నాలుగేళ్లుగా జిల్లాలో మంజూరు చేసిన కౌలు కార్డులు, కౌలు
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): కూటమి ప్రభుత్వ హయాంలో తమకు తీరని అన్యాయం జరుగుతోందని కౌలు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో వ్యవసాయం పండగ మాదిరిగా ఉండేది. గ్రామ స్థాయిలో విత్తనాలు మొదలుకొని ధాన్యం అమ్మకాల వరకూ రైతులకు వారి చెంతనే సేవలు అందజేసేవారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత వ్యవసాయంపై నిర్లక్ష్య వైఖరి కనిపిస్తోందని చెబుతున్నారు. అన్నదాతా సుఖీభవ పేరిట ఇస్తామన్న రూ.20 వేల పెట్టుబడి సాయం హామీని గాల్లో కలిపేశారు. మరోవైపు కౌలు రైతుల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించారు.
గుర్తింపు కార్డులతో సరి
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గత ఖరీఫ్‌లో కౌలు రైతుల గుర్తింపులో తీవ్ర జాప్యం చోటు చేసుకుంది. ఎట్టకేలకు జిల్లాలో 35 వేల మంది కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇచ్చారు. కానీ వారికి ప్రభుత్వం నుంచి ఒక్క పథకం కూడా దక్కలేదు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో కౌలు రైతులకు విత్తనాలు, ఎరువులు, పంట నష్టపరిహారంతో పాటు బ్యాంకుల్లో రుణాలు కూడా ఇచ్చేవారు. ప్రస్తుతం ఖరీఫ్ ముగిసి, రబీ సీజన్ కూడా మొదలై నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకూ కౌలు రైతులకు ప్రభుత్వం పంట నష్టపరిహారం కానీ, ఎరువులు, విత్తనాలు, రుణాలు ఇవ్వడం లేదు.
కౌలు రైతులపై రుణపాశం
ప్రస్తుతం ఎకరా భూమికి యజమానికి రూ.25 వేల నుంచి రూ.30 వేల వరకూ కౌలు చెల్లించాల్సి వస్తోంది. ఆ మొత్తం చెల్లించిన అనంతరమే కౌలు రైతులు సాగు చేపడుతున్నారు. దీనికి తోడు విత్తనాల కొనుగోలు మొదలు, పంట దమ్ము, వరి నాట్లు, ఎరువులు, పురుగు మందుల వంటి వాటికి మరో రూ.25 వేలు పైగా పెట్టుబడి అవుతోంది. మొత్తం మీద ఎకరం భూమి కౌలుకు చేయాలంటే రూ.50 వేల వరకూ అవసరం. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో కౌలు గుర్తింపు కార్డు ఉన్న ప్రతి రైతుకు రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకూ ఎటువంటి హామీ లేకుండా పంట రుణాలు ఇచ్చేవారు. ప్రస్తుతం గుర్తింపు కార్డులు ఇచ్చినా ఎటువంటి రుణాలూ ఇవ్వకుండానే చేతులు దులుపుకొన్నారు. గత్యంతరం లేక కౌలు రైతులు బయటి వ్యాపారుల నుంచి అధిక వడ్డీలకు అప్పులు తెచ్చుకోవాల్సిన దుస్థితి నెలకొంది. పడిన శ్రమంతా కౌలుకు, పెట్టుబడులు, వడ్డీలకే పోతోందని, తమకు మిగులుతున్నదేమీ ఉండటం లేదని కౌలు రైతులు వాపోతున్నారు. కనీసం ప్రభుత్వం బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పిస్తే తక్కువ వడ్డీ కావడంతో కనీసం ఆ మొత్తమైనా మిగిలేదని అంటున్నారు. గత ప్రభుత్వంలోనే తమకు ఎంతో మేలు జరిగిందని, ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వారు మండిపడుతున్నారు.
పరిహారం.. పరిహాసం
గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో కౌలు రైతులకు ప్రభుత్వ పథకాలన్నీ అమలు చేసేవారు. వైఎస్సార్ రైతు భరోసా కింద నిరుపేద ఎస్సీ, బీసీ కౌలు రైతుల ఖాతాల్లో ఏటా రూ.13,500 చొప్పున ఐదేళ్ల పాటు పెట్టుబడి సాయం జమ చేశారు. ప్రకృతి వైపరీత్యాలకు పంట దెబ్బ తింటే కౌలు రైతులకు కూడా నష్ట పరిహారం అందించేవారు. గత ఏడాది అధిక వర్షాలకు భారీగా పంట నష్టం జరిగినా కౌలు రైతులకు కూటమి ప్రభుత్వం ఎక్కడా ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. భూమి సర్వే నంబర్ల ఆధారంగా ప్రతి ఎకరాకు రూ.10 వేల చొప్పున ప్రభుత్వం ఆయా రైతుల ఖాతాల్లో పంట నష్ట పరిహారం జమ చేసింది. ఆ మొత్తాన్ని ఇచ్చేందుకు భూమి యజమానులు ససేమిరా అనడంతో కౌలు రైతులు నిండా మునిగారు.
ఫ గుర్తింపుతో సరి.. రుణాలేవీ మరి!
ఫ పట్టించుకోని కూటమి సర్కారు
ఫ కౌలు రైతులకు అందని పథకాలు
సంవత్సరం కౌలు కార్డులు రుణాలు
2020–21 36,795 18.73
2021–22 44,580 47.17
2022–23 41,322 46.46
2023–24 56,399 53.80
రుణాలిచ్చి ఆదుకోవాలి
ఈ ఏడాది కౌలు రైతులకు బ్యాంకుల నుంచి రుణాలివ్వలేదు. బయటి వ్యాపారుల వద్ద అధిక వడ్డీలకు అప్పులు తెచ్చుకొని తొలకరి సీజన్‌లో ఇబ్బందులు పడ్డాం. కనీసం దాళ్వాలోనైనా బ్యాంకు రుణాలిప్పించాలి. లేకుంటే కౌలు రైతులు సాగు చేయడం కష్టమే.
– రాయుడు శ్రీనివాస్, కౌలు రైతు, యండమూరు, కరప మండలం
కౌలు రైతులను పట్టించుకోవడం లేదు
ఈ ప్రభుత్వం కౌలు రైతులను అసలు గుర్తించడం లేదు. ఎటువంటి సహాయమూ చేయడం లేదు. గత ప్రభుత్వం కౌలు రైతులను ఎంతగానో ఆదుకొంది. గుర్తింపు కార్డులివ్వడమే కాకుండా బ్యాంకుల ద్వారా పంట రుణాలు కూడా ఇచ్చింది.
– తుమ్మల అచ్చియ్య, కౌలు రైతు, పులిమేరు, పెద్దాపురం మండలం
నాలుగేళ్లుగా జిల్లాలో మంజూరు చేసిన కౌలు కార్డులు, కౌలు
నాలుగేళ్లుగా జిల్లాలో మంజూరు చేసిన కౌలు కార్డులు, కౌలు
నాలుగేళ్లుగా జిల్లాలో మంజూరు చేసిన కౌలు కార్డులు, కౌలు
Comments
Please login to add a commentAdd a comment