
ఎలా చక్కదిద్దాలి?
అన్నవరం దేవస్థానంపై నేడు కలెక్టర్ సమీక్ష
అన్నవరం: రాష్ట్రంలోని ఏడు ప్రముఖ దేవస్థానాలపై దేవదాయ శాఖ నిర్వహించిన ఐవీఆర్‌ఎస్ సర్వేలో అన్నవరం దేవస్థానం ఏడో ర్యాంకుతో చిట్టచివరి స్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దేవస్థానంలో అన్ని విధాలా దిగజారిన పరిస్థితులను చక్కదిద్దే లక్ష్యంతో జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి సోమవారం సమీక్ష నిర్వహించనున్నారు. రత్నగిరిపై ప్రకాష్ సదన్ సత్రంలోని ట్రస్ట్‌బోర్డు సమావేశ హాలులో ఉదయం 10 గంటలకు ఈ సమావేశం జరుగుతుంది. ఇందులో దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్, ఈఓ వీర్ల సుబ్బారావు, ఇతర అధికారులు పాల్గొంటారు. ఈ సందర్భంగా మొదటి ర్యాంకు సాధించేందుకు తీసుకోవలసిన చర్యలపై చర్చించనున్నారు. దేవస్థానంలో భక్తులకు అందుతున్న సేవల్లో అనేక లోపాలు చోటు చేసుకుంటున్నాయి. సత్రాల్లో వసతి సమస్యలు నెలకొన్నాయి. ఆలయ ప్రాంగణంలో ఎక్కడా నీడ లేని దుస్థితి. భక్తుల కాళ్లు కాలకుండా కనీసం తెల్ల పెయింట్ కూడా వేయడం లేదు. వీటికి తోడు దేవస్థానం ఆర్థిక పరిస్థితి దిగజారింది. పాలనపై అధికారులు పట్టు కోల్పోవడంతో సిబ్బందిలో నిర్లక్ష్య వైఖరి నెలకొంటోంది. ప్రతి రోజూ వందకు పైగా గదులు వీఐపీల పేరిట అనధికారికంగా రిజర్వేషన్లు చేస్తున్నారు. ఇలా దేవస్థానంలో ఎన్నో సమస్యలున్నాయి. ఇన్నాళ్లుగా వీటిని పరిష్కరించకపోగా, ఆ దిశగా తీసుకున్న చర్యలు కూడా లేకపోవడంపై కూడా కలెక్టర్ సమీక్షించాలని భక్తులు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment