ఉచితంగా వినికిడి పరీక్షలు
కాకినాడ క్రైం: ప్రపంచ వినికిడి దినోత్సవం సందర్భంగా సోమవారం ఉచితంగా వినికిడి పరీక్షలు నిర్వహించి అవగాహన సదస్సులు ఏర్పాటు చేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్ ఆడియోలజిస్ట్స్ అండ్ స్పీచ్ లాంగ్వేజ్ పేథోలజిస్ట్స్ అసోసియేషన్ (ఏపీఏఎస్‌ఎల్‌పిఏ), ఇండియన్ స్పీచ్, లాంగ్వేజ్ అండ్ హియరింగ్ అసోసియేషన్ (ఐఎస్‌హెచ్‌ఏ) ఆంధ్రప్రదేశ్ శాఖ జనరల్ సెక్రటరీ డాక్టర్ పెబ్బిలి గోపి వెంకటేష్, ఎగ్జిక్యూటివ్ మెంబర్ డాక్టర్ పి.రేణుకాదేవి తెలిపారు. ఈ మేరకు ఆదివారం స్థానిక లచ్చిరాజు వారి వీధిలో వాగ్దేవి స్పీచ్ అండ్ హియరింగ్ క్లినిక్‌లో విలేఖరుల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ, వినికిడి సమస్యను నిర్లక్ష్యం చేస్తే జీవితాలు దుర్భరం అవుతాయన్నారు. వినికిడి లోపం ఉన్న చిన్నపిల్లల్లో మాట్లాడే లోపం లేకపోయినా మాటలు రావని అన్నారు. వివిధ కారణాలు ఇందుకు దారితీస్తాయని తెలిపారు. సోమవారం ప్రపంచ వినికిడి దినోత్సవం సందర్భంగా ఐఎస్‌హెచ్‌ఏ, ఏపీఏఎస్‌ఎల్‌పీఏల సంయుక్త ఆధ్వర్యంలో వినికిడి లోపంతో బాధపడుతున్న ఐదేళ్లలోపు పిల్లలకు ఓఏఈ, పెద్దలకు ప్యూర్ టోన్ ఆడియోమెట్రీ అనే పరీక్షలను ఉచితంగా నిర్వహించాలని నిర్ణయించనున్నట్లు తెలిపారు. సదస్సులు ఏర్పాటు చేసి వినికిడి ప్రాధాన్యం, అది లోపించడం వల్ల తలెత్తే సమస్యలు, వినికిడిని కాపాడుకోవడం, లోపం ఉన్నవారిలో గుర్తించడంపై అవగాహన కల్పిస్తామన్నారు. ఈ నేపథ్యంలో సోమవారం కాకినాడలో వాగ్దేవి స్పీచ్ అండ్ హియరింగ్ క్లినిక్ (లచ్చిరాజు వారి వీధి), శ్రావ్య స్పీచ్ అండ్ హియరింగ్ క్లినిక్ (సాలిపేట, శ్రావణి ఈఎన్‌టీ హాస్పిటల్‌లో), హియర్ జాప్ (మెయిన్ రోడ్ అపోలో ఆసుపత్రి ఎదురుగా), మహి స్పీచ్(రమణయ్యపేట, అపోలో ఫార్మసీ పై అంతస్తు)లో ఉచిత వినికిడి పరీక్షలు నిర్వహిస్తామన్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతాయన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సహాయం కోసం 99899 85385, 99121 11107 నంబర్లకు ఫోన్ చేయాలన్నారు. ఈ సమావేశంలో ఏపీఏఎస్‌ఎల్‌పీ అసోసియేషన్ సంయుక్త కార్యదర్శి డాక్టర్ డి.సూర్యనారాయణ, అసోసియేషన్ సభ్యులు డాక్టర్ వి.హరీష్, డాక్టర్ ఫీబి, డాక్టర్ వి.తేజ, డాక్టర్ విజయలక్ష్మి పాల్గొన్నారు.
నేడు కాకినాడలో
నాలుగు కేంద్రాల్లో ఏర్పాటు
Comments
Please login to add a commentAdd a comment