రత్నగిరిపై భక్తుల సందడి
● సత్యదేవుని దర్శించిన 30 వేల మంది
● ఘనంగా సత్యదేవుని రథ సేవ
అన్నవరం: రత్నగిరి వాసుడు సత్యదేవుడిని ఆదివారం పెద్ద సంఖ్యలో భక్తులు దర్శించి పూజలు చేశారు. సెలవు దినం కావడంతో ఉదయం నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. వీరంతా స్వామివారి వ్రతాలాచరించి దర్శనం చేసుకున్నారు. దీంతో సత్యదేవుని ఆలయం వద్ద రద్దీ ఏర్పడింది. సత్యదేవుని దర్శనానికి గంట, ప్రత్యేక దర్శనానికి అరగంట సమయం పట్టింది. సత్యదేవుడిని దర్శించిన అనంతరం భక్తులు సప్తగోకులంలో గోవులకు ప్రదక్షిణ చేసి రావిచెట్టు వద్ద జ్యోతులు వెలిగించారు. ఆదివారం స్వామివారిని 30 వేల మంది దర్శించగా, వ్రతాలు 1,500 నిర్వహించారు. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.30 లక్షల ఆదాయం సమకూరింది. సుమారు ఐదు వేల మంది భక్తులకు సత్యదేవుని నిత్యాన్నదాన పథకంలో ఉచిత భోజన సౌకర్యం కలుగచేశారు. ఆదివారం సత్యదేవుని రథసేవ ఆలయ ప్రాకారంలో ఘనంగా నిర్వహించారు. ఉదయం 11 గంటలకు సత్యదేవుడు, అమ్మవార్ల ఉత్సవమూర్తులను ఊరేగింపుగా ఆలయం వద్దకు తీసుకువచ్చి టేకు రథంపై ఉంచారు. స్వామి, అమ్మవార్లకు పూజలు చేసిననంతరం పండితులు రథసేవ ప్రారంభించారు. వేదపండితుల మంత్రోచ్ఛాటన మధ్య, మంగళవాయిద్యాల నడుమ మూడుసార్లు రథంపై ఆలయ ప్రాకారంలో సేవ నిర్వహించారు. సేవ అనంతరం పండితులు స్వామి, అమ్మవార్లకు నీరాజనం ఇచ్చి ఇచ్చారు. వేదపండితులు గొల్లపల్లి ఘనపాఠీ, శివ, యనమండ్ర శర్మ, గంగాధరబట్ల గంగబాబు, అర్చకులు సుధీర్. పరిచారకులు పవన్ తదితరులు కార్యక్రమాలు నిర్వహించారు. ఉత్తరకంచికి చెందిన భక్తులు రూ.2,500 చెల్లించి రథసేవలో పాల్గొన్నారు. సోమవారం సత్యదేవుడు, అమ్మవారు ముత్యాల కవచాలను (ముత్తంగిసేవ) ధరించి భక్తులకు దర్శనమివ్వనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment