జోగుళాంబ సన్నిధిలో ప్రముఖులు
అలంపూర్: అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటైన అలంపూర్ జోగుళాంబ ఆలయాలను సోమవారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ముందుగా ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి, ఎమ్మెల్యే విజయుడు, గద్వాలకు జిల్లా కేంద్రానికి చెందిన బీహార్‌లో విధులు నిర్వహిస్తున్న ఐఏఎస్ అధికారి శ్రీరామచంద్రుడు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. అమ్మవారిని, బాలబ్రహ్మేశ్వర స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు వారికి తీర్థ ప్రసాదాలను అందజేసి అశీర్వచనం పలికారు. వేర్వేరు సమయాల్లో వీరు ఆలయాన్ని దర్శించుకోగా.. ఆలయ ఈఓ పురేందర్ కుమార్ ఘన స్వాగతం పలికి అనంతరం శేషవస్త్రాలతో సత్కరించారు.
జాతీయ స్థాయి కబడ్డీ పోటీలకు ఎంపిక
గద్వాలటౌన్: ఈ నెల 21వ తేదీ నుంచి 24వ తేదీ వరకు ఒడిశాలో జరిగే జాతీయ స్థాయి సీనియర్ కబడ్డీ పోటీలకు గద్వాలకు చెందిన క్రీడాకారుడు సద్దాం ఎంపికయ్యారని జిల్లా కబడ్డీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి నర్సింహ తెలిపారు. అదిలాబాద్ జిల్లాలో జరిగిన రాష్ట్రస్థాయి సీనియర్ బాలుర కబడ్డీ పోటీలలో మన జిల్లా జట్టు తరపున సద్దాం పాల్గొని అత్యంత ప్రతిభ కనభర్చారు. రాష్ట్రస్థాయి పోటీలలో మన జిల్లా క్రీడాకారుడు సద్దాం క్రీడా నైపుణ్యాన్ని గుర్తించి సెలెక్టర్లు జాతీయ స్థాయి పోటీల ఎంపిక చేశారన్నారు. క్రీడాకారుడు సద్దాం ఎంపిక పట్ల జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షురాలు డీకే స్నిగ్ధారెడ్డి, చైర్మన్ అబ్రహాం, రవి, చందు, నగేష్, కరెంటు నర్సింహా, జగదీష్, రైల్వేపాష, రాజేందర్, వెంకటన్న సీనియర్ క్రీడాకారులు హర్షం తెలిపారు.
21న ‘పేట’కు సీఎం రాక
నారాయణపేట: ఈ నెల 21న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నారాయణపేటకు రానున్నారని కలెక్టర్ సిక్తా పట్నాయక్ తెలిపారు. ఈ మేరకు సోమవారం ఆమె హెలీప్యాడ్ స్థలాన్ని ఎస్పీ యోగేష్ గౌతమ్‌తో కలిసి పరిశీలించారు. అలాగే ఫొటో ఎగ్జిబిషన్, స్టేజీ తదితర ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు. ముఖ్యమంత్రి పలు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించనున్నట్లు, వాటిలో మెడికల్ కళాశాల టీచింగ్ హాస్పిటల్, 100 పడకల ఆస్పత్రి, నర్సింగ్ కళాశాల, రెండు పోలీస్‌స్టేషన్ల భవన నిర్మాణాలు, పెట్రోల్ బంక్, మహిళా సమాఖ్య భవనాలు ప్రారంభించనున్నారు. సీఎం పర్యటనలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలని ఆమె అధికారులను ఆదేశించారు.
శ్రీశైలం యాత్రికులకు
24 గంటలు అనుమతి
మన్ననూర్: మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీశైలం వెళ్లే యాత్రికుల సౌకర్యార్థం ఈ నెల 23 నుంచి మార్చి 1వ తేదీ వరకు అటవీశాఖ చెక్‌పోస్టుల ద్వారా 24 గంటలు వాహనాల రాకపోకలకు అనుమతి ఇస్తున్నట్లు డీఎఫ్‌ఓ రోహిత్‌రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. కొంతకాలంగా వన్యప్రాణుల సంరక్షణలో భాగంగా రాత్రి 9 నుంచి ఉదయం 6 గంటల వరకు మన్ననూర్ చెక్‌పోస్టు వద్ద రాకపోకలు నిలిపివేసినట్లు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment