సమాజ అభివృద్ధిలో మహిళలు కీలకం
గద్వాల: సమాజ అభివృద్ధిలో మహిళలు కీలకపాత్ర పోషిస్తారని, వారు ఆర్థికంగా ఎదిగితే సమాజం సైతం అభివృద్ధి చెందుతుందని అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మంగళవారం మహిళా శిశు, దివ్యాంగ, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌లో మహిళా ఉద్యోగులతో బైక్ ర్యాలీని నిర్వహించారు. ఈ ర్యాలీని అదనపు కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సమాజంలో మహిళల సాధికారత కోసం ప్రతిఒక్కరు తోడ్పడాలని కోరారు. బైక్ ర్యాలీ కలెక్టరేట్ నుంచి పట్టణంలోని ప్రధాన రోడ్ల వెంబడి కృష్ణవేణి చౌరస్తావరకు సాగింది. అనంతరం స్థానిక పోలీసు పరేడ్ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు. అదేవిధంగా మహిళలకు వివిధ రకాల పాటల పోటీలు నిర్వహించారు. కార్యక్రమంలో సంక్షేమ శాఖ జిల్లా అదికారిని సునంద, డీసీపీవో నర్సింహులు, వివిధ శాఖలకు చెందిన మహిళా ఉద్యోగులు పాల్గొన్నారు.
గ్రూప్ –1లో
సత్తా చాటిన న్యాయవాది
గట్టు: గట్టు మండలం గొర్లఖాన్‌దొడ్డి గ్రామానికి చెందిన రవికుమార్‌గౌడ్ గ్రూప్– 1 ఫలితాల్లో 458.5 మార్కులు సాధించి ప్రతిభ చాటాడు. సామాన్య రైతు కుటుంబానికి చెందిన ఈయన న్యాయవాదిగా కొనసాగుతూనే గ్రూప్–1కు ప్రిపేర్ అయ్యాడు. గొర్లఖాన్‌దొడ్డి గ్రామానికి చెందిన మునిస్వామిగౌడ్, గోవిందమ్మ దంపతుల ద్వితీయ సంతానం రవికుమార్‌గౌడ్. హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో ఎల్‌ఎల్‌బీ పూర్తి చేసి హైకోర్టులో న్యాయవాదిగా పనిచేస్తున్నాడు. అలాగే, సివిల్ సర్వీసెస్‌కు ప్రిపేర్ అయ్యాడు. ఈక్రమంలోనే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన గ్రూప్–1 ఫలితాల్లో సత్తా చాటాడు. డిప్యూటీ కలెక్టర్, డీఎస్పీ, కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్, డిస్టిక్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్, ఎంపీడీఓ తదితర పోస్టులకు ఎంపికయ్యే అవకాశం ఉన్నట్లు తెలిపారు. 2014 నుంచి కష్టపడి సివిల్ సర్వీసెస్‌కు ప్రిపేర్ అయ్యానని, తన విజయంలో తల్లిదండ్రులతోపాటు తమ్ముడు సివిల్ ఇంజినీర్ కృష్ణ, అన్న నాగన్‌గౌడ్ సహకారం ఎంతో ఉందని, తన 10 ఏళ్ల కష్టానికి ఫలితం దక్కిందని రవికుమార్‌గౌడ్ తెలిపారు. ఇదిలాఉండగా, తమ గ్రామానికి చెందిన వ్యక్తి గ్రూప్–1లో ప్రతిభ కనబర్చడంతో గొర్లఖాన్‌దొడ్డి గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.
సమాజ అభివృద్ధిలో మహిళలు కీలకం
Comments
Please login to add a commentAdd a comment