కాకినాడ రూరల్: సర్పవరంలోని రాజ్యలక్ష్మీ సమేత భావనారాయణ స్వామి ఆలయంలో గురువారం హుండీల ఆదాయాన్ని లెక్కించారు. సీఎఫ్‌ఓ గ్రేడ్–1 ఈఓ వీరభద్రరావు పర్యవేక్షణలో గ్రామస్తులు, అర్చకులు, సిబ్బంది, సేవాదళ్ కార్యకర్తల సమక్షంలో 10 హుండీలు తెరచి, ఆదాయం లెక్కించారు. మొత్తం రూ.8,52,983 ఆదాయం లభించిందని ఈఓ మాచిరాజు లక్ష్మీనారాయణ తెలిపారు. నగదు రూపంలో రూ.7,53,512, నాణేలుగా రూ.99,471 వచ్చాయన్నారు.
ఘనంగా మొల్లమాంబ జయంతి
కాకినాడ రూరల్: జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యాన కవయిత్రి ఆతుకూరి మొల్లమాంబ జయంతి వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. సర్పవరం జంక్షన్ బోట్‌క్లబ్ వద్ద మొల్ల విగ్రహానికి జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా, బీసీ కార్పొరేషన్ అధికారి కె.లిల్లీ, ఈడీ శ్రీనివాసరావు, జిల్లా పౌర సంబంధాల అధికారి డి.నాగార్జున, రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ, తహసీల్దార్ కుమారి, శాలివాహన సంఘ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ, వాల్మీకి సంస్కృతంలో రచించిన రామాయణాన్ని పామరులకు సైతం అర్థమయ్యే రీతిలో తెలుగులో రచించిన మొట్టమొదటి కవయిత్రిగా మొల్ల ప్రసిద్ధికెక్కారని అన్నారు. అనంతరం శాలివాహన సంఘం ప్రతినిధుల ఆధ్వర్యాన మహిళలకు చీరలు పంపిణీ చేశారు.
నేడు ప్రత్యంగిర హోమం
అన్నవరం: ఫాల్గుణ పౌర్ణమి సందర్భంగా రత్నగిరి వనదేవత వనదుర్గ అమ్మవారికి శుక్రవారం ప్రత్యంగిర హోమం నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటలకు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం హోమం ప్రారంభిస్తారు. భక్తులు రూ.750 టికెట్టుతో హోమంలో పాల్గొనవచ్చునని అధికారులు తెలిపారు.
వెబ్ ఆప్షన్లకు
రేపటి వరకూ అవకాశం
కాకినాడ సిటీ: ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఉచిత డీఎస్సీ శిక్షణకు జ్ఞానభూమి పోర్టల్, ఇతర వెబ్ పోర్టల్‌లో వెబ్ ఆప్షన్ల సేవలు ప్రారంభమయ్యాయని జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ సంయుక్త సంచాలకుడు జి.శ్రీనివాసరావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. వెబ్ ఆప్షన్ల గడువు శనివారంతో ముగుస్తుందన్నారు. డీఎస్సీ ఉచిత కోచింగ్‌కు నమోదు చేసుకున్న ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులను ప్రస్తుతం షార్ట్ లిస్ట్ చేశామన్నారు. ఇందులో ఉన్న వెయ్యి మంది అభ్యర్థులు ఇప్పటికే తమ వెబ్ ఆప్షన్లు పూర్తి చేశారన్నారు. మిగిలిన వారు గడువులోగా వెబ్ ఆప్షన్లు పూర్తి చేయాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment