
పోలింగ్ స్టేషన్లలో మౌలిక సదుపాయ
కాకినాడ సిటీ: తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో కాకినాడ నగరంలో వివిధ పోలింగ్ స్టేషన్లను కాకినాడ ఆర్డీవో ఎస్.మల్లిబాబు శుక్రవారం పరిశీలించారు. జిల్లా పరిషత్, పీడీ గృహనిర్మాణశాఖ, గ్రామీణ తాగునీటి సరఫరా శాఖ కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ స్టేషన్లను ఆయన పరిశీలించారు. పోలింగ్ స్టేషన్లలో మౌలిక సదుపాయాలు కల్పించాలని, తాగునీరు, విద్యుత్, షామియానా, కుర్చీలు వంటి సౌకర్యాలు ఏర్పాటు చేయాలన్నారు. కాకినాడ డివిజన్‌లో 65 పోలింగ్ కేంద్రాలు ఉన్నట్లు తెలిపారు. అర్బన్ తహసీల్దార్ వి జితేంద్ర, సర్వేయర్ సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు.
సీనియర్ తైక్వాండో పోటీల్లో
జిల్లాకు పతకాలు
నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): హైదరాబాద్‌లోని కోట్ల విజయ భాస్కరరెడ్డి స్టేడియంలో జనవరి 28 నుంచి 30 వరకు జరిగిన జాతీయస్థాయి సీనియర్స్ తైక్వాండో పోటీలలో జిల్లా క్రీడాకారులు పాల్గొని పతకాలు సాధించారని తైక్వాండో సంఘ కార్యదర్శి బి.అర్జునరావు శుక్రవారం తెలిపారు. ఈ పోటీలలో పాల్గొన్న హరికిరణ్, లక్కి రజత పతకాలు సాధించారన్నారు. ఈ సందర్భంగా డీఎస్‌డీఓ బి.శ్రీనివాస్ కుమార్‌ను క్రీడాకారులు డీఎస్‌ఏ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. పతకాలు సాధించిన క్రీడాకారులను, నేషనల్ రిఫరీ ఎం.హర్షవర్ధన్‌లను శ్రీనివాస్ కుమార్ అభినందించారు. కోచ్‌లు డిఎస్‌ఎన్ మూర్తి, కేవి సత్యన్నారాయణ, జి.తులసి, పి.త్రిమూర్తులు పాల్గొన్నారు.
‘సత్రం డోనార్ స్కీం’కు
రూ.5,01,001 విరాళం
అన్నవరం: ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరంలోని శ్రీవీర వేంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానంలో ‘సత్రం డోనార్ స్కీం’ కింద సికింద్రాబాద్‌కు చెందిన చేకొండ నరేష్‌బాబు, విజయ, రంజిత, వినిత కుటుంబ సభ్యులు రూ.5,01,011 విరాళాన్ని ఈఓ వీర్ల సుబ్బారావుకు శుక్రవారం అందచేశారు. ఆ స్కీం కింద హరిహరసదన్ సత్రంలో ఒక గదిని కేటాయించాలని వారు కోరారు. దాతలకు ఆ సత్రంలో ఒక గదిని కేటాయించి ఈ స్కీం కింద లభించే అన్ని సదుపాయాలు అందజేయాలని ఈఓ ఆదేశించారు.
జీజీహెచ్‌లో శిశు ఆధార్
సేవలు ప్రారంభం
కాకినాడ క్రైం: జీజీహెచ్‌లో శుక్రవారం శిశు ఆధార్ సేవలు ప్రారంభమయ్యాయి. ఆసుపత్రి గైనిక్ వార్డులోని బర్త్ రిజిస్ట్రేషన్ విభాగంలో ఈ సేవలను అందుబాటులోకి తెచ్చారు. సీఎస్‌ఆర్‌ఎంవో డాక్టర్ రాజకుమారి రిజిస్ట్రార్‌గా వ్యవహరించనున్న శిశు ఆధార్ సేవలు జీజీహెచ్ ఎంఆర్‌డీ సెక్షన్ ఆధ్వర్యంలో అందించనున్నారు. శిశువుకు ఆధార్‌కార్డు మంజూరు చేయడమే ఈ సేవల లక్ష్యం. జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ లావణ్యకుమారి, డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాసన్, డిప్యూటీ కలెక్టర్ ఎన్.శ్రీధర్, గైనిక్ హెచ్‌వోడీ డాక్టర్ అనురాగమయి, ఎంఆర్‌డీ ఎంఆర్‌వో జయచంద్ర పాల్గొన్నారు.
ఆటోమేటెడ్
టెస్టింగ్ స్టేషన్ ప్రారంభం
కాకినాడ రూరల్: రవాణా వాహనాలకు ఫిట్‌నెస్ సర్టిఫికెట్లను జారీ చేసేందుకు తొలిసారిగా ప్రైవేట్ రంగానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో జిల్లాలో కొత్తూరు జంక్షన్ వద్ద ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్ (ఏటీసీ) అందుబాటులోకి వచ్చింది. శుక్రవారం ఉదయం ఏటీసీను పూజలు నిర్వహించిన ఏటీసీ కంట్రోల్ ఆల్‌ఫిక్స్ సొల్యూషన్స్ సంస్థ నిర్వాహకులు చెరుకూరి కిరణ్, పొట్లూరి బుచ్చిబాబు ప్రారంభించారు. తమ సెంటరులో ఒకే సమయంలో నాలుగు వాహనాలకు టెస్టింగ్ చేయవచ్చని, 20 నిముషాల్లో ఒక వాహనానికి సర్టిఫికెట్ జారీ చేయవచ్చన్నారు.

పోలింగ్ స్టేషన్లలో మౌలిక సదుపాయ

పోలింగ్ స్టేషన్లలో మౌలిక సదుపాయ
Comments
Please login to add a commentAdd a comment