ఆ తెల్లటి పాల వెనక ఎంతటి అక్రమం? ఎంత నేరం? | Crime behind Milk rocket | Sakshi
Sakshi News home page

నిజంగా పాపాల భైరవులే

Published Tue, Apr 18 2023 2:12 AM | Last Updated on Fri, Apr 21 2023 1:57 PM

- - Sakshi

పిఠాపురం: తెల్లనివన్నీ పాలు కాదు అంటుంటారు. అది నిజమనిపించేలా వ్యవహరిస్తున్నారు కొందరు పాల వ్యాపారులు.. డైరీ ఫాం యజమానులు. పాల ఉత్పత్తి పెరిగేందుకు ప్రమాదకర పాలసేపు ఇంజెక్షన్లు వాడుతూ వీరు ఆందోళన కలిగిస్తున్నారు.

ఈ ఇంజెక్షన్ల వినియోగంతో పాల సేపుతో పాటు పాల దిగుబడి పెరుగుతుంది. పాల శాతం ఎంత పెరుగుతుందో దాని కంటే రెట్టింపు ప్రమాదం కూడా పొంచి ఉందని పశువైద్యులు రైతులకు సూచిస్తున్నారు. రైతులను మభ్య పెట్టి కొందరు ప్రైవేటు వ్యాపారులు ఈ ఇంజెక్షన్లను విచ్చలవిడిగా అమ్మడంతో పాటు వినియోగిస్తున్నారు. ఆక్సిటోసిన్‌ అనే ఉత్ప్రేరక ఇంజెక్షన్‌ను వాడడం వల్ల పశువుతో పాటు పాలుతాగే వారికి కూడా ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

పాలు కల్తీ చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పశుసంవర్ధకశాఖాధికారులతో పాటు ఆహార తనిఖీ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ఈనేపథ్యంలో ఆక్సిటోసిన్‌ ఇంజెక్షన్‌ వాడుతున్న వారిపై నిఘా పెట్టేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.

ఇంజెక్షన్‌ ఎప్పుడు వాడతారు

పాడి పశువులు ఈనే సమయంలో ప్రమాదకరంగా మారి ఈనలేనప్పుడు, పొదుగు వాపులో పాలు రానప్పుడు, పశువు ఈనిన తర్వాత మాయ వేయలేనప్పుడు , మొయ్యను సరిదిద్దడానికి ఆక్సిటోసిన్‌ వాడుతుంటారు. ఈ ఆక్సిటోసిన్‌ అనే హార్మోన్‌ను 1953లో కృత్రిమంగా తయారు చేసి వాడేవారు. ఈ ఇంజెక్షన్‌ రెండు నుంచి ఆరు నిమిషాలు రక్తంలో స్రవించి జీవక్రియ జరుగుతుంది. తద్వారా పాలు సేపునకు రావడంతో పాటు ఎక్కువగా పాలు స్రవిస్తాయి.

దీనివల్ల నష్టాలు

ఆక్సిటోసిన్‌ వాడటం వల్ల లాభాల కంటే నష్టాలే ఎక్కువ. ఇది ఒక హార్మోన్‌. దీనిని రోజూ వాడటం వలన పశువుల్లో పునరుత్పత్తి సమస్యలు తలెత్తుతాయి. పశువు ఎదకు వచ్చినా చూలు నిలబడక పోవటం, తిరిగి ఎక్కువ సార్లు పొర్లడం, గర్భస్రావం జరగడం వంటి దుష్పరిణామాలు ఎదురవుతాయి. ఈ హార్మోన్‌ స్రవించిన పాలు తాగడం వల్ల మనుషుల్లోను దుష్ఫరిణామాలు అధికంగా తలెత్తుతాయి.

ముఖ్యంగా పిల్లల్లో వినికిడి, దృష్టి లోపాలు వస్తుంటాయి. శరీరం నుంచి శక్తి నశించి తొందరగా అలసటకు గురవుతారు. చంటి పిల్లలపై ఇది ఎక్కువ ప్రభావం చూపుతుంది. బాలింతల్లో హైపర్‌ సెన్సిటివ్‌ రియాక్షన్‌ రావచ్చు. ఆడ పిల్లల్లో ఈ హార్మోన్‌ ఉన్న పాలు తాగడం వల్ల చిన్న వయసులోనే ప్రౌఢ దశకు చేరతారు.

ఈ ఇంజెక్షన్‌ను 1960లో ప్రివెన్షన్‌ ఆఫ్‌ క్రూయల్టీ టూ యానిమల్స్‌చట్టం–1960 కింద ప్రభుత్వం నిషేధించింది. అయినప్పటికీ కొందరు వ్యాపారులు వీటిని వాడుతున్నారు. అంతేకాదు రైతులకు సరఫరా చేస్తున్నారు.

ఇలా చేస్తే ఇంజెక్షన్‌తో పని లేదు

పశువులకు మేపులో పౌష్టిక దాణాలు, ఖనిజ లవణాలున్న మేతను అందించడం ద్వారా పాల ఉత్పత్తి పెంచుకోవచ్చు. దీనివల్ల పశువులు కూడా ఆరోగ్యంగా ఉంటాయి. రోగాలు దరిచేరవు. అజోల్లా వంటి ఆరోగ్యకరమైన మేతలు ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి. వాటిని రైతులే స్వయంగా తయారు చేసుకోవచ్చు. ఖర్చు తగ్గడంతో పాటు ఆదాయం పెరుగుతుంది. పశువుల ఆరోగ్యమూ మెరుగు పడుతుంది.

అనేక ప్రాంతాల్లో దూడల పోషణ ఆరోగ్యంపై శ్రద్ధ చూపడంలేదు. ఫలితంగా 30 శాతం దూడలు చనిపోతున్నాయి. అలాంటి పరిస్థితుల్లో దూడ లేక పోతే పశువు పాలు ఇవ్వదు. పశువులకు అలవాటు చేసిన ప్రకారం పాలసేపు అనేది వస్తుంది. ముందుగా దూడను తాగించి తరువాత పాలు తీస్తే అదే అలవాటు అవుతుంది. దూడ లేకపోతే పాలు సేపునకు రావు. అలా కాకుండా ముందుగా పాల గిన్నెల శబ్ధాలు అలవాటు చేయడంతో పాటు పితికిన తరువాత దూడలకు పాలు వదలాలి. అలా చేస్తే దూడలేకపోయినా పశువులు పాల సేపునకు వస్తాయి.

– ఎస్‌ సూర్యప్రకాశరావు, జిల్లా పశుసంవర్ధక శాఖాధికారి.

జిల్లాలో పాడి పశువులు

ఆవులు : 76502

గేదెలు : 2.82,273

పాల ఉత్పత్తి : 33474 లీటర్లు (రోజుకు)

1
1/3

2
2/3

3
3/3

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement