వరాల వసంతం
30 రోజులు ప్రత్యేకం
● రంజాన్ మాసంలో తొలి 10 రోజులు
కారుణ్య దినాలు.
● 10 నుంచి 20 క్షమాపణ రోజులు,
● 20 నుంచి 30 వరకూ నరకాగ్ని నుంచి
విముక్తి దినాలు.
ప్రత్యేక ప్రార్థనలు
ముస్లింలు ఈ మాసమంతా ఆధ్యాత్మికంగా గడుపుతారు. ప్రత్యేక ప్రార్థనలు, ఆరాధనల్లో నిమగ్నమవుతారు. రోజూ సూర్యాస్తమయం వరకూ కఠోర ఉపవాస దీక్షలు పాటిస్తారు. దానధర్మాలు చేస్తారు. ఐదు పూటలా నమాజ్‌తో పాటు తరావీ ప్రార్థనల్లో పాల్గొంటారు. 30 అధ్యాయాలున్న ఖురాన్‌ను నెలలోగా పఠించాలన్న ప్రవక్త ఆదేశాన్ని తప్పక పాటిస్తారు. పేదలకు సంపన్నులు జకాత్ చెల్లిస్తారు. చివరి పది రోజులూ ఇంటిని వదిలి మసీదుల్లో ఉంటూ దైవస్మరణ చేస్తారు. పండగకు ముందు ఫిత్రా ఇస్తారు. ఉపవాస సమయంలో జరిగిన తప్పులు, లోటుపాట్లకు ఈ ఫిత్రా పరిహారం. ఉపవాసాలు పాటించిన వారు, పాటించని వారు, చిన్నాపెద్దా అనే తారతమ్యం లేకుండా దానం చేస్తారు.
● నెలవంక దర్శనంతో ప్రారంభమైన
పవిత్ర రంజాన్ మాసం
● ఉపవాస దీక్షలకు సిద్ధమైన ముస్లింలు
● తరావిహ్ నమాజ్ ప్రారంభం
● ఉమ్మడి జిల్లా మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు
● విద్యుద్దీపాలతో శోభిల్లుతున్న
ప్రార్థనా స్థలాలు
సాక్షి, రాజమహేంద్రవరం: ముస్లింలకు సమస్త శుభాలూ కలిగించే పవిత్ర మాసం రంజాన్. శనివారం సాయంత్రం నెలవంక దర్శనంతో ఈ మాసం ప్రారంభమైంది. ‘ఓ నెలవంకా! నీ దేవుడు, మా దేవుడు, అందరి దైవం అల్లాహ్ మాత్రమే’ అంటూ ప్రార్థించి నెలవంకను ముస్లింలు వీక్షించారు. మసీదుల్లో ఇమామ్‌లు రంజాన్ మాసాన్ని ప్రకటించారు. దీంతో శనివారం రాత్రి నుంచే తరావీహ్ నమాజ్ ప్రారంభమైంది. ఆదివారం వేకువజాము నుంచి ఉపవాస దీక్షలను ముస్లింలు ప్రారంభిస్తున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకూ ఎలాంటి ఆహారం, కనీసం నీళ్లు కూడా తాగకుండా కఠోర నిష్టతో దీక్ష పాటిస్తారు.
ఉమ్మడి ‘తూర్పు’న ఆధ్యాత్మిక శోభ..
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లావ్యాప్తంగా దాదాపు 400 మసీదులున్నాయి. పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా మసీదులన్నీ ఆధ్యాత్మిక శోభ సంతరించుకున్నాయి. రంగురంగుల విద్యుద్దీపాలతో శోభిల్లుతున్నాయి. ముస్లింలు రోజా, నమాజ్, జికర్, దువాలతో గడపనున్నారు. మసీదుల్లో ఆధ్యాత్మిక సందడి నెలకొంటోంది. సహెరి, ఇఫ్తార్ విందులతో హడావుడి కనిపించనుంది. ఉపవాస దీక్షలు ఆచరించేందుకు అవసరమైన నిత్యావసరాలను ముస్లింలు విరివిగా కొనుగోలు చేశారు.
ఉపవాసం ప్రత్యేకత
ఇస్లాంలో నాలుగో మూలస్తంభం ఉపవాసం. ముస్లిం సమాజం త్రికరణ శుద్ధితో ఆచరించే ఆరాధనా వ్రతమిది. ఎదుటి వారి ఆకలి విలువ గుర్తించాలన్నది దీని ప్రధాన ఉద్దేశం. ఉపవాసాన్ని అరబీ భాషలో ‘సౌమ్’గా, ఉర్దూలో ‘రోజా’గా పిలుస్తారు. ఇస్లామియా క్యాలెండర్ ప్రకారం తొమ్మిదో నెల అయిన రంజాన్ మాసంలో ఈ ఆరాధన వ్రతాన్ని పాటిస్తారు. ఇస్లాం ధర్మశాస్త్ర పరిభాషలో సౌమ్ అంటే ఆగి ఉండటం. అంటే ఉషోదయం నుంచి సూర్యాస్తమయం వరకూ తినడానికి, తాగడానికి, మనోవాంఛలకు దూరంగా ఉండటమని అర్థం.
