తెగుళ్లతో ఖాళీఫ్లవర్
పెరవలి: కూరగాయల పంటలో కాలీఫ్లవర్ ఆదాయాన్ని ఇచ్చే పంట.. ఇప్పుడు ఈ పంట రైతుల గుండెల్లో మంట పెడుతోంది. తెగుళ్లు ముప్పేట దాడి చేయడంతో ఇబ్బందిగా మారుతోంది. ఈ నేపథ్యంలో సస్యరక్షణ చర్యలు అవశ్యమని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో మొత్తం 2,795 హెక్టార్లలో కూరగాయల సాగు జరుగుతుండగా, ఇందులో కాలీఫ్లవర్ 425 ఎకరాల్లో సాగు చేస్తున్నారు. ఈ పంట సాధారణంగా శీతల ప్రాంతంలో వేయాల్సి ఉండగా, ప్రస్తుతం వేసవి ప్రారంభం కావడంతో తెగుళ్ల ఉధృతి అధికంగా ఉంది. దీనికి వెంటనే సస్యరక్షణ చర్యలు చేపట్టాలని కొవ్వూరు ఉద్యాన అధికారి సీహెచ్ శ్రీనివాస్ తెలిపారు. ఈ పంటపై ప్రస్తుతం ఆకుమచ్చ, పచ్చపురుగు, బట్టవింగ్, రైసీనెస్, కొరడా తెగుళ్లు ఎక్కువగా ఆశించాయి. ఈ తెగుళ్ల నివారణకు రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఆయన వివరించారు.
బట్టవింగ్
ఈ తెగులు ఆశించిన తోటల్లో పూలు చిన్నవిగా వస్తాయి. నత్రజని తక్కువగా అందించటం వల్ల లేక ఆలస్యంగా నారు నాటటం వలన ఈ ప్రభావం కనిపిస్తుంది. దీనిని అరికట్టాలంటే 21 నుంచి 25 రోజుల వయసు కలిగిన నారును మాత్రమే నాటుకోవాలి. సరియైన సమయానికి తగు మోతాదులో నత్రజని ఎరువును అందించాలి. సరియైన సమయంలో నాటుకోవాలి.
రైసీనెస్
ఈ తెగులు వాతావరణంలో వేడి ప్రారంభమైనప్పుడు వ్యాప్తి చెందుతుంది. ఈ తెగులు ఆశిస్తే పువ్వు వదులై, విచ్చుకున్నట్లుగా అయ్యి పువ్వు గుడ్డుపై మాగు వస్తుంది. దీనివల్ల పువ్వు అంద విహీనంగా కనిపించి మార్కెట్టులో ధరపడిపోతుంది. దీని నివారణకు పువ్వులకు ఎండ ఎక్కువగా తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. పువ్వు విచ్చుకున్న వెంటనే సరైన సమయంలో పువ్వులను కోయాలి.
బ్రౌవింగ్
ఈ తెగులు బోరాన్ లోపం వల్ల వ్యాప్తి చెందుతుంది. ముఖ్యంగా క్షార నేలల్లో ఈ పంటలను వేసినప్పుడు తెగులు వ్యాప్తి అధికంగా ఉంటుంది. ఈ తెగులు ఆశించిన పువ్వులపై గోధుమరంగు మచ్చలు ఏర్పడతాయి. కాండం గుల్లగా మారి నీరుకారుతుంది. దీని నివారణకు ఆఖరి దుక్కులో ఎకరాకు 8నుంచి 10 కిలోలు బోరాక్స్ వేయాలి. లీటరు నీటిలో 3 గ్రాములు బోరాక్స్ కలిపి పువ్వు గడ్డ ఏర్పడే దశలో పిచికారీ చేయాలి.
కొరడా
ఈ తెగులు మాలిబ్దినం ధాతు లోపం వల్ల సోకుతుంది. ఆకులు పసుపుగా మారి, అంచులు తెల్లబడతాయి. తెగులు తీవ్రత ఎక్కుగా ఉంటే ఆకు మధ్య మాత్రమే పొడవుగా పెరుగుతుంది. ఇలా పెరిగితే కొరడా తెగులు ఆశించినట్లు గుర్తించాలి. దీని నివారణకు నత్రజనిని సరైన మోతాదులో అందించాలి. ఎకరాకు 400 గ్రాములు సోడియం లేదా అమ్మోనియం మాలిబ్డేట్ 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి.
● కాలీప్లవర్ పువ్వు తెల్లగా ఉండాలంటే పువ్వు ఏర్పడిన దశలో పువ్వు చుట్టూ ఉన్న ఆకులను పువ్వుపై కప్పుతూ సూర్యరశ్మి సోకకుండా దారంతోకానీ రబ్బరు బ్యాండ్ కానీ వేయాలి. 4 నుంచి 5 రోజుల తరువాత పువ్వును కోయాలి.
సస్యరక్షణ చర్యలు అవశ్యం
లేకుంటే దిగుబడులపై ప్రభావం
కుళ్లు తెగులు
ఈ తెగులు సాధారణంగా నారుమడి నుంచి ప్రారంభమై నాటిన తోటలోనూ వ్యాప్తి చెందుతుంది. ఆకుల అంచుల నుంచి పసుపు రంగుకు మారి ఈనెలు నల్లబడి కాండం కుళ్లిపోతుంది. ఈ తెగులు అధికంగా ఉంటే పువ్వును కూడా ఆశిస్తుంది. అది కూడా కుళ్లిపోతుంది.
నివారణ చర్యలు
ఈ తెగులు ఆశించిన తోట పూర్తయిన తరువాత మళ్లీ ఇదే పంటను వేయకూడదు. పంట మార్పిడి తప్పని సరిగా చేయాలి. ఈ తెగులు ఆశించినట్లు గుర్తించిన వెంటనే కాపర్ ఆక్సీక్లోరైడ్ మందును లీటరు నీటికి 3 గ్రాములు చొప్పన కలిపి మొక్క అంతా తడిసేలా పిచికారీ చేయాలి. ఇలా చేయటం వలన తెగులును కొంతవరకు నివారించవచ్చు.
ఆకుమచ్చ తెగులు
ఈ తెగులు ఆశించిన తోటల ఆకులపై గుండ్రని బూడిద రంగు మచ్చలు ఏర్పడి క్రమంగా పెద్దవిగా మారతాయి. ఈ తెగులు సాధారణంగా వాతవరణంలో తేమశాతం అధికంగా ఉన్నప్పుడు వ్యాప్తి చెందుతుంది.
నివారణ చర్యలు
ఈ తెగులు నివారణకు మాంకోజెబ్ మందును లీటరు నీటికి 2.5 గ్రాములు లేదా కాఫర్ ఆక్సీక్లోరైడ్ లీటరు నీటికి 3 గ్రాములు చొప్పున కలిపి పైరుపై పిచికారీ చేస్తే నివారణ అవుతుంది. తెగులు అధికంగా ఉంటే 10 రోజుల వ్యవధిలో రెండు నుంచి 3 సార్లు పిచికారీ చేయాలి.
తెగుళ్లతో ఖాళీఫ్లవర్
తెగుళ్లతో ఖాళీఫ్లవర్
తెగుళ్లతో ఖాళీఫ్లవర్
తెగుళ్లతో ఖాళీఫ్లవర్
తెగుళ్లతో ఖాళీఫ్లవర్
తెగుళ్లతో ఖాళీఫ్లవర్
Comments
Please login to add a commentAdd a comment