రెవెన్యూ అధికారిపై విచారణకు ఆదేశం
గద్వాల: నిబంధనలకు తూట్లు పొడుస్తూ.. పనికో రేటు చొప్పున డబ్బులు వసూలు చేస్తున్న రెవెన్యూ అధికారిపై అంతర్గత విచారణకు ఉన్నతాధికారులు ఆదేశించినట్లు తెలుస్తోంది. లంచం ఇస్తే చాలు పట్టా భూముల్లో మార్పులు చేయడం, ఇసుక, మట్టి అక్రమ రవాణాకు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడం తదితర వాటిపై ‘పనికో రేటు’ శీర్షికన శుక్రవారం ‘సాక్షి’లో కథనం ప్రచురితమవగా ‘జిల్లాలో కలకలం రేగింది. అలాగే, ఈ అవినీతి వసూళ్లను చక్కబెట్టేందుకు ఏకంగా ఓ వ్యక్తిని మధ్యవర్తిగా పెట్టుకోగా.. సదరు వ్యక్తి శుక్రవారం ఆఫీసు పరిసర ప్రాంతాల్లో కూడా కనిపించలేదని కార్యాలయ సిబ్బంది చర్చించుకోవడం గమనార్హం. జిల్లాలో ఇప్పటికే పలువురు రెవెన్యూ అధికారుల పనితీరు, డబ్బుల వసూళ్లపై పెద్ద ఎత్తున ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. ఈక్రమంలోనే గట్టు మండల తహసీల్దార్ సరితపై పలు ఆరోపణలు వెల్లువెత్తగా అంతర్గత విచారణ జరిపిన కలెక్టర్ తహసీల్దార్‌పై శాఖపరమైన చర్యల్లో భాగంగా సస్పెండ్ వేశారు. ఇదేక్రమంలో మరో రెవెన్యూ అధికారి అవినీతి లీలలపై సోషల్‌మీడియాలో వెలుగుచూడగా.. ‘సాక్షి’ కథనంపై జిల్లా పరిపాలన ఉన్నతాధికారి అంతర్గత విచారణకు ఆదేశించినట్లు విశ్వసనీయ సమాచారం. విచారణలో నిజాలు వెలుగు చూసి ఏమేర చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment