బాణసంచా తయారీలో నిబంధనలు పాటించాలి | - | Sakshi
Sakshi News home page

బాణసంచా తయారీలో నిబంధనలు పాటించాలి

Published Thu, Mar 20 2025 12:06 AM | Last Updated on Thu, Mar 20 2025 12:07 AM

బాణసంచా తయారీలో నిబంధనలు పాటించాలి

బాణసంచా తయారీలో నిబంధనలు పాటించాలి

కరప: బాణసంచా తయారీదారులు తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని కాకినాడ ఏడీఎఫ్‌ఓ పి.ఏసుబాబు అన్నారు. వేళంగిలో బుధవారం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా బాణసంచా తయారీదారుల సంఘ సమావేశంలో ఆయన మాట్లాడారు. బాణసంచా తయారీ, విక్రయదారులు తప్పనిసరిగా లైసెన్స్‌ కలిగి ఉండాలన్నారు. తయారు చేసే ప్రాంతంలో ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు, అగ్నిప్రమాద నివారణ చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సందర్భంగా బాణసంచా తయారీదారుల సంక్షేమ సంఘ నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గౌరవాధ్యక్షునిగా వెలుగుబంట్ల సత్యనారాయణ, అధ్యక్షుడిగా కొప్పిశెట్టి శ్రీనివాసరావు, కోశాధికారిగా జీవీవీ సత్యనారాయణ, కార్యదర్శిగా కె.విజయ్‌కుమార్‌, కె.దుర్గారావు, ఉపాధ్యక్షులుగా విన్నకోటి శ్రీనివాసరావు, సయ్యద్‌ బాజీబేగ్‌, ఎన్‌.దుర్గాప్రసాద్‌ ఎన్నికయ్యారు.

హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు

ధవళేశ్వరం: నేరం రుజువు కావడంతో హత్య కేసులో నిందితుడు దాడి గణేష్‌కు జీవిత ఖైదు, రూ.5 వేల జరిమానా విధిస్తూ ఐదో అదనపు జిల్లా సెషన్స్‌ జడ్జి డి.విజయగౌతమ్‌ బుధవారం తీర్పు ఇచ్చారు. పోలీసుల వివరాల మేరకు, నర్సిపట్నం మండలం చెట్టిపల్లి గ్రామానికి చెందిన దాడి గణేష్‌ 12 ఏళ్ల క్రితం ధవళేశ్వరం గ్రామానికి చెందిన వరలక్ష్మిని ప్రేమించి, పెద్దల అంగీకారంతో వివాహం చేసుకున్నాడు. ధవళేశ్వరం ఎర్రకొండలో నివాసం ఉండేవారు. 2019 జనవరి 28న తన భార్య ఎవరితోనే ఫోన్‌ మాట్లాడుతుందనే అనుమానంతో పీటతో తలపై మోది, చాకుతో పొడిచి ఆమెను హతమార్చాడు. ఆమె సోదరుడు కుంచాల శ్రీను ఫిర్యాదు మేరకు అప్పటి సీఐలు బాలశౌరి, ఎ.శ్రీను, ఎస్సై ఎస్‌.వెంకయ్య చార్జిషీట్‌లు దాఖలు చేశారు. ప్రాసిక్యూషన్‌ తరఫున గ్రేడ్‌–1 స్పెషల్‌ పీపీ కె.లక్ష్మానాయక్‌ వాదించారు. కేసును పర్యవేక్షించిన ధవళేశ్వరం సీఐ టి.గణేష్‌ ,హెచ్‌సీ బి.జయరామ్‌రాజును ఎస్పీ బి.నరసింహ కిషోర్‌ అభినందించారు.

రైతు బలవన్మరణం

నల్లజర్ల: కారణమేంటో తెలియదు కానీ మండలంలోని తెలికిచెర్లలో బుధవారం తెల్లవారుజామున రైతు బుడిగిన శ్రీను(48) తన పొలంలో బలవన్మరణానికి పాల్పడ్డాడు. పొలంలో మామిడిచెట్టుకు ఉరి వేసుకున్నాడు. అతడికి భార్య, ఇద్దరు మగ పిల్లలున్నారు. అతడి మరణానికి కారణం తెలియదని బంధువులు తెలిపారు. పామాయిల్‌ తోట వద్ద మామిడి చెట్టుకు అతడి మృతదేహం వేలాడుతుండడాన్ని స్థానికులు గుర్తించి, పోలీసులకు సమాచారం అందించారు. ఏఎస్సై శోభనాద్రి కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement