
నామినేషన్ సమయంలో రిటర్నింగ్ అధికారి ఇలక్కియ ఎదుట ప్రమాణం చేస్తున్న కుడుపూడి (ఫైల్)
కాకినాడ: స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన కుడుపూడి సూర్యనారాయణరావు ఎన్నిక లాంఛనమే కానుంది. శుక్రవారం జరిగిన నామినేషన్ల పరిశీలనలో టీడీపీ తరఫున దరఖాస్తు చేసిన కడలి శ్రీదుర్గ, స్వతంత్ర అభ్యర్థులు ఇంత సంతోషం, అంబటి కోటేశ్వరరావుల నామినేషన్లను అధికారులు సాంకేతిక కారణాలతో తిరస్కరించారు. వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా కుడుపూడి సూర్యనారాయణ రెండు నామినేషన్లు వేశారు. ఆయన నామినేషన్‌ను ఆమోదించారు. బరిలో ఆయన నామినేషన్ మాత్రమే మిగలడంతో ఆయన ఎమ్మెల్సీగా ఎన్నిక కావడం లాంఛనమే కానుంది. అయితే నిబంధనల ప్రకారం అధికారులు దీనిని ప్రకటించాల్సి ఉంటుంది.
రూ.3.36 లక్షల సరకు జప్తు
కాకినాడ సిటీ: వివిధ కేసులలో స్వాధీనం చేసుకున్న రూ.3,36,800 విలువైన సరకును ప్రభుత్వానికి జప్తు చేస్తూ జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. రేషన్ బియ్యం అక్రమ నిల్వ, రవాణాతో పాటు రైస్ మిల్లులు, పెట్రోల్ బంకుల్లో నిబంధనల ఉల్లంఘన వంటి వాటిపై ఈ కేసులు నమోదయ్యాయి. అక్రమ రవాణాకు సంబంధించి ఇద్దరు వాహన యజమానులకు రూ.27 వేల జరిమానా విధించామని జేసీ తెలిపారు. ఈ మొత్తం పౌర సరఫరాల శాఖకు జమ అవుతుందన్నారు. ప్రతివాదులను ఆమె విచారించి, తీసుకోవాల్సిన చర్యలు, సీజ్ చేసిన సరుకులను ప్రభుత్వానికి జప్తు చేయడంపై ఉత్తర్వులు ఇచ్చారు.
ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక స్పందనకు 10 అర్జీలు
కాకినాడ సిటీ: కలెక్టరేట్‌లో శుక్రవారం నిర్వహించిన ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక స్పందన కార్యక్రమానికి జిల్లావ్యాప్తంగా 10 మంది అర్జీలు అందజేశారు. జిల్లా రెవెన్యూ అధికారి కె.శ్రీధర్‌రెడ్డి, జెడ్పీ సీఈఓ ఎన్‌వీవీ సత్యనారాయణ, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ డీఎస్ సునీత అర్జీలు స్వీకరించారు. వాటిని ఆయా శాఖల అధికారులకు అందజేసి, నిర్దిష్ట గడువులోగా పరిష్కరించాలని ఆదేశించారు. రెవెన్యూ, భూ సమస్యలు, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు, పింఛన్ తదితర సమస్యలపై అర్జీలు వచ్చాయి.
ముగిసిన డ్వామా అధికారుల శిక్షణ
సామర్లకోట: స్థానిక విస్తరణ, శిక్షణ కేంద్రం(ఈటీసీ)లో డ్వామా అధికారులకు మూడు రోజుల పాటు ఇచ్చిన శిక్షణ శుక్రవారం ముగిసింది. అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, తూర్పు గోదావరి, కాకినాడ, కోనసీమ, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం జిల్లాలకు చెందిన డ్వామా ఏపీడీలు, ఏపీఓలు, ఏసీలు, టెక్నికల్ అసిస్టెంట్లకు ఇక్కడ శిక్షణ ఇచ్చారు. డ్వామాలో రూపొందించిన కొత్త స్టాఫ్‌వేర్, పనుల్లో నాణ్యత, సాంకేతిక పరిజ్ఞానం, వ్యక్తిత్వ వికాసం, చేయాల్సిన పనులపై మూడో రోజు శిక్షణలో ఫ్యాకల్టీలు వివరించారు. రాజీవ్, రమేష్, శ్వేత, చంద్రశేఖర్ శిక్షణ ఇచ్చారు. శిక్షణ తీరును విశాఖ ఏపీడీ ఎల్.రామారావు, పంచాయతీరాజ్ రాష్ట్ర టెక్నికల్ రిసోర్స్‌పర్సన్ కె.స్వరూపరాణి పరిశీలించారు. ముగింపు కార్యక్రమంలో రాష్ట్ర పంచాయతీరాజ్, రూరల్ డెవలప్‌మెంట్ అసిస్టెంట్ కమిషనర్ ఇ.కృష్ణమోహన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. శిక్షణ పూర్తి చేసుకున్న వారికి సర్టిఫికెట్లు అందజేశారు. కార్యక్రమంలో ఈటీసీ ఫ్యాకల్టీ ఎంఎస్‌ఎన్ రెడ్డి, స్వరూప, ఎస్‌కె మొహిద్దీన్ కూడా పాల్గొన్నారు.

అర్జీలు స్వీకరిస్తున్న అధికారులు

శిక్షణ పొందిన అధికారులకు సర్టిఫికెట్లు అందజేస్తున్న కృష్ణమోహన్ తదితరులు
Comments
Please login to add a commentAdd a comment