కాకినాడ రూరల్: జయలక్ష్మి సొసైటీ బాధితుల సంఘం సమావేశం ఆదివారం మధ్యాహ్నం స్థానిక చల్లా కల్యాణ మండపంలో నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా చైర్మన్, డైరెక్టర్ల పని తీరుపై చర్చించడంతో పాటు సభ్యుల అభిప్రాయాల మేరకు తీర్మానాలు చేస్తామని సంఘం అధ్యక్షుడు బదరీ నారాయణ తెలిపారు. అయితే, బాధితులకు అండగా పని చేస్తున్న తమపై నిందలు తగవని పాలకవర్గం చైర్మన్ గంగిరెడ్డి త్రినాథరావు చెబుతున్నారు.
20 వేల మంది బాధితులు
సర్పవరం జంక్షన్ మెయిన్ బ్రాంచ్‌గా ఆరు జిల్లాల్లో దాదాపు 29 బ్రాంచ్‌లతో గతంలో ఏర్పాటైన జయలక్ష్మి ఎంఏఎం సొసైటీ 2022 మార్చి 31న బోర్డు తిప్పేసింది. అప్పటి పాలవర్గం ఆర్థిక నేరాలకు పాల్పడడటంతో సుమారు 20 వేల మంది సభ్యులు వీధిన పడ్డారు. దీనిపై అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, నాటి సహకార శాఖ మంత్రి కురసాల కన్నబాబు తీవ్రంగా స్పందించారు. బాధితులకు న్యాయం చేసేందుకు తక్షణం సిట్ ఏర్పాటు చేసి, ఈ కేసును సీఐడీకి అప్పగించారు. సీఐడీ అధికారులు గత పాలకవర్గం చైర్‌పర్సన్ విశాలాక్షితో పాటు డైరెక్టర్ జైలుకు పంపారు. బాధితులకు సొమ్ము తిరిగి ఇప్పించేందుకు అప్పట్లో భారీ రుణాలు తీసుకున్న వారి నుంచి రికవరీ కోసం కేసులు నమోదు చేశారు.
రుణ గ్రహీతలకు సంబంధించి 84 కేసుల్లో రూ.300 కోట్ల మేర ఆస్తులపై సీఐడీ అధికారులు చార్జిషీట్ దాఖలు చేశారు. మరో 110 కేసుల్లో రూ.200 కోట్ల విలువైన ఆస్తులను స్వాధీనం చేసుకునేందుకు రంగం సిద్ధం చేశారు. వివాదాల పరిష్కారానికి కమిటీ ఏర్పాటు చేసి 465 కేసులకు సంబంధించి రూ.497 కోట్లకు ఒక కేసు సివిల్ కోర్టులో, వాటిలో మరో 190 కేసులకు కో ఆపరేటివ్ ట్రిబ్యునల్ ఏర్పాటు చేశారు. ఈ పరిస్థితుల్లో గంగిరెడ్డి త్రినాథరావు చైర్మన్‌గా నూతన పాలకవర్గం ఏర్పాటైంది.
పట్టించుకోని కూటమి
బాధితులకు న్యాయం చేస్తామని ఎన్నికల ముందు కూటమి నేతలు హామీలు గుప్పించినా నేటికీ న్యాయం జరగలేదు. రుణాల ఎగవేతదారుల ఆస్తులు స్వాధీనం చేసుకుని విక్రయిస్తేనే బాధితులకు సొమ్ము ఇచ్చేందుకు వీలవుతుంది. ఈ పరిస్థితుల్లో పాలకవర్గంపై బదరీ నారాయణ అవిశ్వాసం తీర్మానం చేసి, ఫిబ్రవరి 21న రిజిస్ట్రార్ ఆఫ్ సొసైటీస్‌కు నివేదించారు. దీనిపై కలెక్టర్‌కు కూడా శుక్రవారం వినతిపత్రం అందించారు.
అనేక విషయాల్లో నూతన పాలకవర్గం గోప్యత పాటిస్తోందని, అనుమానాస్పద రీతిలో వ్యవహరిస్తోందని ఆయన ఆరోపిస్తున్నారు. అయితే, తమ బోర్డు హయాంలోనే రూ.700 కోట్ల వరకూ సీఐడీ, ట్రిబ్యునల్ ద్వారా రాబట్టేందుకు కేసు వేశామని చైర్మన్ త్రినాథరావు చెబుతున్నారు.
బాధితుల సంఘం సమావేశం నేపథ్యంలో సర్పవరం జంక్షన్‌లోని మెయిన్ బ్రాంచ్‌లో చైర్మన్ త్రినాథరావు ఆధ్వర్యాన పాలకవర్గం శనివారం మధ్యాహ్నం భేటీ అయింది.
Comments
Please login to add a commentAdd a comment