కాకినాడ సిటీ: జిల్లాలో పి–4 సమగ్ర సర్వే ప్రక్రియను పారదర్శక రీతిలో నిర్వహించేందుకు అందరూ సహకరించాలని కలెక్టర్ షణ్మోహన్ సగిలి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. శుక్రవారం కలెక్టరేట్ విధాన గౌతమి సమావేశపు హాలులో కలెక్టర్ షణ్మోహన్ మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. జిల్లాలో శనివారం నుంచి నిర్వహించనున్న పి–4 సర్వే, సాగునీటి ఎద్దడి నుంచి రబీ పంటలను కాపాడటం, ల్యాండ్ కన్వర్షన్, మ్యూటేషన్‌ల ప్రక్రియలో దళారులను అరికట్టడం, లారీ రవాణా రంగంలో స్వేచ్ఛాయుత వాతావరణం, కాకినాడ ఎన్టీయార్ బీచ్ ఫ్రంట్‌లో పరిశుభ్రమైన ఆహ్లాదకర వాతావరణం నెలకొల్పడం అంశాలలో చేపట్టిన చర్యలను వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం పబ్లిక్, ప్రైవేట్, పీపుల్ పార్టిసిపేషన్–4 విధానం చేపట్టిందని, ఇప్పటికే 10 జిల్లాల్లో ఈ సర్వే ప్రక్రియ జరుగుతుందన్నారు. కాకినాడ జిల్లాలో ఈ సర్వే ప్రక్రియను ఎంపీడీవోల ఆధ్వర్యంలో సచివాలయ సిబ్బంది నిర్వహిస్తారని, డీఆర్వో మొత్తం ఈ ప్రక్రియను పర్యవేక్షిస్తారన్నారు. మండల అధికారులకు ఇందుకు అవసరమైన శిక్షణ, అవగాహన కార్యక్రమాలను శుక్రవారం నిర్వహించామన్నారు. ఆరు అంచెల అర్హతా ప్రామాణికాల కింద అర్హులైన ప్రతి ఒక్కరి ఇంటికీ సచివాలయ సిబ్బంది వెళ్లి 25 అంశాల సమాచారాన్ని సేకరిస్తారన్నారు. దాదాపు 4 నుంచి 5 లక్షల కుటుంబాల నుంచి సేకరించిన ఈ సర్వే ఆధారిత సమాచారాన్ని గ్రామసభలో ప్రదర్శించి, పారదర్శకమైన రీతిలో పేదలను గుర్తిస్తామని కలెక్టర్ షణ్మోహన్ తెలిపారు. జిల్లాలో తాళ్లరేవు, పిఠాపురం మండలాల్లో రబీ పంటలకు ఎదురవుతున్న నీటి ఎద్దడి నివారణకు చేపట్టిన చర్యలను వివరించారు. రైతులు వంతుల వారీ విధానానికి కట్టుబడక మోటార్లతో అక్రమంగా నీటిని వాడుకోవడం వల్లే ఈ కృత్రిమ నీటి ఎద్దడి తలెత్తినట్టు గమనించామని కలెక్టర్ అన్నారు. క్షేత్రస్థాయిలో విస్తృతమైన తనిఖీలు నిర్వహించి అక్రమంగా నీరు తరలిస్తున్న మోటార్లను సీజ్ చేయాలని ఆదేశించినట్లు తెలిపారు. కాకినాడలోని లారీ యజమానులు, పరిశ్రమల మధ్య సరుకు రవాణా లావాదేవీలు, చార్జీల అంశాలలో నెలకొన్న అవాంఛనీయ వివాదంపై మాట్లాడుతూ ఇరు వర్గాలు స్వేచ్ఛాయుత వాతావరణంలో తమ కార్యకలాపాలను నిర్వహించుకోవాలని ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment