
ప్రజలు కమ్యూనిస్టులను ఆదరిస్తారు
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు
కాకినాడ సిటీ: అమరవీరుల స్ఫూర్తితో నిరంతరం ప్రజాసేవ చేస్తే ప్రజలు కమ్యూనిస్టులను తప్పనిసరిగా ఆదరిస్తారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఆదివారం కాకినాడ అన్నదాన సమాజంలో నవ సమాజం కోసం పుస్తకావిష్కరణ సభ సీపీఎం జిల్లా కార్యదర్శి కరణం ప్రసాదరావు అధ్యక్షతన జరిగింది. ఈ సభలో శ్రీనివాసరావు ముఖ్యవక్తగా మాట్లాడారు. కమ్యూనిస్టు ఉద్యమ చరిత్ర అంటే ఆ కాలంలో ప్రజా పోరాటాల చరిత్రే అన్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో స్వాతంత్రోద్యమ కాలంలోనే కమ్యూనిస్టు బీజాలు పడ్డాయన్నారు. ఆనాడు కాకినాడ అన్నదాన సమాజంలో రహస్యంగా పార్టీ ఏర్పడిందన్నారు. 1934–1964 మధ్య జిల్లాలో కమ్యూనిస్టు ఉద్యమ ఘట్టాలను వివరిస్తూ సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు దువ్వా శేషుబాబ్జీ నవ సమాజం కోసం పేరుతో పుస్తకం రచించడం అభినందనీయమన్నారు. కమ్యూనిజం అంతరించిపోయిందని ప్రచారం జరిగిన అమెరికాలోనే కమ్యూనిస్టు పేరు వింటేనే ట్రంప్ ఉలిక్కి పడతున్నారన్నారు. దేశంలో ఆర్థిక సంక్షోభం తీవ్రతరం అవుతున్న నేపథ్యంలో ప్రజలు ఎర్రజెండా వైపు చూస్తారన్నారు. అమరుల స్ఫూర్తితో ప్రజల నుంచి నేర్చుకుని ఉద్యమాన్ని బలోపేతం చేసుకోవాలన్నారు. డాక్టర్ చెలికాని స్టాలిన్, డాక్టర్ పి.చిరంజీవినీకుమారిలతో పాటు సీపీఐ నాయకులు తాటిపాక మధు, బోడకొండ, కె.సత్తిబాబు, న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి జె.వెంకటేశ్వర్లు, లిబరేషన్ నాయకులు గొడుగు సత్యనారాయ, చిన్నిబిల్లి నాగేశ్వరరావు, సీపీఐ ఎంఎల్ నాయకులు నాగరాజు, కొండ దుర్గారావు, సీపీఎం నాయకులు టి.అరుణ్ తదితరులు సమావేశంలో మాట్లాడారు. దేశాన్ని మతోన్మాద శక్తుల బారి నుంచి కాపాడుకోవాలన్నారు. ఐక్య ఉద్యమాలకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. శేషుబాబ్జీ కృషిని నాయకులు అభినందించారు. కమ్యూనిస్టు ఉద్యమంలో అమరులైన నాయకుల కుటుంబ సభ్యులు పలువురు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సభా ప్రాంగణంలో అమరుల ఫొటోలతో పాటు వారి గురించి క్లుప్తంగా తెలియజేస్తూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. సభకు ముందుగా అమరులకు నివాళులర్పించారు. సభలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఏవీ నాగేశ్వరరావుతో పాటు రచయిత దువ్వా శేషుబాబ్జీ, నాయకులు జి బేబీరాణి, కేఎస్ శ్రీనివాస్, పలివెల వీరబాబు, సీహెచ్ రమణి, సీహెచ్ రాజ్‌కుమార్, నీలపాల సూరిబాబు, కె సత్తిరాజు, మలక వెంకటరమణ, దుంపల ప్రసాద్, కె నాగజ్యోతి, చంద్రమళ్ల పద్మ, చంద్రావతి, రాణి, నాగలక్ష్మి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment