పడిపోతున్న ఏలేరు నీటి నిల్వలు
ఏలేశ్వరం: ఎగువ నుంచి ప్రవాహం తగ్గడం.. నానాటికీ ఎండలు పెరుగుతూండటంతో ఏలేరు రిజర్వాయర్‌లో నీటి నిల్వలు క్రమేపీ పడిపోతున్నాయి. జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టం 86.56 మీటర్లు కాగా, ఆదివారం 80.32 మీటర్లుగా నమోదైంది. రిజర్వాయర్ పూర్తి సామర్థ్యం 24.11 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 13.82 టీఎంసీల మేర మాత్రమే నీటి నిల్వలున్నాయి. ఆయకట్టుకు 1,200, విశాఖకు 200, తిమ్మరాజు చెరువుకు 100 క్యూసెక్కుల చొప్పున నీటిని విడుదల చేస్తున్నారు.
లోవలో భక్తుల సందడి
తుని రూరల్: తలుపులమ్మ అమ్మవారిని దర్శించేందుకు వచ్చిన భక్తులతో లోవ దేవస్థానంలో ఆదివారం రద్దీ నెలకొంది. వివిధ జిల్లాల నుంచి వచ్చిన 15 వేల మంది క్యూలైన్ల ద్వారా అమ్మవారిని దర్శించుకున్నట్లు ఇన్‌చార్జి డిప్యూటీ కమిషనర్, కార్యనిర్వహణాధికారి పెన్మెత్స విశ్వనాథరాజు తెలిపారు. లడ్డూ, పులిహోర ప్రసాదాల విక్రయం ద్వారా రూ.1.12.800. పూజా టికెట్లకు రూ.68 వేలు, కేశఖండనకు రూ.11,400, వాహ న పూజలకు రూ.4,500, కాటేజీలు, పొంగలి షెడ్లు, వసతి గదుల అద్దెలు రూ.34,610, విరాళాలు రూ.72,972 కలిపి మొత్తం రూ.3,04,285 ఆదాయం సమకూరిందని వివరించారు.
నేడు హుండీల
ఆదాయం లెక్కింపు
అన్నవరం: సత్యదేవుని సన్నిధిలో హుండీల ఆదాయాన్ని సోమవారం లెక్కించనున్నారు. అన్నవరం దేవస్థానంలో హుండీల ఆదాయాన్ని గత జనవరి 30వ తేదీన లెక్కించారు. తిరిగి 30 రోజుల అనంతరం లెక్కింపు చేపట్టనున్నారు. జనవరి 30 నుంచి ఫిబ్రవరి 28వ తేదీ వరకూ మాఘ మాసం కావడంతో సత్యదేవుని ఆలయానికి పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చారు. వారు హుండీల్లో పెద్ద మొత్తంలో కానుకలు సమర్పించారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీంతో ఈసారి హుండీల ద్వారా సుమారు రూ.1.5 కోట్లు పైగా ఆదాయం వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. హుండీల ఆదాయం లెక్కింపును దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్, ఈఓ వి.సుబ్బారావు పర్యవేక్షించనున్నారు. లెక్కింపులో దేవస్థానం సి బ్బంది అందరూ పాల్గొనాలని ఈఓ ఆదేశించారు.
ఘనంగా సత్యదేవుని రథసేవ
అన్నవరం: రత్నగిరిపై ఆలయ ప్రాకారంలో ఆదివారం సత్యదేవుని రథసేవ ఘనంగా నిర్వహించారు. ఉదయం 10 గంటలకు సత్యదేవుడు, అమ్మవార్ల ఉత్సవమూర్తులను ఊరేగింపుగా ఆలయం వద్దకు తీసుకువచ్చి రథంపై వేంచేయించారు. స్వామి, అమ్మవార్లకు పూజల అనంతరం పండితులు కొబ్బరి కాయ కొట్టి రథసేవను ప్రారంభించారు. వేద పండితుల మంత్రోచ్చారణలు, మంగళవాయిద్యాల ఘోష నడుమ మూడుసార్లు రథంపై ఆలయ ప్రాకారంలో సేవ నిర్వహించారు. అనంతరం స్వామి, అమ్మవార్లకు పండితులు నీరాజనం ఇచ్చి, భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. అర్చకుడు ప్రయాగ రాంబాబు, పరిచారకుడు ముత్య వేంకట్రావు తదితరులు పూజలు చేశారు. రత్నగిరిపై రామారాయ కళావేదిక మీద సూర్య నమస్కారాలు, సూర్య భగవానుడికి ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. ఉదయం 9 నుంచి 11 గంటల వరకూ ఈ కార్యక్రమం జరిగింది. సత్యదేవుడు, అమ్మవారు సోమవారం ముత్యాల కవచాలు (ముత్తంగి సేవ) ధరించి భక్తులకు దర్శనమివ్వనున్నారు.
రేపు హాకీ క్రీడాకారుల ఎంపికలు
నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): సీనియర్ మెన్ విభాగంలో హాకీ క్రీడాకారుల ఎంపికలు నిర్వహిస్తున్నట్లు జిల్లా హాకీ సంఘం కార్యదర్శి నంబు శ్రీనివాసరావు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా క్రీడా మైదానంలో మంగళవారం ఉదయం 8 గంటలకు ఈ ఎంపికలు ప్రారంభమవుతాయన్నారు. ఎంపికై న జట్టు ఈ నెల 6 నుంచి 8వ తేదీ వరకూ గుంటూరు జిల్లా నాగార్జున యూనివర్సిటీలో జరిగే అంతర్ జిల్లాల హాకీ పోటీల్లో పాల్గొంటుందని తెలిపారు.
పడిపోతున్న ఏలేరు నీటి నిల్వలు
పడిపోతున్న ఏలేరు నీటి నిల్వలు
Comments
Please login to add a commentAdd a comment