ఎవరో విజేత!
● నేడు పట్టభద్రుల ఎమ్మెల్సీ
ఎన్నికల ఓట్ల లెక్కింపు
● ఏలూరులో నిర్వహణ
● మధ్యాహ్నానికి మొదటి ప్రాధాన్య ఓట్ల లెక్కింపు పూర్తయ్యే అవకాశం
● గెలుపునకు సరిపడా ఓట్లు రాకపోతే ఎలిమినేషన్ ప్రక్రియ షురూ
● ఆ తరువాతే రెండో ప్రాధాన్య ఓట్ల లెక్కింపు
కాకినాడ సిటీ: ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల విజేత ఎవరో సోమవారం తేలనుంది. ఓట్ల లెక్కింపు ప్రక్రియ సోమవారం ఏలూరులో జరగనుంది. జిల్లాలో మొత్తం 70,540 మంది పట్టభద్ర ఓటర్లు ఉండగా గత గురువారం 98 పోలింగ్ కేంద్రాల్లో జరిగిన ఎన్నికల్లో 47,150 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ ఎన్నికల్లో ఈవీఎంలకు బదులు బ్యాలెట్ పేపర్లు వినియోగించడం, ఓట్ల లెక్కింపు ప్రక్రియ భిన్నంగా ఉండటంతో ఫలితం తేలడానికి ఎక్కువ సమయమే పట్టే అవకాశం ఉంది.
స్త్రాంగ్ రూములు తెరచి..
ఓట్ల లెక్కింపు ప్రక్రియలో భాగంగా సోమవారం ఉదయం 7 గంటలకు ఆయా అభ్యర్థులు లేదా వారి తరఫున వచ్చే కౌంటింగ్ ఏజెంట్లు, పరిశీలకుల సమక్షంలో బ్యాలెట్ పెట్టెలు భద్రపరచిన స్ట్రాంగ్ రూములు తెరుస్తారు. మొదటిగా 25 పోలింగ్ స్టేషన్లకు సంబంధించిన బాక్సులు తెరుస్తారు. వాటిలో ప్రతి 25 బ్యాలెట్ పేపర్లను ఒక కట్టగా కట్టి డ్రమ్ములో వేస్తారు. తర్వాత స్ట్రాంగ్ రూముల నుంచి మరో 25 పోలింగ్ బూత్‌లకు సంబంధించిన బ్యాలెట్ బాక్సులు తీసుకువస్తారు. ఇలా 200 పోలింగ్ బూత్‌లకు సంబంధించిన బ్యాలెట్ బ్యాక్సులను ఎనిమిది విడతల్లో తెచ్చి, బ్యాలెట్ పేపర్లను కట్టలుగా కడతారు. ఈ ప్రక్రియ గంటలో పూర్తి చేస్తారు.
ఒక్కో టేబుల్‌పై వెయ్యి ఓట్లు
ఓట్ల లెక్కింపు ఉదయం 8 గంటలకు ప్రారంభమవుతుంది. దీని కోసం 28 టేబుళ్లు ఏర్పాటు చేశారు. ప్రతి టేబుల్ వద్ద పోటీలో ఉన్న 35 మంది అభ్యర్థులకు కనిపించేలా ఏర్పాటు చేస్తారు. అభ్యర్థుల ఏజెంట్లకు బ్యాలెట్ పేపర్ చూపిస్తారు. మొదటి ప్రాధాన్య ఓటు పోలైన అభ్యర్థికి సంబంధించిన గడిలో ఆ బ్యాలెట్ పేపర్ వేస్తారు. చెల్లని ఓట్లను ఏజెంట్లందరికీ చూపించి పక్కన పెడతారు. ఇలా మొదటి రౌండ్ కౌంటింగ్ మధ్యాహ్నం 4 గంటల్లోగా పూర్తయ్యే అవకాశం ఉంది.
సగానికి పైగా ఓట్లు వస్తేనే..
సాధారణ ఎన్నికల్లో ప్రత్యర్థి కంటే ఎక్కువ ఓట్లు సాధించిన వారిని విజేతగా ప్రకటిస్తారు. కానీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నియోజకవర్గంలో పోలైన ఓట్లలో చెల్లుబాటు అయిన వాటిలో మొదటి ప్రాధాన్య ఓట్లు సగానికి పైగా సాధించిన వారినే విజేతగా ధ్రువీకరిస్తారు. లెక్కింపు ప్రక్రియ రౌండ్ల వారీగా ఎలిమినేషన్ పద్ధతిలో సాగుతుంది.
● మొదటి ప్రాధాన్యం గుర్తించకపోయినా ఒకరి కంటే ఎక్కువ మంది అభ్యర్థులకు ఓటు వేసినా, సరైన ప్రాధాన్యం లేకపోయినా ఆ ఓట్లను చెల్లనివిగా పరిగణిస్తారు.
● చెల్లుబాటైన ఓట్లలో మొదటి ప్రాధాన్య ఓట్లను అభ్యర్థుల వారీగా లెక్కిస్తారు. వీటిని 25 బ్యాలెట్లకు ఒక కట్టగా కడతారు.
● ఉదాహరణకు జిల్లాలో 47,150 ఓట్లు పోలవగా 2,500 ఓట్లు చెల్లకుండా పోయాయని అనుకుంటే.. వాటిని తీసివేసి, మిగిలిన 44,650 ఓట్లలో సగానికి పైగా మొదటి ప్రాధాన్యం ఓట్లు సాధించిన అభ్యర్థి గెలుపొందినట్లు ప్రకటిస్తారు.
● ఏ అభ్యర్థికీ సగానికి పైగా మొదటి ప్రాధాన్య ఓట్లు రాకుంటే ఎలిమినేషన్ రౌండ్ చేపడతారు.
● పోటీ చేసిన అభ్యర్థుల్లో అతి తక్కువ ఓట్లు సాధించిన వారిని ముందుగా ఎలిమినేట్ చేస్తారు. ఒకవేళ ఇద్దరు అభ్యర్థులు సమానంగా ఓట్లు సాధించి, చివరి స్థానంలో ఉంటే ఎన్నికల అధికారి డ్రా తీస్తారు. డ్రాలో వచ్చిన అభ్యర్థి బ్యాలెట్ పేపర్‌లోని మొదటి ప్రాధాన్య ఓట్లను అలాగే ఉంచి, రెండో ప్రాధాన్య ఓట్లు ఏ అభ్యర్థికి వచ్చాయో వారికి కలుపుతారు.
● ఒక అభ్యర్థి ఎలిమినేషన్ తర్వాత కూడా ఫలితం తేలకపోతే మరో అభ్యర్థికి వచ్చిన రెండో ప్రాధాన్య ఓట్లను లెక్కిస్తారు. ఇలా రౌండ్ల వారీగా ఒక్కో అభ్యర్థిని ఎలిమినేట్ చేస్తారు.
● నిర్దేశించిన ఓట్లు సాధించలేకపోతే మూడో రౌండ్ ఎలిమినేషన్ చేపడతారు. మూడో ప్రాధాన్య ఓట్లను లెక్కిస్తూ కలుపుతారు. ఫలితం తేలే వరకూ ఎలిమినేషన్ ప్రక్రియను కొనసాగిస్తారు. ఈ క్రమంలో సగానికి పైగా నిర్దేశిత ఓట్లను ఎవరు సాధిస్తే వారు గెలిచినట్లు ప్రకటిస్తారు.
● ఒకవేళ 35 మందిలో 33 మంది ఎలిమినేట్ అయినప్పటికీ గెలుపు కోటా రాకపోతే చివరిలో ఉన్న ఇద్దరు అభ్యర్థుల్లో ఎవరికి తక్కువ ఓట్లు వచ్చాయో ఆ అభ్యర్థిని ఎలిమినేట్ చేసి, ఆయనకు వచ్చిన ఓట్లలో రెండో ప్రాధాన్య ఓట్లను 35వ అభ్యర్థికి కలుపుతారు. అప్పటికి కోటా వస్తే సరి. కోటా రాకపోయినా ఎలిమినేట్ కాకుండా చివరి వరకూ ఉన్న అభ్యర్థినే విజేతగా ప్రకటిస్తారు.
● మొదటి ప్రాధాన్య ఓట్లతో ఏ అభ్యర్థికీ గెలుపు కోటా రాక.. ఎలిమినేషన్ ప్రక్రియ చేపట్టి రెండో ప్రాధాన్య ఓట్లు లెక్కిస్తే మాత్రం కౌంటింగ్ ప్రక్రియ ఆలస్యం అవుతుంది. అదే కనుక జరిగితే ఫలితం వెల్లడి కావడానికి మరుసటి రోజు వరకూ సమయం పట్టవచ్చని అధికారులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment