సమానత్వం ఇంటి నుంచే మొదలవ్వాలి
గద్వాలటౌన్: మహిళల సమానత్వం ఇంటి నుంచే మొదలవ్వాలని, ఇంట్లో మగపిల్లలను ఆడపిల్లలను సమానంగా చూడాలని, అనుకున్న లక్ష్యాన్ని సాధించుకునేలా స్వేచ్ఛను ఇవ్వాలని ఐద్వా రాష్ట్ర కార్యదర్శి మల్లు లక్ష్మి పేర్కొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం స్థానిక ప్రభుత్వ ఎస్సీ బాలికల గృహ ఆవరణలో ఏర్పాటు చేసిన సెమినార్‌కు ఆమె ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఇంట్లో నుంచే స్వేచ్ఛ మొదలైతే మంచి ఉన్నత శిఖరాలు సాధించే అవకాశం ఉందన్నారు. అయితే క్రమశిక్షణ, సాధించాలనే తపన, అన్ని మంచిగా తీసుకోవడం, లక్ష్యాన్ని నిర్దేశించుకోవడం చేస్తే.. ప్రపంచాన్ని సృష్టించే స్థాయికి చేరుకుంటారన్నారు. మార్చి 8వ తేదీ అసమానతలపై జరిగే పోరాటాలకు దిక్సూచి కావాలని, ఈ రోజు దోపిడీపై మహిళలు చేసిన అనేక పోరాటాలు మనకు స్పురణకు వస్తాయన్నారు. మహిళా సాధికారత గురించి గొప్పలు చెప్పుకుంటున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళలకు చేసింది ఏమీ లేదని మిమర్శించారు. కేంద్రంలో ఉన్న మోదీ ప్రభుత్వం మహిళలను మరింత వెనకకు నెట్టే విధంగా చర్యలు చేపడుతుందని ఆరోపించారు. మహిళలు పోరాడి సాధించుకున్న హక్కులు, చట్టాలకు సవరణలు చేస్తూ నిర్వీర్యం చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. సీ్త్రల భద్రతలో మన దేశంలో 126వ స్థానంలో ఉందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఐద్వా రాష్ట్ర అధ్యక్షురాలు అరుణజ్యోతి, జిల్లా అధ్యక్షురాలు ఏమేలమ్మ, కార్యదర్శి నర్మద, జిల్లా నాయకురాలు రాధ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment