కొత్త సోపాన మార్గం | - | Sakshi
Sakshi News home page

కొత్త సోపాన మార్గం

Published Fri, Mar 14 2025 12:34 AM | Last Updated on Fri, Mar 14 2025 12:34 AM

కొత్త

కొత్త సోపాన మార్గం

సత్యదేవుని సన్నిధికి రెండో మెట్ల మార్గం

రూ.90 లక్షలతో నిర్మాణం

చురుకుగా సాగుతున్న పనులు

గత ఏడాదే టెండర్ల ఖరారు

అన్నవరం: రత్నగిరిపై సత్యదేవుని ఆలయానికి వెళ్లేందుకు గాను రెండో మెట్ల మార్గం నిర్మాణ పనులు చురుకుగా జరుగుతున్నాయి. మొదటి ఘాట్‌ రోడ్డు వద్ద ఉన్న దేవస్థానం హైస్కూల్‌ పక్క నుంచి దీనిని నిర్మిస్తున్నారు. నూతన మెట్ల మార్గం నిర్మాణానికి గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వ హయాంలో సుమారు రూ.90 లక్షల వ్యయంతో గత ఏడాదే టెండర్‌ పిలిచి ఖరారు చేశారు. ఆ పనులు ప్రస్తుతం జోరుగా సాగుతున్నాయి.

కొత్త మెట్ల దారి ఎందుకంటే..

ప్రస్తుతం సత్యదేవుని ఆలయానికి వెళ్లేందుకు తొలి పావంచా వద్ద నుంచి రత్నగిరి పైకి 400 మెట్లతో ఒక మార్గం ఉంది. ఇది మొదటి ఘాట్‌ రోడ్డుకు సుమారు అర కిలోమీటరు దూరంలో ఉంది. చాలా సంవత్సరాల కిందట అన్నవరంలో పెద్దగా రద్దీ ఉండేది కాదు. దీంతో ప్రస్తుతం ఉన్న మెట్ల దారికి దగ్గర్లోనే గతంలో ఆర్టీసీ బస్సులు, ఇతర టూరిస్టు బస్సులు నిలిపేవారు. ఇప్పుడు కూడా ఆర్టీసీ బస్సులు ఇక్కడ నిలుపుతున్నా.. కాకినాడ, రాజమహేంద్రవరం వైపు నుంచి వచ్చే భక్తులు తొలుత ఆర్టీసీ బస్టాండ్‌ వద్దకు చేరుకుని, అక్కడి నుంచే కొండ పైకి ఆటోలు, దేవస్థానం బస్సులలో వెళ్తున్నారు. ఎవరైనా ఇప్పుడున్న మెట్ల మార్గంలో వెళ్లాలనుకున్నా.. అది ఆర్టీసీ బస్టాండ్‌కు దూరంగా ఉంది.

మరోవైపు అన్నవరం గ్రామంలో రద్దీ పెరగడంతో టూరిస్టు బస్సులను ఆర్టీసీ బస్టాండ్‌కు సమీపాన దేవస్థానం కళాశాల మైదానంలో నిలుపు చేస్తున్నారు. ఆ బస్సులలో వస్తున్న భక్తులు తొలి పావంచా వద్ద ఉన్న మెట్ల దారి వద్దకు వచ్చి, అక్కడి నుంచి కొండ పైకి చేరుకోవడం ఇబ్బందిగా ఉంటోంది. అందువలన మొదటి ఘాట్‌ రోడ్డు వద్ద నుంచి రెండో మెట్ల దారి నిర్మిస్తే అక్కడి నుంచి స్వామివారి ఆలయానికి చేరుకోవడానికి వీలుగా ఉంటుందని భావించి, ఆ మేరకు నూతన సోపాన మార్గానికి నేటి కమిషనర్‌, అప్పటి ఈఓ రామచంద్ర మోహన్‌ ప్రతిపాదనలు రూపొందించారు. ఆ తరువాత ఆయన ఇక్కడి నుంచి బదిలీ అవడంతో ఆ ప్రతిపాదన కాస్తా మూలన పడింది. 2023లో తిరిగి ఆయన అన్నవరం దేవస్థానం ఈఓగా నియమితులయ్యారు. అనంతరం, నూతన మెట్ల దారి నిర్మాణానికి తాజాగా అంచనాలు రూపొందించి, రూ.90 లక్షల వ్యయంతో టెండర్లు పిలిచి, ఖరారు చేశారు.

మూడు మలుపులు.. 210 మెట్లు

నూతన సోపాన మార్గాన్ని మూడు మలుపులతో నిర్మిస్తున్నారు. దీనిలో 210 మెట్లు వస్తాయన్నది అంచనా. ఇది మొదటి ఘాట్‌ రోడ్డు వద్ద ప్రారంభమై, రత్నగిరిపై ఓల్డ్‌ సీసీ, న్యూ సీసీ సత్రాల మధ్య రోడ్డులో ముగుస్తుంది. అక్కడి నుంచి సత్యదేవుని ఆలయం 200 మీటర్ల దూరం మాత్రమే ఉంటుంది. ఇప్పుడున్న మెట్ల మార్గం నిర్మాణంలో మాదిరిగానే ఇసుక రాయినే కొత్త మార్గంలో కూడా ఉపయోగిస్తున్నారు. ఈ రాయి త్వరగా వేడెక్కదు. అలాగే, త్వరగా చల్లబడుతుంది. అందువలన ఎండలో భక్తుల కాళ్లు కాలే అవకాశం ఉండదని అధికారులు తెలిపారు.

వీరికి ఉపయోగం

టూరిస్టు బస్సులు, ఇతర వాహనాల్లో వచ్చే భక్తులు తమ వాహనాలను దేవస్థానం కళాశాల మైదానంలో నిలుపుకొనేలా 2023లో అప్పటి ఈఓ ఎస్‌ఎస్‌ చంద్రశేఖర్‌ ఆజాద్‌ ఏర్పాట్లు చేశారు. ఈ మైదానంలో ఆరు షెడ్లు నిర్మించి, భక్తులకు అన్ని వసతులూ కల్పించారు. దీంతో ఆ షెడ్ల వద్ద గతంలో కంటే ఎక్కువగానే టూరిస్టు బస్సులు ఆగుతున్నాయి. అక్కడ భక్తులు స్నానాలు చేసి, రత్నగిరికి చేరుకుంటున్నారు. వీరికి నూతన మెట్ల మార్గం బాగా ఉపయోగపడనుంది. ప్రధానంగా నవంబర్‌ నుంచి జనవరి వరకూ రత్నగిరికి వచ్చే ఉత్తరాది భక్తులకు కూడా ఈ మెట్ల దారి ఉపయోగకరంగా ఉండనుంది. అలాగే, ఆర్టీసీ బస్టాండ్‌లో బస్సు దిగి వచ్చే భక్తులకు కూడా ఈ మార్గం ఉపయోగపడుతుంది.

వచ్చే నెలలో కమిషనర్‌ పరిశీలన

దేవస్థానంలో జరుగుతున్న నిర్మాణ పనులపై రాష్ట్ర దేవదాయ, ధర్మాదాయ శాఖ ఇన్‌చార్జి కమిషనర్‌ కె.రామచంద్ర మోహన్‌ బుధవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా నూతన మెట్ల మార్గం పనులపై ఆరా తీశారు. తాను ఏప్రిల్‌ 30న జరిగే సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామి చందనోత్సవానికి వెళ్తానని, ఆ సందర్భంగా అన్నవరం దేవస్థానానికి వచ్చి, పనుల పురోగతిని పరిశీలిస్తానని చెప్పారు.

జూన్‌ నెలాఖరుకు రెడీ

అన్నవరం దేవస్థానం ఈఓ వీర్ల సుబ్బారావు ఆదేశాల మేరకు జూన్‌ నెలాఖరుకల్లా నూతన మెట్ల మార్గం నిర్మాణ పనులు పూర్తి చేసి, భక్తులకు అందుబాటులోకి తెస్తాం. ప్రస్తుతం ఈ మెట్ల దారి నిర్మాణ పనులు చురుకుగా జరుగుతున్నాయి. సుమారు 15 అడుగుల వెడల్పున మెట్లు నిర్మిస్తున్నాం. ఈ మార్గానికి ఇరువైపులా రెండున్నర అడుగుల ఎత్తున రక్షణ గోడ, దాని పక్కనే విద్యుత్‌ స్తంభాలు, వాటికి విద్యుద్దీపాలు కూడా ఏర్పాటు చేస్తాం.

– వి.రామకృష్ణ, ఈఈ,

అన్నవరం దేవస్థానం

చురుకుగా జరుగుతున్న

రెండో మెట్ల మార్గం పనులు

No comments yet. Be the first to comment!
Add a comment
కొత్త సోపాన మార్గం1
1/3

కొత్త సోపాన మార్గం

కొత్త సోపాన మార్గం2
2/3

కొత్త సోపాన మార్గం

కొత్త సోపాన మార్గం3
3/3

కొత్త సోపాన మార్గం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement