‘ఉల్లాస్’పై 23న పరీక్ష
మండలాల వారీగా ఉల్లాస్ పరీక్ష రాసే వారి వివరాలు
మండలం అభ్యర్థులు
తొండంగి 800
యు.కొత్తపల్లి 900
తాళ్లరేవు 750
కాకినాడ రూరల్ 900
రౌతులపూడి 580
శంఖవరం 576
కోటనందూరు 500
తుని 700
ఏలేశ్వరం 450
ప్రత్తిపాడు 650
పరీక్ష కేంద్రాలు 681
ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల మధ్య 3 గంటల వ్యవధిలో రాయాలి.
● హాజరు కానున్న 6,806 మంది
● ఎన్‌ఐఓఎస్ ద్వారా నిర్వహణ
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): అండర్‌స్టాండింగ్ ఆఫ్ లైఫ్ లాంగ్ లెర్నింగ్ ఫర్ ఆల్ ఇన్ సొసైటీ (ఉల్లాస్) పేరిట కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న అక్షరాస్యతా శిక్షణ పొందుతున్న వారికి ఈ నెల 23న ప్రాథమిక అక్షరాస్యత పరీక్ష నిర్వహించనున్నారు. నేషనల్ ఇన్‌స్టిట్యూషన్ ఆఫ్ ఓపెన్ స్కూల్ (ఎన్‌ఐఓఎస్) ద్వారా నిర్వహించే ఈ పరీక్షకు అధికారులు అన్ని ఏర్పాట్లూ చేస్తున్నారు. ఈ పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి ధ్రువపత్రాలు అందజేస్తారు. జిల్లాలో 6,806 మంది మహిళలను ఈ పరీక్షకు సంసిద్ధుల్ని చేశారు.
ఉల్లాస్ ఎందుకంటే..
మహిళల్లో అక్షరాస్యత పెంచే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఉల్లాస్ కార్యక్రమాన్ని నవంబర్ 5న ప్రారంభించింది. పదిహేను సంవత్సరాలకు పైగా గ్రామీణ ప్రాంతాల్లో ఉంటున్న వారికి ప్రాథమిక, డిజిటల్, ఆర్థిక విద్యను అందిస్తూ, ఈ నెలాఖరులోగా నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చడం ఈ కార్యక్రమం లక్ష్యం. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యాన ఈ కార్యక్రమం ప్రారంభించారు. ప్రస్తుతం ప్రతి రంగంలోనూ సాంకేతికత, డిజిటల్ విధానం, నగదు రహిత లావాదేవీలు పెరిగాయి. ఈ నేపథ్యంలో మహిళలు పొదుపు సంఘాల్లో ఉండేలా చూడటం, బ్యాంక్ ఖాతాలున్న వారికి వాటిని నిర్వహించే విధానాన్ని ఉల్లాస్ ద్వారా తెలియజేశారు. చదువు రాని వారు పక్క వారిపై ఆధారపడుతున్న పరిస్థితులను అధిగమించేలా అవగాహన కల్పించారు. గ్రామాల్లో 15 ఏళ్లు దాటిన వారికి విద్యను అందించే వ్యవస్థ ఏదీ ప్రస్తుతం లేదు. అందుకే ప్రత్యామాయంగా మరోసారి గ్రామీణ ప్రాంతాల్లో వయోజన విద్యా కేంద్రాలు ప్రారంభించేందుకు ప్రభుత్వాలు సంయుక్తంగా కృషి చేస్తున్నాయి. అక్షర జ్ఞానం లేని వారిని గుర్తించేందుకు ఏపీ సెర్ప్ ఆధ్వర్యాన జిల్లా వ్యాప్తంగా సర్వే చేయగా, కనీస అక్షర జ్ఞానం లేని వారు దాదాపు 70 వేల మంది ఉన్నట్లు గుర్తించారు. వీరిలో ఆరు ఏజెన్సీ మండలాలు, నాలుగు సముద్ర తీర మండలాల్లోని 6,806 మందికి తొలి విడతలో ఉల్లాస్ శిక్షణ ఇచ్చారు. అంగన్‌వాడీ కార్యకర్తలు.. వారు అందుబాటులో లేకపోతే పొదుపు సంఘాల్లో చదువుకున్న వారిని, ఉపాధ్యాయులను వలంటీర్లుగా నియమించి బోధించారు. అవసరమైన విద్యా సామగ్రి అందజేశారు.
చకచకా ఏర్పాట్లు
ఉల్లాస్ పరీక్ష నిర్వహణపై జిల్లా అధికారులతో సమీక్షించాం. ఇన్విజిలేషన్‌కు, మూల్యాంకనానికి అర్హులను నియమించాం. పరిశీలకులుగా వెలుగు ఏపీఏంలు వ్యవహరిస్తారు. పరీక్ష అనంతరం జవాబు పత్రాలు, రిజిస్ట్రేషన్, హాజరు పత్రాలు, మార్కుల జాబితాలను నిర్దేశిత నమునాల్లో అప్‌లోడ్ చేస్తాం.
– ఎ.వెంకటరెడ్డి, నోడల్ అధికారి, వయోజన విద్య, కాకినాడ
Comments
Please login to add a commentAdd a comment