వందేళ్ల వృద్ధురాలి కన్నుమూత
నల్లజర్ల: ప్రకాశరావుపాలెంలో వృద్ధురాలు గోగులమండ సుందరమ్మ(100) బుధవారం ఉదయం కన్నుమూశారు. మరణించే వరకూ ఆమె ఆరోగ్యంగానే ఉన్నారని బంధువులు తెలిపారు. ఆమెకు ఐదుగురు మగ, ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. నలుగురు కుమారులు వివిధ శాఖల్లో గెజిటెడ్ హోదాల్లో పనిచేస్తున్నారు. నాలుగో కుమారుడు గోగుల మండబాబ్జీ వైఎస్సార్ సీపీ లీగల్‌సెల్ మండల అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. ఆమె భర్త వీరాస్వామి కమ్యూనిస్టు ఉద్యమ నేతగా వ్యవహరించారు.
ప్రాణం బలిగొన్న సెల్‌ఫోన్
రైలు కిందపడి వ్యక్తి దుర్మరణం
సామర్లకోట: భువనేశ్వర్ నుంచి సికింద్రాబాద్ వెళుతున్న విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో సామర్లకోటలో దిగిన ప్రయాణికుడు.. సెల్‌ఫోన్ కోసం వెళ్లి అదే రైలు కింద పడి మృతి చెందిన సంఘటన ఇది. రైల్వే స్టేషన్ మేనేజర్ ఎం.రమేష్ వివరాల మేరకు, బుధవారం రాత్రి విశాఖపట్నం నుంచి పెద్దాపురానికి చెందిన ప్రయాణికులు సామర్లకోట రైల్వే స్టేషన్‌లో రైలు దిగారు. రైలు బోగీలో సెల్‌ఫోన్ మరచిపోవడంతో, కదులుతున్న రైలు ఎక్కేందుకు యత్నించిన త్రిమూర్తుల త్రినాథ్(35) అదుపుతప్పి అదే రైలు కింద పడిపోవడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఓ పత్రిక ఏజెంట్‌గా అతడు పని చేస్తున్నట్టు బంధువులు తెలిపారు. సెల్‌ఫోన్ కోసం అతడు ప్రాణాలను కోల్పోయాడని బంధువులు విలపించారు. పెద్దాపురంలోని మిరపాకాల వీధికి చెందిన ఈ కుటుంబం మరికొద్ది సమయంలో ఇంటికి చేరుతామనుకునేసరికి ఈ ఘటన చోటుచేసుకుంది. జీఆర్పీ ఎస్సై పి.వాసు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
23న జాతీయ సాహిత్య సదస్సు
సఖినేటిపల్లి: మహాకవి, పద్మభూషణ్ బోయి భీమన్న జీవితం, సాహిత్యంపై ఈ నెల 23న రాజమహేంద్రవరంలో జాతీయ సాహిత్య సదస్సు నిర్వహిస్తున్నట్టు శ్రీశ్రీ కళావేదిక అంతర్జాతీయ సీఈఓ కత్తిమండ ప్రతాప్ బుధవారం ఇక్కడ తెలిపారు. ఆ సదస్సులో వంద మంది కవులు పత్ర సమర్పణ చేయనున్నట్టు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో ఈ సదస్సు ఏర్పాటు చేశామన్నారు. ముఖ్యఅతిథిగా బోయి భీమన్న సతీమణి బోయి హైమవతి హాజరవుతారని తెలిపారు. సదస్సులో పాల్గొనే కవులందరినీ సత్కరిస్తామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment