
మెట్టకు సాగునీటి కష్టం
ఇవీ లెక్కలు..
● జిల్లాలో పంట భూములు– 1,77,030 ఎకరాలు
● గోదావరి డెల్టా – (10 మండలాలు) 1,24,798 ఎకరాలు
● ఏలేరు కాలువ భూములు – (6 మండలాలు) 44,250 ఎకరాలు
● ఏలేరు నిల్వ సామర్థ్యం – 86.56 మీటర్లు
● నీటి నిల్వ సామర్థ్యం– 24.11 టీఎంసీలు
● డెడ్‌స్టోరేజ్ – 6.16 టీఎంసీలు
● కాలువల ద్వారా సరఫరా – 17.95 టీఎంసీలు
● ప్రస్తుతం రిజర్వాయర్‌లో నిల్వ – 12.98 టీఎంసీలు
● ఇన్‌ఫ్లో రోజుకు సగటున – 266 క్యూసెక్కులు
● ఎడమ కాలువకు – 200 క్యూసెక్కులు
● డీసీఆర్‌కు – 500 క్యూసెక్కులు
● స్పిల్‌వే విడుదల – 900 క్యూసెక్కులు
● రైతు గోడు పట్టని పవన్
● సొంత నియోజకవర్గంలో నీటి ఎద్దడి
● సందిగ్ధంలో శివారు ఆయకట్టు
● సాగునీరు అందక మెట్ట రైతు పాట్లు
● పీబీసీ శివారున ఇదే దుస్థితి
● నిండుకున్న ఏలేరు జలాలు
సాక్షి ప్రతినిధి, కాకినాడ: సాగునీటి ఎద్దడితో జిల్లాలో మెట్ట ప్రాంత రైతులు గొల్లుమంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి రబీ సాగునీటి సరఫరాపై ముందుచూపు లేకపోవడం ఈ ప్రాంత రైతులకు శాపంగా పరిణమించింది. ఏలేరులో నీటి కొరతను అధిగమించడంలో కూటమి ప్రభుత్వ వైఫల్యాన్ని రైతు సంఘాల ప్రతినిధులు ప్రశ్నిస్తున్నారు. జిల్లా అంతా ఒక ఎత్తు పిఠాపురం నియోజకవర్గం పరిస్థితి మరో ఎత్తు అన్నట్టుగా ఉంది. స్వయంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తోన్న పిఠాపురం నియోజకవర్గంలోనే రైతులు సాగునీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నారు. పిఠాపురం నియోజకవర్గంలో సాగునీటి ఎద్దడితో రైతుల గోడు కనీసం పట్టించుకోకుండా జనసేన పార్టీ 12వ వార్షికోత్సవానికి ఏర్పాట్లు చురుగ్గా చేసుకోవడాన్ని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఏలేరు, పిఠాపురం బ్రాంచ్ కెనాల్స్‌పై ఆధారపడ్డ ఆయకట్టు శివారున ఉన్న పలు ప్రాంతాల్లో రబీ సాగు సందిగ్ధంలో పడింది. జనసేనలో నంబర్–2గా ఉన్న నాదెండ్ల మనోహర్ వారం తిరగకుండానే ఒక పర్యాయం పిఠాపురం, రెండు పర్యాయాలు కాకినాడలో పర్యటించినా నియోజకవర్గ రైతుల రబీ కష్టాల వైపు కన్నెత్తి చూడకపోవడాన్ని రైతు సంఘాల ప్రతినిధులు ఆక్షేపిస్తున్నారు. పార్టీ కార్యక్రమాలకు ఇచ్చే ప్రాధాన్యం శివారు ఆయకట్టులో ఇబ్బందులకు ఇవ్వరా అని రైతులు నిలదీస్తున్నారు. రబీ సన్నాహానికి ముందు మాత్రం అధికార యంత్రాంగం పిఠాపురం బ్రాంచ్ కెనాల్ పరిధిలో 32,500 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు సరఫరా చేస్తామని ప్రకటించింది. ఇందులో 22,260 ఎకరాల్లో వరి, 10,240 ఎకరాల్లో అపరాల సాగుకు ఢోకా లేదనడంతో రైతులు గంపెడాశలతో రబీ సాగుకు సమాయత్తమయ్యారు. ఇంతలో ఏలేరులో ఎదురైన నీటి కొరత రైతులకు గుదిబండగా మారింది.
శివారు రైతుల గగ్గోలు
రబీ సీజన్‌లో రైతులు సాగుకు సమాయత్తమయ్యే సమయానికి ఏలేరులో 20 టీఎంసీలు ఉంది. ప్రస్తుతం 12.98 టీఎంసీలు మాత్రమే కనిపిస్తోంది. వీటిలో 4.50 టీఎంసీలు విశాఖ స్టీల్ ప్లాంట్‌కు పోగా మిగిలిన 6.16 టీఎంసీలు డెడ్ స్టోరేజ్‌గా పరిగణిస్తున్నారు. మరో 1.31 టీఎంసీలు ఏలేరు ప్రాంత ఆయకట్టు భూములు 53 వేల ఎకరాలకు అందించాల్సి ఉంది. 28 వేల ఎకరాల్లో వరి, 25 వేల ఎకరాల్లో ఉద్యానవన పంటలకు సాగు నీరు అందించాలి. ఏలేరు పరిధిలో రబీకి సాగునీటి ఎద్దడి కారణంగా పిఠాపురం నియోజకవర్గంలో శివారు ఆయకట్టు ప్రాంతాల్లో రైతులు గగ్గోలు పెడుతున్నారు. పంట చేతికందే దశలో సా గునీటికి కటకటలాడిపోతున్నామని ఆందోళన చెందుతున్నారు. అసలే ఎండల తీవ్రతతో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతోన్న తరుణంలో సాగునీరు లేక పంట భూములు నెర్రలు బారడంతో ఏలేరు రైతు కంటకన్నీరు పెడుతున్నారు. ఏలేరు రిజర్వాయర్‌లో నిలువలు అడుగంటడంతో శివారు ఆయకట్టు రైతుల పరిస్థితి అడకత్తెరలో పోక చెక్కను తలపిస్తోంది. రిజర్వాయర్‌లో ఉన్న అరకొర నీటిని కాలువల ద్వారా సరఫరా చేసినా ఏలేరుకు ఎగువనున్న ప్రత్తిపాడు, పెద్దాపురం తదితర మండలాల ఆయకట్టుకే సరిపోతోందని చెబుతున్నారు. దిగువన ఉన్న తమ పొలాలకు చుక్కనీరు రావడం లేదని స్థానిక రైతులు మదనపడుతున్నారు.
సర్కారు తీరుపై రైతుల ఆగ్రహం
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వ హయాంలో రబీ సీజన్‌లో డెడ్ స్టోరేజీ 6.16 టీఎంసీలు ఉంది. అయినప్పటికీ పంపింగ్ చేసి సాగుకు సరిపడా రెండు టీఎంసీలు సరఫరా చేసి రైతుల కడగండ్లకు పుల్‌స్టాప్ పెట్టారు. ఫలితంగా నాడు రబీ పంటకు ఎటువంటి సాగునీటి ఎద్దడి ఎదురు కాకుండా రైతులు పంట పండించారు. ఇప్పుడు ఇందుకు భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. రైతులపై మానవత్వం చూపని ప్రభుత్వం ఏలేరు శివారు ఆయకట్టు రైతుల గోడు పట్టించుకోలేదు. ప్రస్తుతం ఏలేరు డెడ్ స్టోరేజ్ 6.16 టీఎంసీలలో 2 టీఎంసీలు పంపింగ్ చేయాలన్న రైతుల డిమాండ్‌ను పట్టించుకునే నాథుడే కరవయ్యాడు. పైకి మాత్రం రైతులంటే వల్లమాలిన అభిమానం ఉన్నట్టుగా చంద్రబాబు సర్కార్ ప్రచారం చేసుకుంటోందని రైతు సంఘాల ప్రతినిధులు ఆక్షేపిస్తున్నారు. ఏలేరు ఆయకట్టు పరిధి రైతుల్లో 70 శాతం మంది కౌలు రైతులే. కౌలుకు తీసుకుని రూ.లక్షలు పెట్టుబడులు పెట్టారు. రబీలో ఎకరాకు రూ.20 వేల వరకు కౌలు చెల్లించి మరో రూ.25 వేలు పెట్టుబడులు పెట్టిన కౌలు రైతులు గగ్గోలు పెడుతున్నారు. రైతులపై కపట ప్రేమ చూపించే కూటమి నేతలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలా అధికారంలోకి వచ్చాక మరోలా వ్యవహరిస్తున్నారని రైతులు మండిపడుతున్నారు.
నెర్రలు తీసిన పొలాలు
పిఠాపురం మండలం రాపర్తి, రాయవరం, భోగాపురం, కొత్తపల్లి మండలం ఎండపల్లి, గోల్లప్రోలు మండలంలో శివారు ఆయకట్టుకు సాగునీరు అందక రైతులు ఆందోళన చెందుతున్నారు. బోగాపురం, రాయవరం, రాపర్తి గ్రామాల్లోని ఆయకట్టుకు సాగునీరందడం లేదు. వారం పది రోజులుగా ఇదే దుస్థితి కొనసాగుతోంది. రైతుల మొర ఆలకించే ఓపిక ఈ ప్రాంత ప్రజాప్రతినిధులకు లేకుండా పోయింది. వంతుల వారీగా విడుదల చేసిన నీరు ఎంత మాత్రం సరిపోవడం లేదని రైతులు అంటున్నారు. పంట ఇప్పుడిప్పుడే గింజ గట్టిపడే దశలో ఉంది. సాగు నీటి అవసరం ఇప్పుడే ఎక్కువగా ఉంటుంది. సరిగ్గా ఇదే సమయంలో సాగునీరు అందక పంట పొలాలు నెర్రలు తీసి రైతులు కన్నీరు పెడుతున్నారు.
తొండంగి మండలంలోని శివారు ప్రాంత ఆయకట్టు రైతులు సాగునీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నారు. పిఠాపురం బ్రాంచ్ కెనాల్ పై ఆధారపడ్డ తొండంగి మండలంలోని దిగువ ప్రాంత ఆయకట్టుకు అరకొరగా నీరు అందుతోంది. గొల్లప్రోలు మండలం మల్లవరం చెరువు(ఆర్‌ఆర్‌బీ ట్యాంక్) నుంచి పిఠాపురం బ్రాంచి కెనాల్ ద్వారా తొండంగి మండలం రావికంపాడు, ఏవి నగరం, కొమ్మనాపల్లి మీదుగా కోదాడ ఉప్పుచెరువుకు సాగునీరు సరఫరా అవుతుంది. ఈ చెరువు ఆయకట్టు కింద శృంగవృక్షంపేట, శృంగవృక్షం, పాత కోదాడ, కొత్తకోదాడ గ్రామాల్లో రబీ సాగవుతోంది. ఈ గ్రామాల్లోని శివారు ఆయకట్టుకు సాగునీటి ఎద్దడి ఏర్పడటంతో ఇటీవల రైతులు ఆందోళనకు దిగారు. విషయం తెలిసి జిల్లా వ్యవసాయాధికారి వచ్చి సమస్య పరిష్కారిస్తామని చెప్పి వెళ్లారు. రెండు, మూడు రోజులు నీటి ఎద్దడి తీరిందనుకుంటుండగా ఇప్పుడు మళ్లీ ఇబ్బంది ఎదురవుతోందని రైతులు చెబుతున్నారు. చిరు పొట్ట దశలో ఉన్న తరుణంలో సాగునీటి ఎద్దడితో నష్టపోతామని రైతులు ఆవేదన చెందుతున్నారు.