ఉపవాసం మినహాయింపు
మనిషి బలహీనతలను, వారి కష్టసుఖాలను బాగా ఎరిగిన దైవం ఉపవాసాన్ని విధిగా నిర్ణయించినప్పటికీ, కొందరికి మినహాయింపులు కూడా ఇచ్చారు. చిన్న పిల్లలు, బాటసారులు, వ్యాధిగ్రస్తులు, వృద్ధాప్యం మరీ ఎక్కువైనవారు, మతిస్థిమితం లేనివారు, అశుద్ధావస్థలో ఉన్న మహిళలకు ఉపావాసం నుంచి మినహాయింపు ఉంది.
దివ్య ఖురాన్ అవతరణ మాసం
ముస్లింలు అత్యంత పవిత్రంగా భావించి, సదా ఆచరించే దివ్య గ్రంథం ఖురాన్ ఈ మాసంలోనే అవతరించింది. ఇతర ప్రవక్తలపై ఫర్మానులు సైతం ఇదే నెలలో అవతరించాయి. అందుకే ఈ నెలకు అంత ప్రాధాన్యం. ఈ సమయంలో సైతాను బందీ అవుతాడని, నరక ద్వారాలు మూతపడి స్వర్గ ద్వారాలు తెరచుకుంటాయని ముస్లింల ప్రగాఢ విశ్వాసం.
తరావిహ్ నమాజ్ ప్రారంభం
రంజాన్ మాసంలో నెలవంక దర్శనమిచ్చినప్పటి నుంచే తరావిహ్ నమాజ్ ప్రారంభమవుతుంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అన్ని మసీదుల్లో రంజాన్ మాసం ముగిసే (మళ్లీ నెలవంక దర్శనమిచ్చేంత) వరకూ ప్రతి రోజూ రాత్రివేళ నమాజ్ కొనసాగుతుంది. ఈ సందర్భంగా రోజుకు ఖురాన్‌లోని కొన్ని అధ్యాయాలు చదివి వినిపిస్తారు. మాసం పూర్తయ్యేలోగా ఖురాన్ పఠనం పూర్తి చేస్తారు.
నాలుగు వాక్యాలే ప్రధానం
పవిత్ర రంజాన్ మాసంలో మహ్మద్ ప్రవక్త నాలుగు విషయాల్ని అధికంగా స్మరించాలని ఉపదేశించారు. వాటి ప్రాముఖ్యతను ధార్మిక పండితులు వివరిస్తారు. లాయిలాహ ఇల్లల్లాహ్, అస్తగ్‌ఫిరుల్లా.., అస్ అలుకజన్నత్, అవుజుబికమిన్నార్.. ఎక్కువగా పఠించాలి.
సంకల్పం
ప్రవక్త బోధించిన ‘నవయతు అన్ అసుముగజన్ లిల్లాహి తాలా మిన్ సౌమిరమజాన్’ అనే వచనాలు పఠించి ముస్లింలు ఉపవాస వ్రతానికి శ్రీకారం చుడతారు. ఉపవాస విరమణ సమయంలో ‘అల్లాహుమ్మ లకసుంతు వబిక ఆమంతు, వ అలైక తవక్కత్‌తు, వ ఆలారిస్కిక అఫ్‌తర్‌తు ఫతఖబ్బల్ మిన్ని’ అని వచిస్తారు.
ఇఫ్తార్
సూర్యాస్తమయం తరువాత ఏదైనా ఆహారం తీసుకుని ఆ రోజు దీక్షను విరమించడమే ఇఫ్తార్. ఖర్జూరాలతో ఇఫ్తార్ చేయడం ప్రవక్త సంప్రదాయం. అందుకే ముస్లింలందరూ ఖర్జూరాలతోనే ఇఫ్తార్ చేస్తారు. దీక్ష విరమించే సమయంలో ఉపవాసి దేనిని అర్ధించినా అల్లాహ్ స్వీకరిస్తాడని ప్రగాఢ విశ్వాసం. ఉపవాసికి ఇఫ్తార్ ఇవ్వడం దైవసేవగా భావించి, విందు ఇచ్చేవారి పాపాలను దేవుడు క్షమిస్తాడని ముస్లింలు నమ్ముతారు.
సహర్
ఉపవాసం (రోజా) ఉండదలచిన వారు తెల్లవారుజామున 4 గంటల సమయంలో భోజనం చేస్తారు. దీనినే సహర్ అంటారు. సాయంత్రం వరకూ ఏ పదార్థాన్నీ తినరు. ఏదైనా కారణం వల్ల సహర్ తీసుకోకపోయినా వ్రతాన్ని మాత్రం ఆపరు.
Comments
Please login to add a commentAdd a comment