మున్సిపల్ పాలకవర్గం కాలపరిమితి ముగియడంతో చైర్మన్ల స్థానంలో ప్రత్యేక అధికారులు బాధ్యతలు చేపట్టారు. అయితే, ప్రత్యేక పాలనలో ఆక్రమాలు ఉండవని, పారదర్శక పాలన లభిస్తుందని, సమస్యలు తొలిగి న్యాయం జరుగుతుందని ప్రజలు భావించారు. అయితే ఆ దిశగా ప్రత్యేక పాలన సాగడం లేదని పెదవి విరుస్తున్నారు. ఇటీవల స్థానిక 34వ వార్డు పరిధిలోని కుంటవీధిలో, 6వ వార్డు బసవన్న చౌరస్తా ఎదురుగా ఉన్న పది శాతం మున్సిపల్ స్థలంలో చేపట్టిన నిర్మాణాలు వివాదాస్పదమయ్యాయి. ఈ అక్రమ నిర్మాణాలపై కలెక్టర్, అడిషినల్ కలెక్టర్‌కు స్థానికులు ఫిర్యాదు చేశారు. దీనిపై చర్యలు తీసుకోవాలని మున్సిపల్ అధికారులను ఆదేశించినా.. ఇప్పటి వరకు చర్యలు లేవు. రాజకీయ ఒత్తిళ్లతో మున్సిపల్ అధికారులు ఆ నిర్మాణ చాయలకు కూడా వెళ్లడం లేదు. పైగా వెళ్లిన కిందస్థాయి సిబ్బందిపై విరుచకపడుతున్నారు. ‘మా అన్నతో మీ సార్‌కు చెప్పించాం కదా.. మళ్లీ ఎందుకు వచ్చావ్’ అంటూ సిబ్బందిపై రుబాబు ప్రదర్శించారు. రాజకీయ అండతో ఆక్రమణదారుడు బరితెగించి నిర్మాణాల వేగాన్ని మరింత పెంచి అధికారులకే సవాల్ విసురుతున్నాడు. వీటిపై అధికారులు ఏవిధంగా స్పందిస్తారో అనే దానిపై స్థానికుల్లో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా అక్రమ నిర్మాణాలు, ఆస్తిపన్ను మదింపులో పెద్ద ఎత్తున్న అవినీతి జరుగుతుందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వీటిపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం అధికారులపై ఉంది.
Comments
Please login to add a commentAdd a comment