ఎర్రవల్లి: జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష నీట్ యూజీ–2025 నిర్వహణకు కట్టుదిట్టమైన ఏర్పాట్లను చేయాలని జిల్లా కలెక్టర్ బి.ఎం సంతోష్ అన్నారు. మంగళవారం ఎర్రవల్లి మండల కేంద్రంలో నీట్ పరీక్ష జరిగే సరస్వతి పాఠశాల కేంద్రాన్ని జిల్లా ఎస్పీ శ్రీనివాసరావుతో కలిసి కలెక్టర్ క్షేత్రస్థాయిలో సందర్శించారు. ఈ సందర్బంగా గదుల వసతులు, సీటింగ్ ఏర్పాట్లు, సీసీటీవీ నిఘా, వెంటిలేషన్, తదితర అంశాలను పరిశీలించి పాఠశాల యాజమాన్యానికి అవసరమైన సూచనలు చేశారు. పరీక్ష కేంద్రాల్లో అవసరమైన మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థులకు తగినంత సీటింగ్ సామర్థ్యం ఉండేలా చూడాలని, సీసీటీవీ పర్యవేక్షణ తప్పనిసరిగా అమలు చేయాలని సూచించారు. ప్రశ్నపత్రాల భద్రతకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని, పరీక్షా కేంద్రాల్లో విద్యుత్ సరఫరా, తాగునీటి సదుపాయాలు, పరిశుభ్రత, టాయిలెట్ వంటి వసతులను పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండేలా చూడాలని ఆదేశించారు. దివ్యాంగ విద్యార్థులకు పరీక్ష కేంద్రంలో ప్రత్యేక సదుపాయాలు కల్పించాలన్నారు. విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్నీ ఏర్పాట్లు పకడ్బందీగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కార్యక్రమంలో డీఈఓ అబ్దుల్‌గని, కోఆర్డినేటర్ వెంకటేష్, ప్రిన్సిపల్ నందిని పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment