పౌల్ట్రీ.. నష్టాల పల్టీ
పెరవలి: గత నెలలో వ్యాప్తి చెందిన బర్డ్‌ప్లూ వ్యాధితో తూర్పు గోదావరి జిల్లాలో కోళ్ల పరిశ్రమ కుదేలైంది. ఈ వ్యాధి సోకిన కోళ్లు మృత్యువాత పడటంతో ప్రస్తుతం కోళ్లఫామ్‌లు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. ప్రస్తుతం మిగిలి ఉన్న కోళ్లకు బర్డ్‌ఫ్లూ సోకకపోయినా చికెన్, గుడ్ల వినియోగంపై ప్రజల్లో ఒక విధమైన ఆందోళన నెలకొంది. దీంతో వీటి వినియోగం పూర్తిగా తగ్గిపోయింది. ప్రస్తుతం మిగిలి ఉన్న కోళ్ల నుంచి జిల్లాలో రోజుకు 80 లక్షల గుడ్లు ఉత్పత్తి అవుతున్నా, వినియోగం లేక, ధర పెరగక రోజుకు రూ.కోటి పైగా నష్టపోతున్నారు. కోళ్ల ఫామ్‌ల వద్ద గత డిసెంబర్‌లో గుడ్డు ధర రూ.6.15 ఉండగా.. ఈ నెల మొదటి వారంలో అది రూ.4.50కి, గురువారం నాటికి రూ.4.20కి పడిపోయింది. అధికారుల లెక్కల ప్రకారం జిల్లాలోని పౌల్ట్రీల్లో సుమారు 1.50 కోట్ల కోళ్లు పెంచుతూంటారు. చాలా వరకూ 50 వేలకు పైగా కోళ్లను పెంచగలిగే సామర్థ్యం కలిగిన పౌల్ట్రీలు ఉన్నాయి. ఇవి కాకుండా 5 వేల నుంచి 40 వేల కోళ్ల సామర్థ్యం కలిగిన మరికొన్ని ఫామ్‌లలో మరో కోటి కోళ్లను పెంచుతున్నారు. గత నెలలో బర్డ్‌ప్లూ బారిన పడి 40 లక్షలు పైగా కోళ్లు మృత్యువాత పడ్డాయి. దీంతో ప్రజలు చికెన్, గుడ్ల వినియోగం బాగా తగ్గించారు. దీంతో ఒకవైపు బ్రాయిలర్ కోళ్ల పెంపకం నిలిచిపోయింది. మరోవైపు గుడ్ల కోళ్ల ఉత్పత్తి జరుగుతున్నా వినియోగం తగ్గిపోవడంతో ఎక్కడికక్కడ గుడ్లు పేరుకుపోతున్నాయి. బ్రాయిలర్ కోళ్లు పెంచిన రైతులు బర్డ్‌ఫ్లూతో రూ.2 లక్షల నుంచి రూ.50 లక్షల వరకూ, లేయర్ కోళ్ల రైతులు రూ.10 లక్షల నుంచి రూ.కోటి వరకూ నష్టపోయారు. ఈ పరిస్థితుల్లో వారు మళ్లీ కోళ్ల పెంపకం చేపట్టడానికి ధైర్యం చేయడం లేదు. చాలాచోట్ల బ్రాయిలర్ కోళ్లు వేయకుండా షెడ్లను ఖాళీగా వదిలేశారు.
Comments
Please login to add a commentAdd a comment