ఎండుమిర్చి ఏడిపిస్తోంది..!
ధర లేక సతమతమవుతున్న రైతులు
మానవపాడు: ఎన్నో ఆశలతో ఎండుమిర్చి సాగు చేసిన రైతుకు అటు ధరలు లేక.. ఇటు దిగుబడి తగ్గి నష్టాలు వెంటాడుతున్నాయి. వర్షాభావం, చీడపీడలు తట్టుకొని.. పెట్టుబడి వ్యయం పెరిగినా భరించి పంటను పండిస్తే నిరాశే ఎదురవుతుంది. గతేడాది ఇదే సీజన్‌లో క్వింటా రూ.20వేలు పలకగా.. ప్రస్తుత సీజన్‌లో రూ.7వేల నుంచి రూ.11,500 వరకు మార్కెట్ రేటు పలుకుతుండడంతో రైతు దిక్కుతోచని స్థితిలో పడ్డాడు. జిల్లాలో ఈ సీజన్‌లో దాదాపు 37వేల ఎకరాల్లో ఎండు మిర్చి సాగు చేశారు.
గతేడాది ఎండుమిర్చికి మంచి ధర పలికింది. క్వింటా మిర్చి రూ. 20వేల వరకు పలికింది. కొంతమంది మరింత ఎక్కువ ధర వస్తుందని ఆశతో కోల్డ్‌స్టోరేజీలో మిర్చిని దాచారు. అయితే, గత సీజన్ నుంచి ఈ సీజన్ వరకు సుమారు 50శాతం ధరలు పడిపోవడం గమనార్హం. దిగుబడులు తగ్గటంతో పాటు ధరలు కూడా పతనం కావడంతో మిర్చి రైతులు దిక్కుతోచని స్థితిలో చేరుకున్నాడు. కోల్డ్‌స్టోరేజీలో బస్తాకు ఏడాదికి రూ.170 నుంచి రూ.200 వరకు వసూలు చేశారు. తేజ రకం మిర్చి కొత కూలీ క్వింటాకు రూ.3 వేల వరకు ఖర్చుఅవుతుంది. దీనికితోడు పెటుబడి ఖర్చులు కలుపుకొంటే దాదాపు రూ.7వేల వరకు ఖర్చు వస్తుంది. వర్షాల కారణంగా కాయల్లో నాణ్యత లోపించింది. నాణ్యత తక్కువగా ఉందని ధరలు తక్కువ ఇస్తుండడంతో రైతు అవస్థలు పడుతున్నారు.
మిర్చి సాగుకు ఈ ఏడాది ఖర్చులు భారీగా పెరిగాయి. విత్తనాలు, ఎరువులు కూలి ధరలు అమాంతం పెరిగాయి. ఎకరా సాగుకు రూ.1.50 లక్షల నుంచి రూ.1.80 లక్షల దాకా ఖర్చు చేయగా.. దిగుబడి మాత్రం 7 నుంచి 12 క్వింటాళ్ల లోపే వచ్చిందని పేర్కొన్నారు. గత ఏడాది ఈ సీజన్‌లో గుంటూరు మిర్చి రకం క్వింటాకు రూ.14 వేల నుంచి రూ.20వేల దాకా ధర పలికింది. సింజేంటా, బ్యాడిగ, రకం రూ.18వేల నుంచి రూ.30వేలు, సూపర్ 10, గుంటూరు మిర్చి రకాలు రూ.14వేల నుంచి రూ.22వేల వరకు ధర ఉండగా.. నేడు దాదాపు 50 శాతానికి తగ్గిపోయాయి. ఇప్పటికై నా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి మద్దతు ధర వచ్చేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని రైతులు కోరుతున్నారు. ప్రకృతి వైపరిత్యాలు వల్ల రైతులు నష్టపోతే ప్రభుత్వాలు ఎంతో కొంత ఆదుకునేవని, అలాగే ఈ ఏడాది ఎండుమిర్చి రైతులను ప్రభుత్వాలు ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.
జిల్లా వివరాలిలా..
మండలం సాగు
(ఎకరాల్లో)
ఇటిక్యాల 8,368
మానవపాడు 5,759
గద్వాల 4,361
అయిజ 4,301
గట్టు 3,153
మల్దకల్ 2,869
ఉండవెల్లి 2,771
రాజోలి 795
వడ్డేపల్లి 783
అలంపూర్ 683
ధరూరు 131
కేటీదొడ్డి 99
పెరిగిన అప్పులు
ధరల పతనం
గతేడాది క్వింటా రూ.20వేలు
పలికిన వైనం
ప్రస్తుత సీజన్‌లో రూ.10వేల
దిగువకు..
పెరిగిన కూలీలు, కౌలు ఖర్చులతో అప్పుల ఉబ్బిలో అన్నదాతలు
ఎలా బతికేది.. ?
10ఎకరాల్లో మిర్చి పంట సాగు చేశాను. పంటకౌలు, మందులు, ఎరువులు, కూలీల ఖర్చులు కలిపి ఎకరాకు రూ.1.50 లక్షల నుంచి రూ. 2లక్షల వరకు ఖర్చు అయ్యింది. కానీ, దిగుబడి మాత్రం రాలేదు. 10 నుంచి 12 క్వింటాళ్లు మాత్రమే మిర్చి దిగుబడి వస్తోంది. నాణ్యతను బట్టి రూ.7వేల నుంచి రూ.12వేలు ధర ఇస్తే మేం ఎలా బతికేది.
– రామాంజనేయులు, రైతు, చెన్నిపాడు
ప్రభుత్వం ఆదుకోవాలి
ఎండు మిర్చి పంట సాగుకు రూ.లక్షలు ఖర్చు చేశాం. ఇప్పుడేమో ధరలు లేక అప్పులు పేరుకుపోయే పరిస్థితి నెలకొంది. మార్కెట్‌లో మిర్చికి రూ.10వేలకు తక్కువగానే ధర పలుకుతోంది. దీంతో పంటకు పెట్టిన పెట్టుబడులు కూడా రావు. రాష్ట్ర ప్రభుత్వం ఎండు మిర్చికి మద్దతు ధర లభించేలా చర్యలు తీసుకోవాలి.
– గోపాల్, రైతు, గోకులపాడు
ఎండుమిర్చి ఏడిపిస్తోంది..!
ఎండుమిర్చి ఏడిపిస్తోంది..!
ఎండుమిర్చి ఏడిపిస్తోంది..!
Comments
Please login to add a commentAdd a comment