
మృత్యు శకటం
శుక్రవారం శ్రీ 7 శ్రీ మార్చి శ్రీ 2025
పల్లిపాలెంలో విషాద ఛాయలు
కాజులూరు: ఏలూరు బస్సు ప్రమాదంలో జుత్తుగ భవాని దుర్మరణం పాలవడంతో ఆమె స్వగ్రామం కాజులూరు మండలం పల్లిపాలెం శివారు కళావారిపేటలో విషాద ఛాయలు అలముకున్నాయి. గ్రామానికి చెందిన జుత్తుగ అప్పారావు, భవాని దంపతులకు ఇద్దరు కుమారులు. భార్యాభర్తలిద్దరూ జీవనోపాధి నిమిత్తం కొంత కాలంగా హైదరాబాద్‌లో ఉంటున్నారు. అప్పారావు ఒక అపార్టుమెంట్‌లో వాచ్‌మన్‌గా చేస్తూండగా భవాని పలువురి ఇళ్లలో పని చేస్తోంది. పెద్ద కుమారుడు ఇంజినీరింగ్, చిన్న కుమారుడు ఇంటర్మీడియెట్ చదువుతున్నారు. బంధువుల ఇంట్లో వివాహ వేడుకకు భవాని కాకినాడ బయలుదేరింది. ఈ క్రమంలో జరిగిన బస్సు ప్రమాదంలో మృతి చెందింది. ఆమె మరణ వార్త తెలియగానే గ్రామస్తులు దిగ్భ్రాంతికి గురయ్యారు. హైదరాబాద్‌లో ఉంటున్నప్పటికీ భవాని తరచూ గ్రామానికి వచ్చి వెళ్లేదని, వచ్చిన ప్రతిసారీ అందరితో కలివిడిగా మసులుతూండటంతో అసలు ఆమె ఎప్పుడూ గ్రామంలోనే ఉన్నట్టుండేదని స్థానికులు చెబుతున్నారు.
బస్సును పక్కకు తీస్తున్న క్రేన్
● ఏలూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం
● లారీని ఢీకొన్న ట్రావెల్స్ బస్సు
● వేకువజామున ఘటన
● ఘటనా స్థలంలో ముగ్గురు,
చికిత్స పొందుతూ మరొకరు మృతి
● 21 మందికి గాయాలు
● మృతులు, క్షతగాత్రుల్లో అత్యధికులు
ఉమ్మడి జిల్లా వాసులు
ఏలూరు రూరల్: తెల్లవారకముందే వారి జీవితాలు తెల్లారిపోయాయి. కొద్ది గంటల్లోనే గమ్య స్థానాలకు చేరుకోవాల్సిన వారిని మృత్యువు కబళించింది. జిల్లా కేంద్రం ఏలూరులోని చొదిమెళ్ల వద్ద 16వ నంబర్ జాతీయ రహదారిపై రత్నాస్ హోటల్ సమీపాన ఆగి ఉన్న ఓ లారీని ట్రావెల్స్ బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో సంఘటన స్థలంలోనే ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. చికిత్స పొందుతూ డ్రైవర్ మృతి చెందారు. మరో 21 మంది గాయపడ్డారు. మృతులు, క్షతగాత్రుల్లో అత్యధికులు కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి జిల్లాలకు చెందిన వారు. ప్రమాదం అనంతరం బస్సు నుంచి కారిన రక్తధారలు చూసిన వారు భయభ్రాంతులకు గురయ్యారు. సంఘటన స్థలంలో క్షతగాత్రుల హాహాకారాలు మిన్నంటాయి.
ప్రమాదం జరిగిందిలా..
ప్రమాదం జరిగిన ప్రాంతంలో విజయవాడ నుంచి రాజమహేంద్రవరం వెళ్తున్న సిమెంట్ లారీ మరమ్మతులతో నిలిచిపోయింది. గురువారం వేకువజామున 5 గంటల సమయంలో రమణ ప్రైవేట్ ట్రావెల్స్‌కు చెందిన బస్సు హైదరాబాద్ నుంచి కాకినాడ వెళ్తోంది. బస్సును అతి వేగంగా నడుపుతున్న డ్రైవర్ మధు.. పొగమంచు కమ్ముకోవడంతో రోడ్డు పక్కన ఆగి ఉన్న సిమెంట్ లారీని గుర్తించలేకపోయాడు. చివరి నిమిషంలో గమనించి, తప్పించేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో లారీ వెనుక భాగాన్ని బస్సు ఢీకొంది. ఆ వేగానికి కండక్టర్ వైపు భాగాన్ని బస్సు చీల్చుకుంటూ వెళ్లి డివైడర్‌ను ఢీకొట్టి రోడ్డుపై బోల్తా పడింది. దీంతో బస్సులో నిద్రిస్తున్న ప్రయాణికులు ఒక్కసారిగా హాహాకారాలు చేశారు. ఘోర ప్రమాదంతో ఉలిక్కిపడిన స్థానికులు, ఇతర వాహనాల డ్రైవర్లు హుటాహుటిన వచ్చి ప్రయాణికులను రక్షించేందుకు ప్రయత్నించారు. హైవే పెట్రోలింగ్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, బస్సులో చిక్కుకున్న వారిని బయటకు తీశారు. గాయపడిన వారిని 108 అంబులెన్సులో ఏలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ ఘోర ప్రమాదంతో ఘటనా స్థలం రక్తసిక్తం కాగా.. పరిసరాల్లో బస్సులోని విడి భాగాలు చెల్లాచెదురుగా పడి, ఆ ప్రాంతమంతా భీతావహంగా మారింది.
శకలాల మధ్య ఇరుక్కుపోయి..
నుజ్జునుజ్జయిన బస్సులో కండక్టర్ సీటు వైపు కూర్చున్న మహిళలు మట్టపర్తి భవాని, జుత్తుగ భవాని (38), బొంతు భీమేశ్వరరావు చిక్కుకుపోయి విలవిలలాడారు. బస్సు డ్రైవర్ మధు సైతం స్టీరింగ్ వద్ద ఇరుక్కుపోయాడు. పోలీసులు క్రేన్‌తో బస్సును లేపి పక్కకు చేర్చారు. బస్సులో చిక్కుకుపోయిన ఈ నలుగురినీ ఏలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అప్పటికే మట్టపర్తి భవాని, జుత్తుగ భవాని, భీమేశ్వరరావు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. డ్రైవర్ మధుకు అత్యవసర చికిత్స అందించారు. నాలుగు గంటల పాటు మృత్యువుతో పోరాడిన అనంతరం అతడు మృతి చెందాడు. మధు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ప్రమాదంపై ఏలూరు రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించారు.
క్షత్రగాత్రులు వీరే..
ఈ ప్రమాదంలో కాకినాడకు చెందిన కోలా సురేఖ, కోలా రాజబాబు, కోలా లిఖిత, వనమనీడి ఆదిలక్ష్మి, పి.అక్కమ్మ, కోట వేణి, రాజమహేంద్రవరానికి చెందిన పి.హేమలత, మాచర్ల సుజాత, పాలకొల్లుకు చెందిన మండపాక శ్రీదేవి, మండపాక శశిరేఖతో పాటు మద్దాల కీర్తి, మాచర్ల సుజాత, మండపాక బాలాజీ, మండపాక హరిణి, ఆర్నాలకంటి శ్రీలక్ష్మి, పువ్వుల శ్యామ్‌కుమార్, శీలం ప్రకాష్, ఎం.ప్రతాప్, గోణజ విజయకుమార్, రామిశెట్టి సోమ సత్యనారాయణ, టి.రవికుమార్, జి.మణికంఠ (క్లీనర్) ఉన్నారు. క్షతగాత్రులకు అధికారులు చికిత్స చేయించి గమ్యస్థానాలకు పంపించారు.
అతి వేగం.. పొగమంచు
ఈ ఘోర ప్రమాదానికి అతి వేగం, పొగమంచు కారణమని స్థానికులు భావిస్తున్నారు. వేకువజామున పొగమంచు కమ్ముకోవడంతో బస్సు డ్రైవర్ ఆగి ఉన్న లారీని గుర్తించలేకపోయాడు. అదే సమయంలో బస్సును అతి వేగంగా నడుపుతూండటంతో దగ్గరకొచ్చిన తర్వాత లారీని గుర్తించాడు. వెంటనే బస్సును అదుపు చేసే ప్రయత్నం చేసినా అప్పటికే ఘోరం జరిగిపోయింది. మరోవైపు ప్రమాద స్థలానికి 30 మీటర్ల దూరంలో పార్కింగ్ లేన్ ఉండగా.. సిమెంట్ లారీని జాతీయ రహదారి పక్కన నిలపడం కూడా ఈ ప్రమాదానికి కారణంగా చెబుతున్నారు.
శోకసంద్రంలో భవానీ కుటుంబం
జగ్గంపేట: ఈ ప్రమాదంలో మృతురాలు మట్టపర్తి భవానీ స్వస్థలం కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం కాట్రావులపల్లి. హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పని చేస్తోంది. ఆమె తండ్రి రాజు కౌలు రైతు. ఆమెకు ఓ తమ్ముడు ఉన్నాడు. కష్టపడి చదువుకుని సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అయిన భవాని.. వేంకటేశ్వరస్వామి ఆలయ ప్రతిష్ఠ సందర్భంగా స్వగ్రామానికి వస్తోంది. ఈ క్రమంలో ఏలూరు వద్ద జరిగిన బస్సు ప్రమాదంలో మృత్యువాత పడింది. తమ గారాలపట్టి అయిన భవాని.. తమ కుటుంబానికి ఎంతో ఆసరాగా ఉంటుందనుకుంటే.. దేవుడు తమపై దయ చూపలేదంటూ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. భవానీ మృతితో ఆమె కుటుంబ సభ్యులు శోక సంద్రంలో మునిగిపోయారు.

మృత్యు శకటం

మృత్యు శకటం

మృత్యు శకటం

మృత్యు శకటం

మృత్యు శకటం

మృత్యు శకటం

మృత్యు శకటం

మృత్యు శకటం

మృత్యు శకటం

మృత్యు శకటం

మృత్యు శకటం

మృత్యు శకటం
Comments
Please login to add a commentAdd a comment