
సత్యదేవుని సన్నిధిలో భక్తజన వాహిని
● స్వామివారిని దర్శించిన 50 వేల మంది
● 4 వేల వ్రతాల నిర్వహణ
● రూ.50 లక్షల ఆదాయం
అన్నవరం: సత్యదేవుని సన్నిధికి ఆదివారం వేలాదిగా భక్తులు పోటెత్తారు. సుమారు 50 వేల మందికి పైగా భక్తులు తరలిరావడంతో ఆలయ ప్రాంగణం, వ్రత, విశ్రాంతి మండపాలన్నీ భక్తులతో కిక్కిరిసిపోయాయి. శనివారం రాత్రి, ఆదివారం తెల్లవారుజామున రత్నగిరిపై, రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో వివాహాలు జరిగాయి. ఆ నవ దంపతులు, వారి బంధుమిత్రులు సత్యదేవుని దర్శించేందుకు రత్నగిరికి తరలివచ్చారు. దీనికి తోడు మాఘ బహుళ దశమి పర్వదినం కావడంతో పెద్ద సంఖ్యలో ఇతర భక్తులు కూడా తరలి వచ్చారు. దీంతో ఆలయంలో తీవ్ర రద్దీ ఏర్పడింది. ఉదయం 9 గంటల వరకూ ఓ మాదిరిగా ఉన్న రద్దీ తరువాత ఒక్కసారిగా పెరిగిపోయింది. సాయంత్రం వరకూ ఆలయం భక్తులతో కిటకిటలాడింది. ఉచిత దర్శనానికి రెండు గంటల సమయం పట్టింది. రద్దీ కారణంగా అంతరాలయ దర్శనాలను మధ్యాహ్నం వరకూ నిలిపివేశారు. మొత్తం 50 వేల మంది భక్తులు రత్నగిరికి వచ్చారని అధికారులు తెలిపారు. దేవస్థానానికి రూ.50 లక్షలు పైగా ఆదాయం సమకూరింది. సత్యదేవుని వ్రతాలు సుమారు 4 వేలు జరిగాయి. స్వామివారి నిత్య కల్యాణంలో 50 మంది పాల్గొన్నారు.
ఘనంగా రథసేవ
ఆలయ ప్రాకారంలో సత్యదేవుని రథసేవ ఘనంగా నిర్వహించారు. ఉదయం 11 గంటలకు సత్యదేవుడు, అమ్మవార్ల ఉత్సవమూర్తులను ఊరేగింపుగా ఆలయం వద్దకు తీసుకువచ్చి టేకు రథంపై వేంచేయించారు. పూజల అనంతరం ఈఓ వీర్ల సుబ్బారావు దంపతులు కొబ్బరికాయ కొట్టి సేవను ప్రారంభించారు. రథంపై ఆలయ ప్రాకారంలో మూడుసార్లు ప్రదక్షిణగా సేవ నిర్వహించారు. ఇదిలా ఉండగా రామారాయ కళావేదికపై ఉదయం 9 గంటల నుంచి సూర్య భగవానుడికి ప్రత్యేక పూజలు, సూర్య నమస్కారాలు ఘనంగా నిర్వహించారు. సత్యదేవుడు, అమ్మవారు సోమవారం ముత్యాల కవచాలు (ముత్తంగి సేవ) ధరించి భక్తులకు దర్శనమివ్వనున్నారు.

సత్యదేవుని సన్నిధిలో భక్తజన వాహిని
Comments
Please login to add a commentAdd a comment