
ఆశాభంగం
ప్రభుత్వం ప్రకటించిన వరాలు పనికిరావు
జిల్లాలో ఎన్నికల కోడ్ ఉన్నా హడావుడిగా ఆశా కార్యకర్తలను సంతృప్తి పరచేందుకు పలు రాయితీలను అందిస్తుందంటూ ప్రభుత్వం ఇచ్చిన లీకేజీల వల్ల ఆశా కార్యకర్తలు ఆగ్రహంతో ఉన్నారు. 2006లో పూర్తి స్థాయిలో ఆశా కార్యకర్తలను పోస్టులు భర్తీ చేయగా మధ్యలో ఏర్పడిన ఖాళీలను భర్తీ చేసుకుంటూ వచ్చారు. గత పదేళ్ల నుంచి ఆశా కార్యకర్తల పోస్తుల భర్తీకి అవకాశం లేకుండా పోయింది. దీంతో ప్రభుత్వం ప్రకటించిన ప్రసూతి సెలవులు ఉపయోగించుకొనే అవకాశం లేదని ఆశా కార్యకర్తలు చెబుతున్నారు. గ్రాడ్యుటీని ప్రవేశపెట్టి రూ.1.50 లక్షలు పదవీ విరమణ అనంతరం ఇస్తామన్న ప్రభుత్వ ప్రకటన కూడా బూటకమని వారు చెబుతున్నారు. 30 ఏళ్ల సుదీర్ఘ సర్వీసు ఉంటేనే గ్రాడ్యుటీ అమలు చేస్తామని మెలిక పెట్టడం ఆశా కార్యకర్తలను వంచించడమేనని మండిపడుతున్నారు. వేతనాల పెంపు లేకుండా కేవలం పదవీ విరమణ వయసును 62 ఏళ్లకు పెంచడంలో ఆశా కార్యకర్తలకు ఒరిగేదేమీ లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
నాటి వైఎస్సార్ సీపీ సర్కారులో స్వర్ణయుగం
2019–24 మధ్య కాలంలో పాలించిన వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఆశా కార్యకర్తలకు అన్ని విధాలుగా అండగా ఉంది. చాలీచాలని వేతనాలతో దుర్భర జీవితం అనుభవించిన ఆశా కార్యకర్తలకు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నాడు చేసిన పాదయాత్రలో ఆశా కార్యకర్తల దుస్థితిని గుర్తించారు. అందుకనుగుణంగా వైఎస్సార్ సీపీ అధికారం చేపట్టిన వెంటనే అప్పటి వరకూ రూ.మూడు వేలు ఉన్న వేతనాన్ని ఒక్కసారిగా 2019 ఆగస్టు 12న రూ.పది వేలకు పెంచారు. ఆశా కార్యకర్తల కులం, మతం, ప్రాంతం, వర్గం చూడకుండా సజావుగా విధులు నిర్వహించేందుకు భరోసా కల్పించారు. నేటి రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలతో పోల్చుకుంటున్న ఆశా కార్యకర్తలు నాటి స్వర్ణయుగాన్ని తలుచుకుంటున్నారు.
ఆలమూరు: రాష్ట్ర ప్రజల ఆరోగ్య భద్రతకు అహర్నిశలు శ్రమిస్తున్న ఆశా కార్యకర్తలకు ఉద్యోగ భద్రత కల్పిచడంతో పాటు దీర్ఘకాలిక డిమాండ్లు పరిష్కరిస్తామన్న కూటమి ప్రభుత్వం హామీ నీటిమూటగా మారింది. గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అలవి కాని హామీలిచ్చి అమలు చేయలేక అన్ని వర్గాల ప్రజలు మాదిరిగానే ఆశా కార్యకర్తలను కూడా నయవంచనకు గురిచేయడంపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. రాష్ట్ర ప్రభుత్వం అఽధికారం చేపట్టి 9నెలలు అయినా ఇంకా హామీలు అమలు చేయకపోవడంతో రాష్ట్ర ఆశా కార్యకర్తల సమాఖ్య పిలుపు మేరకు గత ఏడాది నవంబర్ 18న ఆశా కార్యకర్తలు జిల్లా కేంద్రమైన అమలాపురంలోని డీఎంహెచ్‌ఓ కార్యాలయం వద్ద తమ నిరసనలను తెలియజేశారు. దీంతో దిగివచ్చిన ప్రభుత్వం ఆశా కార్యకర్తల డిమాండ్లను సానుకూల దృక్పథంతో పరిష్కారిస్తామని ఆ సమయంలో హామీ ఇచ్చింది. ప్రభుత్వం మాట తప్పిన వైనాన్ని జీర్ణించుకోలేని ఆశా కార్యకర్తలు తాడోపేడో తేల్చుకునేందుకు ఈ నెల ఆరవ తేదీన చలో విజయవాడకు పిలుపునిచ్చారు. దీంతో ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా పోలీసులు ధర్నాకు వెళ్లే వారిని గుర్తించే పనిలో నిమగ్నమై బెదిరింపులకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వం నుంచి ఎన్ని ఆటంకాలు ఎదురైనా వెనుకాడవద్దని ఆశా కార్యకర్తలు తీర్మానించుకున్నారు.
ఆశా కార్యకర్తలపై పెరిగిన పని ఒత్తిడి
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోనున్న 56 ప్రాథమిక, పట్టణ ఆరోగ్య కేంద్రాల పరిధిలో ప్రస్తుతం 1395 మంది ఆశా కార్యకర్తలు విధులు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రతి వెయ్యి జనాభాకు ఒక ఆశా కార్యకర్తను ప్రభుత్వం నియమించవలసి ఉంది. జిల్లాలో 2011 జనాభా గణాంకాల ప్రకారం 17.19 లక్షల మంది జనాభా ఉండగా ఆశా కార్యకర్తలను దాదాపు 1,700 మందిని నియమించవలసి ఉంది. ప్రస్తుతం వివిధ కారణాల రీత్యా ఖాళీ అయిన ఆశా కార్యకర్తల పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయడం లేదు. దీంతో ప్రస్తుతం ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తున్న ఆశా కార్యకర్తలపైనే అదనపు భారం పడుతోంది. రోజు రోజుకు ప్రవేశపెడుతున్న యాప్‌లతో పాటు పని ఒత్తిడితో ఆశా కార్యకర్తలు సతమతమవుతున్నారు. దైనందిన జీవితంలో నిత్యవసరాల ధరలతో పాటు ఖర్చులు పెరిగినట్లుగా వేతనం పెరగక ఆశా కార్యకర్తలు అర్ధాకలితో అలమటిస్తున్నారు.
ఆశా కార్యకర్తల డిమాండ్లు ఇవీ
కనీస వేతనం రూ.20 వేలు చెల్లించాలి.
ఒప్పంద జీవోలన్నింటిని విడుదల చేయాలి.
ఏఎన్‌ఎం శిక్షణ పొందిన వారందరికి పర్మి నెంట్ పోస్టుల భర్తీ సమయంలో తగిన ప్రాధాన్యం కల్పించాలి.
అర్హతను బట్టి దశల వారీగా ఏఎన్‌ఎం శిక్షణను ఇచ్చి ధ్రువపత్రాలను మంజూరు చేయాలి.
ఆరోగ్య రంగానికి బడ్జెట్‌లో ప్రకటించిన వాటి కంటే అధికంగా నిధులు పెంచాలి. ఆరోగ్య భద్రతా చట్టం చేయాలి.
ప్రతి యేటా రెండు జతలకు యూనిఫామ్ అలావెన్స్ ఇవ్వాలి.
లెప్రసీ సర్వేకు సంబంధించిన పారితోషికాలు వెంటనే చెల్లించాలి.
న్యాయబద్ధమైన డిమాండ్లు అంగీకరించాలి
రాష్ట్ర ప్రభుత్వం గత సార్వత్రిక ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా ఆశా కార్యకర్తల న్యాయబద్ధమైన డిమాండ్లను అంగీకరించాలి. ఏఎన్‌ఎంలుగా పదోన్నతికి అవకాశం ఇచ్చి ఉద్యోగ భద్రత కల్పించాలి. ఆశా కార్యకర్తల డిమాండ్లను ప్రభుత్వం మానవతా దృక్పథంతో పరిశీలించి సమస్యలను పరిష్కరించాలి.
– కె.కృష్ణవేణి, కోనసీమ జిల్లా ఆశా కార్యకర్తల సమాఖ్య గౌరవ అధ్యక్షురాలు
ఆశా కార్యకర్తలను
నయవంచన చేస్తున్న ప్రభుత్వం
గత వైఎస్సార్ సీపీలో
వేతనం రూ.పది వేలకు పెంపు
రేపు చలో విజయవాడకు
పిలుపునిచ్చిన సీఐటీయూ
పోలీసు కేసులకు,
వేధింపులకు భయపడేది లేదు

ఆశాభంగం
Comments
Please login to add a commentAdd a comment