సకాలంలో ట్యాక్స్ చెల్లించని వాహనదారులకు రవాణాశాఖ మెసేజ్‌ల ద్వారా సందేశాలు పంపిస్తోంది. సకాలంలో ట్యాక్స్ చెల్లిస్తే సరే.. లేదంటే రెట్టింపు జరిమానా చెల్లించాల్సి ఉంటుందని స్పష్టమైన ఆదేశాలు జారీ చేస్తోంది. జిల్లాలో ప్రయాణికులను తరలించే వాహనాలతో పాటు కమర్షియల్ ట్రాక్టర్లు, పాత లారీలు, ప్రైవేటు బస్సులు, గూడ్స్ వాహనాలు చాలా వరకు ట్యాక్స్ చెల్లించకుండా తిరుగుతున్నట్టు అధికారులు గుర్తించారు. ట్యాక్స్ చెల్లించకుండా వాహనాలు తిప్పడం వల్ల ప్రభుత్వ ఖజానాకు భారీగా గండి పడుతుంది. ఈ నేపథ్యంలో వివిధ ట్యాక్స్‌లు రవాణా శాఖకు చెల్లించకుండా పెద్ద మొత్తంలో పేరుకుపోయిన బకాయిల వసూలు కోసం ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు. అయితే కొన్ని వాహనాలను గ్రామాల్లో మాత్రమే తిప్పుకొని ఇళ్ల వద్ద ఉంచుతున్నారు. అలాంటి వాహనాల విషయంలో నిఘా ఉంచి చర్యలు తీసుకుంటున్నారు. వాహన సామర్థ్యం (ఎఫ్‌సీ), అనుమతి (పర్మిట్), క్వార్టర్ పన్నులు చెల్లించని వివరాలతో ఇప్పటికే బకాయిల జాబితాను రూపొందించుకున్నారు. బకాయిల వసూలుకు అధికారులు బృందాలుగా ఏర్పడి విస్తృతంగా వాహనాల తనిఖీలు చేపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment