స్నాతకోత్సాహం.. మిన్నంటిన వేళ.. | - | Sakshi
Sakshi News home page

స్నాతకోత్సాహం.. మిన్నంటిన వేళ..

Published Mon, Mar 3 2025 12:12 AM | Last Updated on Mon, Mar 3 2025 12:13 AM

స్నాత

స్నాతకోత్సాహం.. మిన్నంటిన వేళ..

248 మందికి పట్టాల ప్రదానం

ఘనంగా ఆర్‌ఎంసీ 62వ స్నాతకోత్సవం

కాకినాడ క్రైం: ఐదున్నరేళ్ల నిర్విరామ శ్రమ.. ఇకపై నువ్వు డాక్టర్‌వి అంటే మనసు కదిలిపోయిన భావోద్వేగాలు.. అందుకున్న పట్టాను తనివితీరా చూసుకుంటూ చెమ్మగిల్లిన కళ్లు.. పుత్రోత్సాహం పొంగిపొర్లి ఆనందబాష్పాలు కురిపిస్తున్న అమ్మనాన్నల మోములు.. వియ్‌ మిస్‌ యూ అంటూ దాచి పెట్టుకున్న గాంభీర్యం నడుమ చెప్పలేక చెబుతున్న టీచర్ల హావభావాలు.. ఇలా ఒకటా రెండా చెప్పుకోవడానికి చాలని, పంచుకోవడానికి పట్టని ఎన్నో వెలకట్టలేని భావోద్వేగాలు కాకినాడలోని ప్రతిష్టాత్మక రంగరాయ వైద్య కళాశాల (ఆర్‌ఎంసీ) స్నాతకోత్సవంలో ఆవిష్కృతమయ్యాయి. కళాశాల యాజమాన్యం సహకారంతో 2019 బ్యాచ్‌కు చెందిన సుప్రీం స్టాల్‌వార్ట్స్‌ ఈ సంబరాన్ని మిన్నంటే ఉత్సాహంతో భళా అనిపించేలా నిర్వహించారు.

ఆర్‌ఎంసఅ వైస్‌ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ ఎ.విష్ణువర్ధన్‌ అధ్యక్షతన జరిగిన ఈ స్నాతకోత్సవానికి 5 వేల మంది హాజరయ్యారు. మొత్తం 248 మంది విద్యార్థులు వైద్య పట్టాలు అందుకున్నారు. డాక్టర్‌ ఎన్‌టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం వైస్‌ చాన్సలర్‌, రాష్ట్ర వైద్య విద్యా సంచాలకుడు, ఆర్‌ఎంసీ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ డీఎస్‌వీఎల్‌ నరసింహం ముఖ్య అతిథిగా, కాకినాడ జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ లావణ్యకుమారి గౌరవ అతిథిగా పాల్గొన్నారు. వీరితో పాటు జీజీహెచ్‌ డిప్యూటీ సూపరింటెండెంట్లు డాక్టర్‌ ఎంపీఆర్‌ విఠల్‌, డాక్టర్‌ శ్రీనివాసన్‌, వైస్‌ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ శశి, విజయనగరం వైద్య కళాశాల వైస్‌ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ దేవీ మాధవి, వివిధ విభాగాల అధిపతులు డాక్టర్‌ మాణిక్యాంబ, డాక్టర్‌ ఉమామహేశ్వరరావు, ప్రొఫెసర్‌ డాక్టర్‌ శైలజ, డాక్టర్‌ లక్ష్మీనారాయణ, ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ (ఐఎంఏ) నుంచి వైద్యులు చిట్ల కిరణ్‌, ఆనంద్‌, ఆదిత్య సత్య ప్రసన్న, ఆర్‌ఎంసీ ఏడీ శ్రీనివాస్‌ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు అబ్బురపరిచాయి.

డాక్టర్‌కు ఏఐ ప్రత్యామ్నాయం కాదు

విద్యార్థులునుద్దేశించి డాక్టర్‌ నరసింహం మాట్లాడుతూ, వైద్య ప్రక్రియల్లో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) కీలక పాత్ర పోషిస్తోందని, అయితే వైద్యుడికి మాత్రం ఇది ప్రత్యామ్నాయం కాదని అన్నారు. రోగి భావోద్వేగాలను అంచనా వేసే శక్తి ఏఐకి లేదని చెప్పారు. పట్టాలు పొందిన విద్యార్దులందరూ తమ తల్లిదండ్రుల కలలు నెరవేర్చారని అన్నారు. తాను రాష్ట్ర స్థాయి విధుల్లో కొనసాగుతూ ఎటువంటి ఆటంకాలూ లేకుండా ముందుకు సాగడానికి వైస్‌ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ విష్ణువర్ధన్‌ సమర్థంగా విధులు నిర్వహించడమే కారణమని అన్నారు. ఆయన హయాంలోనే 2019–25 బ్యాచ్‌ విద్యార్థులు అసామాన్య విజయాలు సాధించారన్నారు.

నేను రాయల్‌ రంగరాయన్‌ని..

ఆర్‌ఎంసీ చరిత్రలోనే కనీవినీ ఎరుగని కీర్తి ప్రతిష్టలు సాధించారు డాక్టర్‌ సాయి అనిరుధ్‌. 2019–25 బ్యాచ్‌కు చెందిన ఈయన తొమ్మిది అవార్డులు, 5 బంగారు పతకాలు సాధించి, స్నాతకోత్సవంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ‘మనం ట్రైన్డ్‌, టెస్టెడ్‌, రెడీ టు సర్వ్‌’ అంటూ సహ విద్యార్థుల్లో ఉత్సాహం నింపారు. రాయల్‌ రంగరాయన్‌గా ఎంతో గర్వపడుతున్నానని అన్నారు. హౌస్‌ సర్జన్‌గా తొలిసారి కాన్యులా పెట్టిన సందర్భం, ఓ గర్భిణికి డెలివరీ చేసి, శిశువును బయటకు తీసినప్పుడు కలిగిన భావోద్వేగం, వెన్ను విరిగేలా శ్రమించినా సీపీఆర్‌ తర్వాత వ్యక్తి చనిపోతే కలిగిన బాధ వర్ణించలేనంటూ చెప్పిన సందర్భంలో సభాస్థలిలో ఒక్కసారిగా నిశ్శబ్దం ఆవరించింది. ఐదున్నరేళ్ల చదువును సబ్జెక్టుల వారీగా వర్ణిస్తూ హాస్యాన్ని జోడిస్తూ చెప్పిన తీరు ఆకట్టుకుంది. పట్టా పొందడం అంటే పరుగు ఆపేయడం కాదని, మరింత వేగంగా పరిగెట్టడమేనని డాక్టర్‌ అనిరుధ్‌ అన్నారు.

పేరుకు ముందు డాక్టర్‌.. ఆ కిక్కే వేరు

పేరుకు ముందు డాక్టర్‌ అనే ప్రిఫిక్స్‌ చేరితే ఆ కిక్కే వేరని డాక్టర్‌ విష్ణువర్ధన్‌ అనడంతో విద్యార్థుల్లో ఒక్కసారిగా ఉత్సాహం వెల్లివిరిసింది. కళాశాలను అత్యంత క్రమశిక్షణతో నిర్వహిస్తున్నామని ఆయన చెప్పారు. డాక్టర్‌ లావణ్యకుమారి మాట్లాడుతూ, వైద్య విద్యార్థులకు ఇదో కొత్త అధ్యాయమని అన్నారు. వృత్తి జీవితం, వ్యక్తిగత జీవితం, ఆరోగ్యం సమన్వయం చేసుకోగలిగితేనే పరిపూర్ణ మానవుడిగా ఎదగగలమని హితవు పలికారు. తల్లిదండ్రుల శ్రమను గుర్తించి జీవించాలని సూచించారు. డాక్టర్‌ దేవీ మాధవి మాట్లాడుతూ, వైద్యుడిగానే కాదు, రోల్‌మోడల్‌గానూ ఎదగాలంటూ ఆకాంక్షించారు. విద్యార్థులతో డాక్టర్‌ శైలజ, డాక్టర్‌ దేవీ మాధవి వైద్య ప్రమాణం చేయించారు. అనంతరం డాక్టర్‌ నరసింహాన్ని సత్కరించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
స్నాతకోత్సాహం.. మిన్నంటిన వేళ..1
1/3

స్నాతకోత్సాహం.. మిన్నంటిన వేళ..

స్నాతకోత్సాహం.. మిన్నంటిన వేళ..2
2/3

స్నాతకోత్సాహం.. మిన్నంటిన వేళ..

స్నాతకోత్సాహం.. మిన్నంటిన వేళ..3
3/3

స్నాతకోత్సాహం.. మిన్నంటిన వేళ..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement