బతుకు పూలబాట కాదు.. | - | Sakshi
Sakshi News home page

బతుకు పూలబాట కాదు..

Published Fri, Mar 7 2025 12:23 AM | Last Updated on Fri, Mar 7 2025 12:23 AM

బతుకు

బతుకు పూలబాట కాదు..

పోలీసు ఇన్ఫార్మర్‌

అనుకునే వారు

మొదట్లో గిరిజనులు నాతో మాట్లాడేవారు కాదు. బయటి నుంచి వచ్చానని, నన్నో పోలీసు ఇన్ఫార్మర్‌గా భావించి భయపడేవారు. రకరకాలుగా ఇబ్బంది పెట్టేవారు. వారు చెప్పేది అర్థమయ్యేది కాదు. ఆ సమయంలోనే ముందుగా వారి భాష నేర్చుకోవాలని అనుకున్నాను. అలా వారి భాష నేర్చుకుని వారిలో ఒకరిగా కలిసిపోయాను. ఎంచుకున్న లక్ష్యాన్ని సాధించాలనే తపనతో పని చేశాను. ‘ఈ పని నేనే చేయగలనని అనుకుంటే ఏదైనా సాధించగలరు. నేను చేయగలనా? అనుకుంటే ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేరు’. నా ద్వారా ఆ గిరిజనులకు భాషాపరంగా మేలు జరగాలనే తలంపుతోనే ముందుకు వెళ్లాను. ఆ సమయంలో ప్రొఫెసర్‌ సింథియా వెస్లీతో పాటు చాలా మంది విదేశీయుల నుంచి ప్రోత్సాహం నన్ను మరింత కార్యోన్ముఖురాలిని చేసింది. ఆల్ఫా, బీటా ఏవిధంగా రాయాలో వారి నుంచి నేర్చుకున్నాను. అంతరించి పోతున్న బగత, గదబ, కొలామి, కొండదొర వంటి 19 గిరిజన భాషలకు లిపిని రూపొందించడంలో విజయం సాధించాను. తద్వారా 2022లో అప్పటి భారత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ చేతుల మీదుగా నారీ శక్తి పురస్కారం అందుకున్నాను.

నా దారిలో ఎన్నో ముళ్లు గుచ్చుకున్నాయి

ఎవరిని ఉద్ధరించాలని అంటూ

హేళన చేశారు

అయినా వెనుకడుగు వేయలేదు

అలా 19 గిరిజన భాషలకు

లిపి రూపొందించా..

‘నన్నయ’ వీసీ ఆచార్య ప్రసన్నశ్రీ

వ్యక్తిగతం..

గుంటూరు జిల్లా సీతానగరంలో 1964 సెప్టెంబరు 2న జన్మించాను. నాన్న సత్తుపాటి ప్రసాదరావుది రైల్వేలో ఉద్యోగం కావడంతో విజయవాడ, కోల్‌కతా, మిరాజ్‌(మహారాష్ట్ర)లో చదువుకున్నాను. విజయవాడలో పదో తరగతి, కేబీఎన్‌ కళాశాలలో ఇంటర్‌, మాంటిస్సోరి మహిళా కళాశాలలో డిగ్రీ (1982–84) చదివాను. తరువాత విశాఖపట్నం ఆంధ్రా యూనివర్సిటీ(ఏయూ)లో ఎంఏ, తిరుపతి పద్మావతీ మహిళా విశ్వవిద్యాలయంలో పీహెచ్‌డీ చేశాను. అమ్మ వసుంధరాదేవి గృహిణి. అయినా పేపర్‌, పుస్తకాలు ఎక్కువగా చదివేది. నాకు ఇద్దరు చెల్లెళ్లు, ఒక తమ్ముడు. పెద్ద చెల్లెలు విజయవాడ, చిన్న చెల్లెలు కాకినాడ, తమ్ముడు రామచంద్రపురంలో ఉద్యోగాలు చేస్తున్నారు.

వృత్తిగతం..

1987లో పద్మావతి మహిళా యూనివర్సిటీలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా బోధనా వృత్తి చేపట్టి, 14 ఏళ్లు పని చేశాను. అక్కడి నుంచి విశాఖపట్నం ఏయూకు వచ్చాను. పాత సర్వీసును కూడా పరిగణనలోకి తీసుకోవడంతో 2002లో అక్కడ ప్రొఫెసర్‌ చేరాను. ఆవిధంగా ప్రొఫెసర్‌గా ఆంధ్రప్రదేశ్‌లో 23 ఏళ్ల పాటు విధులు నిర్వర్తించిన ఏకై క మహిళగా గుర్తింపు పొందాను. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో 10 సెమినార్లు నిర్వహించి, 60 సెమినార్లలో పాల్గొన్నాను. నేను రాసిన 125 పరిశోధన వ్యాసాలు, జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో ప్రచురితమయ్యాయి.

అలా.. గోదారి బిడ్డనయ్యా..

నా భర్త హరి వెంకట లక్ష్మణ్‌, మాది ప్రేమ వివాహం. మమ్మల్ని ఏయూనే కలిపింది. నేను ఇంగ్లిష్‌, ఆయన సోషియాలజీలో పీజీ చేస్తూండగా మా మనసులు కలిశాయి. మొదట పెద్దలు అంగీకరించకపోయినా, తరువాత ఓకే అన్నారు. ఆవిధంగా ఈ ప్రాంతానికి చెందిన అల్లు ఎరకయ్య కోడలిగా గోదావరి ప్రాంత బిడ్డనయ్యాను. మా అమ్మాయిని కూడా ఈ ప్రాంతంలోనే ఇచ్చాం. గోదావరి వాసే.

నా ఎదుగుదలకు

ఆయన దివిటీ

ప్రస్తుతం నేనీ ఉన్నత స్థితిలో ఉండటానికి ప్రధాన కారణం నా భర్త హరి వెంకట లక్ష్మణ్‌ అని గర్వంగా చెబుతా. ఆయన ఓ కొవ్వొత్తిలా కరిగిపోతూ నా ఎదుగుదలకు దివిటీలా నిలిచారు. గిరిజన భాషలకు లిపిని రూపొందించే క్రమంలో ఎంతో బిజీగా ఉండేదాన్ని, ఆ సమయంలో మాకున్న ఒకే ఒక్క పాప హర్షిత ఆలనా పాలనా ఆయనే చూసుకుంటూ, కార్యోన్ముఖురాలిని కావాలని ప్రోత్సహించారు. హర్షిత ప్రస్తుతం మెకానికల్‌ ఇంజినీర్‌గా వర్క్‌ ఫ్రమ్‌ హోం చేస్తోంది. ఒక బాబు ఉన్నాడు.

పుట్టింటి వారు

ఉన్నత స్థాయిలో ఉన్నవారే..

అమ్మ, నాన్న వైపు వారంతా ఐఏఎస్‌, ఐపీఎస్‌, గ్రూప్‌–1 ఉద్యోగాలు చేసిన వారే. నలుగురు మావయ్యలలో ఇద్దరు ఐపీఎస్‌, ఒకరు ఐఏఎస్‌. చిన్నమ్మలిద్దరూ వైద్యులు. మా తాతయ్య వృత్తి రీత్యా ఉపాధ్యాయుడు, ధనవంతుడు కూడా. ఆ సమయంలో ధనాన్ని బానల్లో దాచుకునేవారంటారు. ఒక విద్యార్థి నమ్మకంగా ఉంటూనే కొంత ధనాన్ని దోచుకున్నాడట. నాకు 6 నెలల వయసులోనే తాతయ్య చనిపోయారు. నా ఎదుగుదల ఎక్కువగా కోల్‌కతాలోనే. ఆ తరువాత మహారాష్ట్ర, విజయవాడల్లో పెరిగాను. అందుకనే 23 భాషలు మాట్లాడతాను.

అన్నయ్య ఆశయం నెరవేరింది

మా అన్నయ్య (కజిన్‌) ఐజీగా పని చేస్తూ చనిపోయా రు. కొన్నేళ్ల క్రితం ఆయన నాకు ఒక చీర బహుమతిగా ఇస్తూ, ‘నువ్వు కచ్చితంగా వైస్‌ చాన్సలర్‌ అవుతావు. అప్పుడు కట్టుకో’ అన్నాడు. ఆయన నమ్మకం నిజమైంది. అందుకే ఆ చీరను నన్నయ వీసీగా బాధ్యతలు తీసుకునే సమయంలో కట్టుకున్నాను.

స్టూవర్టుపురం అంటూ ఇంకా వదిలిపెట్టరా?

తాతగారి ఊరి పేరు స్టూవర్టుపురం అని చెప్పడమే గానీ, నేను ఏనాడూ అక్కడ లేను. ఊహ తెలిసిన తరువాత స్టూవర్టుపురం అంటే దొంగల ఊరు అంటారని కాస్త భయపడ్డాను. కానీ అక్కడి వారు చాలా మంచివారు. నిజానికి ఏ ఊళ్లో దొంగలు లేరు చెప్పండి? ‘పూర్వం చదువుకోనందు వల్లనే చాలా మంది దొంగలుగా తయారయ్యారు. కానీ నేటి కాలంలో చదువుకున్న వాళ్లు కూడా దొంగలుగా మారుతున్నారు, దీన్ని ఏమనాలి?’ అని మా నాన్నమ్మ అంటూండేది. ఆచార్య ప్రసన్నశ్రీ ఎలా ఎదిగిందనేది వదిలేసి, స్టూవర్టుపురానికి చెందిన.. అంటూ ఆ గ్రామం మూలాలున్న వారిని ఇంకా వదిలిపెట్టరా?

‘జీవితం పూలబాట కాదు. దారిలో ఎన్నో ముళ్లు గుచ్చుకున్నాయి. ఏనాడూ ఆత్మస్థైర్యాన్ని కోల్పోలేదు. ఎంచుకున్న లక్ష్యం వైపు అడుగులు వేశాను. ఆడ పిల్లలకు పెద్ద చదువులు ఎందుకనే సమాజం నుంచి.. ఆడపిల్లలు తలచుకుంటే దేనిలోనూ తీసిపోరనే నమ్మకంతో పయనించాను. ఉనికి కోల్పోతున్న 19 గిరిజన భాషలకు లిపి రూపొందించి.. ఆయా వర్గాలకు ఎంతో కొంత మేలు చేసేందుకు ప్రయత్నించాను. ఈ క్రమంలో కన్నవారితో పాటు కట్టుకున్న భర్త ఇచ్చిన ప్రోత్సాహం మరువలేనిది. గిరిజన భాషలకు లిపిని కూర్చే క్రమంలో ఒకసారి నాటి రాష్ట్రపతి డాక్టర్‌ ఏపీజే అబ్దుల్‌ కలామ్‌ను కలిసే అవకాశం వచ్చింది. నా ప్రయత్నం గురించి తెలుసుకున్న ఆయన.. ‘నీ కాళ్లలో ఎన్ని ముళ్లు గుచ్చుకున్నాయ్‌ ప్రసన్నా’ అని అన్న మాటలు మరువలేను’ అన్నారు ‘నారీ శక్తి’ పురస్కార గ్రహీత.. ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య సత్తుపాటి ప్రసన్నశ్రీ. ఎంతో మంది విద్యార్థులను తీర్చిదిద్ది, సమాజానికి అందించే నన్నయ వర్సిటీకి ఉపకులపతిగా బాధ్యతలు చేపట్టిన ఈ తొలి గిరిజన మహిళ.. మార్చి 8– అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తన జీవనపథంలోని వెలుగుచీకట్లను తనను కలసిన ‘సాక్షి’తో పంచుకున్నారు. – రాజానగరం

భగత గిరిజన భాషకు ఆచార్య ప్రసన్నశ్రీ రూపొందించిన లిపి

పిచ్చిగీతలంటూ హేళన

1982లో ఇంటర్మీడియెట్‌ అయిన తరువాత అటవీ ప్రాంతానికి వెళ్లాను. అక్కడి వారిని చూసి, వారి కోసం ఏదో ఒకటి చేయాలని అనుకున్నాను. ఉద్యోగం వచ్చిన తరువాత వాచకంగా ఉన్న భాషకు లిపిని అందించాలనే సంకల్పించాను. శూన్యం నుంచి ఒక ప్రపంచాన్ని సృష్టించుకుని ఎదగడానికి ప్రయత్నించాను. నా ప్రయత్నాన్ని కొందరు ఉన్నతాధికారులు, నాయకులు ప్రోత్సహించకపోగా ఏమిటీ పిచ్చి గీతలు, ఎవరిని ఉద్ధరించాలని అంటూ అవమానించారు. ఆ సమయంలో నిజంగా నరకం చూశాను. చాలా బాధ వేసేది. వాటన్నిటినీ భరిస్తూనే నా ప్రయత్నాన్ని వదలలేదు. మనిషి మనుగడ అభివృద్ధి వైపు అడుగులు వేయాలంటే అక్షరం అవసరం. దానిని గుర్తించి, నా ప్రయత్నాన్ని కొనసాగించాను.

No comments yet. Be the first to comment!
Add a comment
బతుకు పూలబాట కాదు..1
1/3

బతుకు పూలబాట కాదు..

బతుకు పూలబాట కాదు..2
2/3

బతుకు పూలబాట కాదు..

బతుకు పూలబాట కాదు..3
3/3

బతుకు పూలబాట కాదు..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement