
బీఆర్‌ఎస్ నాయకులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ
దోమకొండ: ఆ ఊళ్లో గొల్లకుర్మలు ఒక్కరు కూడా లేరు. అయినా రాష్ట్ర ప్రభుత్వం గొర్రెలను పంపిణీ చేసిందట.. 11 మందికి రూ. 10.31 లక్షల విలువైన లబ్ధి చేకూర్చారట.. ఇది ప్రతిపక్షాల ఆరోపణ కాదు.. అధికార పార్టీ నేతలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ చెబుతున్న వాస్తవం. గొర్రెల పంపిణీ పథకానికి సంబంధించి గొట్టిముక్కుల గ్రామంలో బీఆర్‌ఎస్ నాయకులు ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. గ్రామంలో చేపట్టిన అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలను వివరిస్తూ ప్రజాప్రతినిధులు, నాయకుల ఫొటోతో ఏర్పాట చేసిన ఫ్లెక్సీలో 11 మంది లబ్ధిదారులకు గొర్రెలు పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు. దీనికి రూ. 10,31,250 వెచ్చించినట్లు అందులో ఉంది. అయితే గ్రామంలో గొల్లకుర్మలే లేరని గ్రామస్తులు చెబుతున్నారు. గొల్లకుర్మలే లేనిచోట గొర్రెలను ఎవరికి పంపిణీ చేశారన్నది చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఈ ఫ్లెక్సీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
11 మందికి గొర్రెల పంపిణీ చేసినట్లుగా అధికార పార్టీ ప్రచారం
సోషల్‌మీడియాలో వైరల్‌గా మారిన ఫ్లెక్సీ