పునరావాసానికి సన్నద్ధం
సాక్షి, నాగర్‌కర్నూల్: నల్లమల అటవీప్రాంతంలోని అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ పరిధిలోని కోర్ ఏరియాలో ఉన్న చెంచుపెంటల తరలింపునకు అవసరమైన చర్యలను అటవీశాఖ వేగవంతం చేసింది. ఇప్పటికే కోర్ ఏరియాలో ఉన్న సార్లపల్లి, కుడిచింతల్‌బైల్, వటవర్లపల్లి గ్రామాలను ఖాళీ చేయించేందుకు కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. నేషనల్ టైగర్ కన్జర్వేటివ్ అథారిటీ(ఎన్టీసీఏ) ద్వారా బాధితులకు పునరావాస ప్రత్యేక ప్యాకేజీని అందజేయనున్నారు. కేంద్రం నుంచి ఆమోదం లభించిన వెంటనే అధికారులు పునరావాస ప్రక్రియను మొదలుపెట్టనున్నారు. మరో రెండు నెలల్లోనే పునరావాసానికి పూర్తిస్థాయి అనుమతులు లభిస్తాయని భావిస్తున్నారు.
విడతల వారీగా చెంచుపెంటల తరలింపు..
నల్లమల అటవీప్రాంతంలో ఉన్న పులులు, వన్యప్రాణుల సంరక్షణలో భాగంగా అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ కోర్ ఏరియా పరిధిలో ఉన్న చెంచుపెంటలను ఖాళీ చేయించి, అడవి బయట వారికి పునరావాసం కల్పించేందుకు అటవీశాఖ సిద్ధమవుతోంది. ప్రధానంగా పెద్దపులుల సంరక్షణ, వాటికి స్వేచ్ఛగా సంచరించేందుకు వీలు కల్పించడం, వన్యప్రాణులకు, మనుషులకు మధ్య ఘర్షణ వాతావరణాన్ని నిరోధించడంలో భాగంగా పునరావాస ప్రక్రియను చేపడుతున్నట్టు అటవీశాఖ చెబుతోంది. ఇప్పటికే ఇందుకోసం ప్రక్రియను ప్రారంభించగా, తొలి విడతగా తరలించనున్న సార్లపల్లి, కుడిచింతల్ బైల్, వటవర్లపల్లి గ్రామాల్లో సర్వే నిర్వహించి, స్థానికుల నుంచి అంగీకార పత్రాలను తీసుకుంటున్నారు. స్వచ్ఛందంగా తరలింపునకు ఒప్పుకున్న వారికే పునరావాస ప్యాకేజీని అమలు చేస్తామని, ఎట్టి పరిస్థితుల్లోనూ వారిని బలవంతం చేయబోమని అటవీ శాఖ అధికారులు చెబుతున్నప్పటికీ స్థానిక చెంచుల్లో మాత్రం భయాందోళనలు నెలకొన్నాయి.
తొలి విడతలో మూడు గ్రామాలు..
నల్లమల అటవీ ప్రాంతంలోని కోర్ ఏరియాలో ఉన్న సుమారు 20 వరకు చెంచుపెంటలను విడతల వారీగా ఖాళీ చేయించి మరో చోట పునరావాసం కల్పించాలని అటవీశాఖ భావిస్తోంది. వీటిలో మొదటి విడతగా సార్లపల్లి, కుడిచింతల్‌బైల్, వటవర్లపల్లి గ్రామాలను ఖాళీ చేయించాలని నిర్ణయించింది. ఇందుకోసం క్షేత్రస్థాయి సర్వేతో పాటు కుటుంబాల నుంచి అంగీకార పత్రాలను సేకరిస్తోంది. సార్లపల్లిలో మొత్తం 269 కుటుంబాలు ఉండగా, వీరిలో 83 కుటుంబాలు మాత్రమే చెంచులు కాగా, మిగతా ఇతర వర్గాలకు చెందినవారు ఉన్నారు. వీరిలో ఇతర వర్గాలు మాత్రమే తరలింపునకు అంగీకారం చెబుతుండగా, మెజార్టీ చెంచులు ఒప్పుకోవడం లేదు.
ప్యాకేజీ కింద 5 ఎకరాలు,
లేదంటే రూ.15 లక్షలు
అడవిని ఖాళీ చేసి మరో చోటుకు తరలుతున్న స్థానికులకు పునరావాసం కింద ఎన్టీసీఏ ప్రత్యేక ప్యాకేజీని అందిస్తోంది. ఒక్కో కుటుంబానికి రూ.15 లక్షల చొప్పున పునరావాస ప్యాకేజీ, లేదా 5 ఎకరాల భూమి కేటాయిస్తుంది. ఈ రెండింటిలో ఏదైనా ప్యాకేజీని బాధితులు ఎంచుకోవచ్చు. ఖాళీ చేయనున్న గ్రామస్తులకు పునరావాసం కల్పించేందుకు పెద్దకొత్తపల్లి మండలం బాచారం వద్ద ఇప్పటికే భూమిని గుర్తించారు. అక్కడే పునరావాస కాలనీలను ఏర్పాటు చేసి నిర్వాసితులకు ఇళ్లు, పాఠశాల, రోడ్లు, ఇతర మౌలిక వసతులను కల్పించనున్నారు.
నల్లమల అడవి నుంచి చెంచుపెంటలతరలింపునకు కొనసాగుతున్న కసరత్తు
మొదటి విడతలో కుడిచింతలబైల్,సార్లపల్లి, వటవర్లపల్లి గ్రామాలు
ఎన్టీసీఏ ద్వారా ప్రత్యేక పునరావాస ప్యాకేజీ
పెద్దకొత్తపల్లి మండలం బాచారం వద్ద ఏర్పాట్లు
పునరావాసానికి సన్నద్ధం
Comments
Please login to add a commentAdd a comment