గోడు వినే నాధుడేడి
సాగునీరు లేక పంటలు ఎండిపోతున్నాయి. ఎన్నిసార్లు చెప్పినా నీరు ఇవ్వడం లేదు. పంటలు ఎండిపోతుంటే ఏమి చేయాలో తెలియక గుడ్లు అప్పగించి చూస్తున్నాం. సుమారు 40 వేల పెట్టుబడి పెట్టి పంటలు సాగు చేశా. ఇప్పుడు పంట ఎండిపోతే పెట్టుబడి కూడా రాదు. అన్ని అప్పు చేసి పెట్టినవే పంటలకు నీరు ఇచ్చి ఆదుకోక పోతే ఇక చావే శరణ్యం.
– పోతుల తాతారావు, కౌలు రైతు, భోగాపురం, పిఠాపురం మండలం
వంతులవారీతో కొంత ఆలస్యం
ఏలేరు శివారు ప్రాంతాలకు వంతుల వారీ విధానం వల్ల కొంత ఆలస్యం అవుతుంది. వంతు వచ్చే సరికి భూమి నెర్రలు తీస్తోంది. తేమ ఉండడం వల్ల పంటలు ఎండిపోవు. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. వేసవికాలం ముందుగా రావడంతో నీటి ఎద్దడి ఏర్పడింది. ఏలేరు రిజర్వాయర్‌లో తగినంత నీరు ఉంది. కాలువలు బాగోక సరఫరా ఇబ్బంది అవుతోంది. ఉపాధి హామీ పథకంలో కాలువలు శుభ్రం చేయించి నీరు వదులుతున్నాం.
– శేషగిరిరావు, ఈఈ, నీటిపారుదల శాఖ, ఏలేరు
08కేకేడీ 04:
మరమ్మతులతో రబీకి నష్టం
ఈ సీజన్‌లో రైతులకు పంపా ఆయకట్టు పరిధిలో రబీ సాగే లేకుండా పోయింది. పంపా ఆయకట్టు రైతులకు గడచిన నాలుగు సంవత్సరాలు స్వర్ణ యుగమనే చెప్పాలి. ప్రతి ఏటా రబీకి ఇబ్బంది లేకుండా అప్పటి వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ముందస్తు ఏర్పాట్లు చేసింది. స్థానిక ప్రజాప్రతినిధులు పట్టుబట్టి రబీలో సాగునీటికి ఇబ్బంది లేకుండా చూశారు. అటువంటిది చంద్రబాబు కూటమి ప్రభుత్వంలో పంపా ఆయకట్టు రైతులకు కష్టాలు మళ్లీ మొదలయ్యాయి. పంపా ప్రాజెక్ట్ కింద 12,500 ఎకరాలు సాగవుతోంది. బ్యారేజీ ఆధునీకరణ పేరుతో రబీ నీరు విడుదలకు బ్రేక్‌లు వేశారు. నాలుగేళ్లుగా రబీలో సాగుచేస్తోన్న రైతులు ఈ రబీలో సాగునీరు లేక పంట గాలికొదిలేశారు. గేట్లు మరమ్మతులకని ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌లో 3.36 కోట్లు ప్రకటించారు. ఈ నిధులతో గేట్లు మరమ్మతులు నెలాఖరులోపు పూర్తి చేయాలి. లేకపోతే ఆ నిధులు మురిగిపోయే ప్రమాదం ఉంది. ఈ మరమ్మతుల పేరుతో రబీ కోల్పోవాల్సి వచ్చిందని ఆయకట్టు రైతులు లబోదిబోమంటున్నారు.

మెట్టకు సాగునీటి కష్టం
Comments
Please login to add a commentAdd a comment