సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించండి
గద్వాలటౌన్: జిల్లా కేంద్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి, వాటి పరిష్కారానికి చొరవ చూపాలని..గద్వాల పట్టణంలో ‘ప్రత్యేక’ పాలన మార్కు చూపించి, ప్రజల మన్ననలు పొందాలని కలెక్టర్ సంతోష్ సూచించారు. బుధవారం మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ అధికారులు, వార్డు అధికారులు, సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. విభాగాల వారీగా సమీక్షించి, వారి నుంచి సమగ్ర వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పట్టణంలో ప్రగతి పనుల నిమిత్తం ఆదాయ మార్గాలపై దృష్టి సారించాలన్నారు. పన్ను బకాయిలపై ప్రత్యేక శ్రద్ద కనబర్చి, రెగ్యులర్ పన్నులను వసూళ్లు చేయాలని ఆదేశించారు. సిబ్బందికి లక్ష్యలను నిర్ధేశించి పన్ను, అద్దెలను వసూలు చేయాలన్నారు. పట్టణంలో పారిశుద్ధ్య సమస్య తలెత్తకుండా ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. సమస్య జఠిలంగా ఉన్న వార్డులలో ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని సూచించారు. తక్షణమే వార్డు అధికారులకు వార్డులను కేటాయించి, వారికి బాధ్యతలను అప్పగించాలన్నారు. ఇక నుంచి వార్డు అధికారులు ఆయా వార్డులలో ప్రజలకు అందుబాటులో ఉండి వారితో మమేకం కావాలన్నారు. పారిశుద్ధ్య నిర్వహణ, ఆస్తిపన్ను వసూళ్లు, తాగునీటి సరఫరా, లే అవుట్లు, విద్యుత్తు తదితర విభాగాలను సమర్ధవంతంగా పర్యవేక్షించాలన్నారు. ప్రతి వార్డు అధికారికి ఆయా వార్డులపై పూర్తిస్థాయిలో అవగాహన కలిగి పట్టు సాధించాలన్నారు. 15 రోజుల తరువాత మరోసారి సమీక్ష నిర్వహించి, పురోగతిపై అంచనా వేస్తామన్నారు. రాబోవు వేసవికాలం తాగునీటి ఎద్దడి నివారణకు చర్యలు తీసుకోవాలని ఆదేశాంచారు. ఎక్కడ తాగునీటి సమస్య తలెత్తకుండా చూడాలన్నారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఇప్పటి నుంచి ప్రణాళికలు రూపొందించాలన్నారు.
రెవెన్యూ, టౌన్ ప్లానింగ్ అధికారులపై ఆగ్రహం
మున్సిపాలిటీలో ప్రధానంగా టౌన్ ప్లానింగ్, రెవెన్యూ విభాగాలపై ఆరోపణలు, విమర్శలు వస్తున్నాయని ఆయా విభాగాల అధికారులపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆస్తిపన్ను మదింపులో అక్రమాలపై ఫిర్యాదులు ఉన్నాయని చెప్పారు. అక్రమ కట్టడాలు, మున్సిపల్ స్థలాల ఆక్రమణలపై టౌన్ ప్లానింగ్ అధికారులు ఊదాసీనంగా ఉన్నారని, ఇలాగే కొనసాగితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సమావేశంలో అడిషినల్ కలెక్టర్ నర్సింగరావు, కమిషనర్ దశరథ్ తదితరులు పాల్గొన్నారు.
పన్ను వసూళ్ల లక్ష్యాలను చేరుకోవాలి
వేసవి దృష్ట్యా నీటి ఎద్దడి నివారణకు చర్యలు
కలెక్టర్ బీఎ సంతోష్
Comments
Please login to add a commentAdd a comment