
నేడు 2కే రన్
కాకినాడ సిటీ: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నిర్వహిస్తున్న వారోత్సవాల్లో భాగంగా శుక్రవారం ఉదయం 7 గంటలకు కాకినాడ భానుగుడి జంక్షన్ నుంచి సర్పవరం జంక్షన్ వరకూ 2కే రన్ నిర్వహిస్తున్నారు. కలెక్టర్ షణ్మోహన్ గురువారం ఒక ప్రకటనలో ఈ విషయం తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు, మహిళలు తదితరులు పాల్గొంటారన్నారు.
కూటమి సిండికేట్‌కే గీత
కార్మికుల మద్యం షాపులు
అమలాపురం రూరల్: జిల్లాలో కల్లు గీత కార్మికులకు కేటాయించిన మద్యం షాపులను కూటమి సిండికేట్లే దక్కించుకున్నారు. జిల్లాలో మొత్తం 13 మద్యం షాపులను గీత కార్మికులకు కేటాయించారు. అమలాపురం మున్సిపాలిటీ, అమలాపురం మండలం, ఆలమూరు, అయినవిల్లి, ఐ.పోలవరం, కె.గంగవరం, కపిలేశ్వరపురం, కొత్తపేట, మండపేట మున్సిపాలిటీ, ముమ్మిడివరం రూరల్, పి.గన్నవరం, రామచంద్రపురం మున్సిపాలిటీ, రామచంద్రపురం రూరల్ ప్రాంతాల్లోని ఈ షాపుల్లో ఒకటి గౌడ కులస్తులకు, 12 శెట్టిబలిజలకు కేటాయించి, టెండర్లు పిలిచారు. గీత కార్మికుల ముసుగులో కూటమి సిండికేట్లు ఒక్కో దుకాణానికి 5 నుంచి 15 వరకూ టెండర్లు వేశారు. మొత్తం 261 టెండర్లు దాఖలయ్యాయి. వీటికి కలెక్టరేట్‌లో జేసీ నిషాంతి, డీఆర్‌ఓ రాజకుమారి, అమలాపురం ఎకై ్సజ్ సూపరింటెండెంట్ ఎస్‌కేడీవీ ప్రసాద్ పర్యవేక్షణలో గురువారం లక్కీ డ్రా తీసి, షాపులు కేటాయించారు.
గ్రహణం మొర్రికి
నేడు ఉచిత వైద్య శిబిరం
ముమ్మిడివరం: ఏపీ సమగ్ర శిక్ష, హైదరాబాద్ బసవ తారకం క్యాన్సర్ ఆసుపత్రి సంయుక్త ఆధ్వర్యాన గ్రహణం మొర్రి, గ్రహణ శూలతో బాధ పడుతున్న చిన్నారులకు శుక్రవారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించనున్నారు. జిల్లా విద్యాశాఖాధికారి, సమగ్ర శిక్ష అదనపు పథక సంచాలకుడు షేక్ సలీం బాషా గురువారం ఒక ప్రకటన లో ఈ విషయం తెలిపారు. ముమ్మిడివరం ఎయిమ్స్ ఇంజినీరింగ్ కళాశాలలో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకూ నిర్వహించే ఈ శిబిరంలో చిన్నారులకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. అవసరమైన వారికి ఉచితంగా శస్త్రచికిత్సలు చేయనున్నారు. శిబిరానికి వచ్చే చిన్నారులకు ఉచిత రవాణా ఖర్చులు ఇస్తారు. జిల్లాలోని చిన్నారుల తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. అదనపు సమాచారానికి జిల్లా సహిత విద్య కో ఆర్డినేటర్ మర్రెడ్డి వెంకట సత్యనారాయణను 99636 54283 మొబైల్ నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.
విపత్కర పరిస్థితిని
ఆత్మస్థైర్యంతో ఎదుర్కోవాలి
అమలాపురం టౌన్: ఎటువంటి విపత్కర పరిస్థితినైనా ఆత్మస్థైర్యంతో ఎదుర్కోవాలని విద్యార్థినులకు జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు సూచించారు. పోలీసు విధులు, ఆయుధాలు, మహిళా పోలీసు స్టేషన్ పనితీరు, ఎఫ్‌ఐఆర్ నమోదు, దర్యాప్తు, విచారణలపై విద్యార్థినులు, మహిళలు అవగాహన పెంచుకోవాలని అన్నారు. ఈ నెల 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పట్టణంలోని వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థినులకు తన కార్యాలయంలో గురువారం నిర్వహించిన ఓపెన్ హౌస్ కార్యక్రమంలో ఎస్పీ మాట్లాడారు. పోలీసు విధుల పట్ల అవగాహన కల్పించారు. సమస్యల్లో చిక్కుకున్న మహిళలు, యువతులు మహిళా పోలీస్ స్టేషన్ సేవలను సద్వినియోగం చేసుకునే విధానాన్ని వివరించారు. పోలీసు విధులపై జిల్లా ఏఎస్పీ ఏవీఆర్‌పీబీ ప్రసాద్ కూడా అవగాహన కల్పించారు. కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచి సీఐ బి.రాజశేఖర్, డీసీఆర్‌బీ సీఐ వి.శ్రీనివాస్, అమలాపురం పట్టణ సీఐ కిషోర్‌బాబు పాల్గొన్నారు.
మహిళల సమగ్రాభివృద్ధికి కృషి
అమలాపురం రూరల్: ప్రభుత్వ పథకాల ద్వారా మహిళల సమగ్రాభివృద్ధికి కృషి చేయాలని జాయింట్ కలెక్టర్ టి.నిషాంతి అన్నారు. డీఆర్‌డీఏ, మెప్మా, వైద్య, ఆరోగ్యం, సీ్త్ర, శిశు సంక్షేమం, పరిశ్రమల శాఖల అధికారులతో కలెక్టరేట్‌లో గురువారం నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. సత్యనారాయణ గార్డెన్స్‌లో నిర్వహించే జిల్లా స్థాయి మహిళా దినోత్సవాన్ని ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో విజయవంతం చేయాలని సూచించారు. మహిళా సాధికారతను ప్రతిబింబించేలా వివిధ శాఖల ఆధ్వర్యాన సూర్యఘర్, డ్వాక్రా ఉత్పత్తులు, విశ్వకర్మ యోజన, పోషకాహారం వంటి ప్రత్యేక స్టాళ్లు ఏర్పాటు చేయాలని సూచించారు. స్వీయ రక్షణపై మహిళలకు అవగాహన కల్పించడంపై దృష్టి సారించాలన్నారు. సమావేశంలో డీఆర్‌డీఏ పీడీ శివశంకర్ ప్రసాద్, జిల్లా పరిశ్రమల కేంద్రం ఏడీ శివరాం ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment