ఏలూరు సాక్షి కార్యాలయంపై దాడికి ఖండన
జిల్లాలో పాత్రికేయుల నిరసన
పిఠాపురం: రాష్ట్రంలో జర్నలిస్ట్‌లు, పత్రిక కార్యాలయాలపై జరుగుతున్న దాడులు అరికట్టి పత్రిక స్వేచ్ఛను కాపాడాలని పలువురు జర్నలిస్టులు డిమాండ్ చేశారు. ఏలూరు జిల్లా సాక్షి కార్యాలయంపై దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, ఆయన అనుచర వర్గం దాడి చేసి కార్యాలయంలో కంప్యూటర్లు ధ్వంసం చేసి, విధి నిర్వహణలో ఉన్న రిపోర్టర్‌పై దాడి చేయడాన్ని నిరసిస్తూ బుధవారం పిఠాపురం, పెద్దాపురంలో జర్నలిస్ట్‌లు ఆందోళనలు, ర్యాలీ నిర్వహించారు.
జర్నలిస్టు సంఘాల ఆద్వర్యంలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు తహసీల్దారు, డీఎస్పీ , ఆర్డీవో కార్యాలయాలలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సాక్షి పత్రికలో వ్యతిరేక వార్త వచ్చిందని కార్యాలయంపై దాడి చేయడం, కార్యాలయ పరికరాలు ధ్వంసం చేయడం దుర్మార్గమైన చర్య అన్నారు. పాత్రికేయులు పత్రికా కార్యాలయ పై దాడులు అరికట్టాలని కోరారు. పలువురు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు.
మున్సిపాలిటీల అభివృద్ధికి కృషి చేయాలి
పెద్దాపురం: మున్సిపాల్టీల అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మున్సిపల్ ఆర్డీ సీహెచ్ నాగ నరసింహారావు ఆదేశించారు. స్థానిక మున్సిపల్ కార్యాలయంలో బుధవారం మున్సిపల్ అధికారులతో సమీక్షించారు. పట్టణాల్లో ఆదాయ వనరులు పెంచి అభివృద్ధి ప్రాధాన్యతలను గుర్తించి ముందుకు సాగాలన్నారు. ఆస్తి పన్ను, తాగునీరు, ట్రేడ్ లైసెన్స్ పన్నులు నూరుశాతం పూర్తి చేయాలన్నారు. ప్రజలపై పన్నుల భారం పడకుండా వడ్డీ రాయితీపై అవగాహన కల్పించాలన్నారు. మున్సిపల్ పరిధిలోని పారిశుధ్య పనులను తనిఖీలు చేశారు. ఆయన వెంట మున్సిపల్ కమిషనర్ పద్మావతి ఆయా విభాగాల అధికారులు ఉన్నారు.

జర్నలిస్టులపై దాడులు అరికట్టాలి