తండ్రి మందలించాడని ఆత్మహత్యాయత్నం
అమలాపురం టౌన్: ఉప్పలగుప్తానికి చెందిన బి.ఫార్మసీ చదువుతున్న విద్యార్థిని అమలాపురంలో వాటర్ ట్యాంక్ ఎక్కి ఆత్యహత్యాయత్నం చేసిన ఘటన పోలీసులు, అగ్ని మాపక సిబ్బంది, స్థానికులకు ముచ్చెమటలు పట్టించింది. అమలాపురం గాంధీనగర్ శివారులో నిర్మాణం పూర్తయి ఇంకా ప్రారంభం కాని దాదాపు 60 అడుగుల ఎత్తు ఉన్న వాటర్ ట్యాంక్‌పై ఆ యువతి ప్రమాదకర పరిస్థితుల్లో నిలబడి ఆత్మహత్యాయత్నం చేసింది. ఆ యువతి భీమవరం విష్ణు కళాశాలలో బి.ఫార్మసి చివరి సంవత్సరం చదువుతోంది. 15 రోజులకోసారి ఇంటికి రావడం, చదువుపై అంతగా దృష్టి పెట్టకపోవడంపై తల్లిదండ్రులు ఆమెను తరుచూ మందలిస్తున్నారు. భీమవరం నుంచి ఇంటికి వచ్చిన విద్యార్థిని వైఖరిపై తండ్రి సోమవారం అసహనం వ్యక్తం చేశారు. మంగళవారం ఉదయం విద్యార్థిని తన ల్యాప్ ట్యాప్‌లో సినిమా చూస్తోంది. ఇది గమనించిన ఆమె తండ్రి మందలించి పొలం వెళ్లిపోయాడు. తండ్రి మందలింపులతో మనస్తాపం చెందిన ఆ విద్యార్థిని తన బ్యాగ్ తీసుకుని ఉప్పలగుప్తం నుంచి అమలాపురం వెంకటేశ్వరస్వామి ఆలయానికి సమీపంలో గల తమ బంధువుల ఇంటికి చేరుకుంది. ఆ బ్యాగ్‌ను బంధువుల ఇంట్లో పడేసి విద్యార్థిని నేరుగా వాటర్ ట్యాంక్ వద్దకు వెళ్లి ట్యాంక్ ఎక్కేసింది. యువతి ఆత్మహత్యాయత్నం చేసుకుంటోందని గమనించిన స్థానికులు తక్షణమే పోలీసులకు సమాచారం అందించారు. ఇంతలో ఆ ట్యాంక్ వద్దకు స్థానికులు చేరకున్నారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది కూడా అక్కడికి వచ్చారు. పోలీసులు, అగ్ని మాపక సిబ్బంది తాళ్లు, వలలు కూడా సిద్ధం చేశారు. ఆమెను ట్యాంక్ నుంచి దూకితే రక్షించేందుకు సన్నాహాలు కూడా చేశారు. విద్యార్థినిని ట్యాంక్ దిగాలని అటు స్థానికులు, ఇటు పోలీసులు పదే పదే చెప్పారు. ఇలా గంటకు పైగా సమయం గడిచిపోయింది. ఎట్టకేలకు ట్యాంక్ నుంచి విద్యార్థిని ఏడుస్తూ కిందకు దిగడంతో స్థానికులు, పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. పట్టణ సీఐ పి.వీరబాబు, పట్టణ ఎస్సైలు, అగ్నిమాపక సిబ్బంది విద్యార్థిని ట్యాంక్ నుంచి దింపడంతో సఫలీకృతులయ్యారు. విద్యార్థినికి కౌన్సెలింగ్ నిర్వహించి ఆమె తల్లికి అప్పగించడంతో కథ సుఖాంతమైంది.
వాటర్ ట్యాంక్ ఎక్కిన బి.ఫార్మసీ విద్యార్థిని
గంటన్నర సేపు పోలీసులు,
స్థానికుల్లో ఉత్కంఠ
ఎట్టకేలకు విద్యార్థిని ట్యాంక్ దిగడంతో
కథ సుఖాంతం
Comments
Please login to add a commentAdd a comment