్ ప్లానింగ్ అవినీతి ఊబిలో కూరుకుపోతుండటంతో మున్సిపాలిటీ ఖజానాకు భారీగా గండి పడుతోంది.
ఎందుకిలా..
టౌన్ ప్లానింగ్ అధికారులపై కమిషనర్లు నేరుగా చర్యలు తీసుకునే పరిస్థితి లేదు. టౌన్ ప్లానింగ్ డైరెక్టర్‌కు ఫిర్యాదు చేయాలి. ఈ విభాగంపై వచ్చిన ఫిర్యాదులు ఉన్నత స్థాయిలో పేరుకుపోయిన అవినీతి మూలంగా బుట్టదాఖలవుతున్నాయి. ఫలితంగా ఇష్టారాజ్యంగా నిర్మాణాలు జరిగాయి. అయితే ప్రస్తుత మున్సిపల్ కొత్త చట్టం ప్రకారం కలెక్టర్లకు పూర్తి అధికారాలు ఉన్నాయి. అవినీతిని కట్టడి చేయడంతో పాటు టౌన్ ప్లానింగ్‌లో అక్రమాలను నియంత్రించవచ్చు.
పర్యవేక్షణ శూన్యం
జిల్లాలోని గద్వాల, అయిజ, అలంపూర్, వడ్డేపల్లి మున్సిపాలిటీలలో టౌన్ ప్లానింగ్ అధికారుల పర్యవేక్షణ కరవైంది. జిల్లా కేంద్రంలో ఇద్దరికిగాను ఒక టీపీఎస్, అయిజలో ఒక టీపీఎస్ మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. మిగిలిన చోట్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీనికి తోడు టౌన్ ప్లానింగ్ అధికారులపై రాజకీయ ఒత్తిళ్లు కూడా సహజంగానే ఎక్కువ. అధికారుల ఊదాసీనత కారణంగా రాజకీయ నాయకులు పెత్తనం చెలాయిస్తూ టౌన్ ప్లానింగ్ వ్యవస్థను తమ కనసన్నలలో నడుపుతున్నారు. దీంతో టౌన్ ప్లానింగ్ అవినీతి బాటలో పయనిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment