కామారెడ్డి: ఎన్నికల షెడ్యూల్ వెలుబడకముందే కామారెడ్డి జిల్లా రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ముఖ్యంగా కామారెడ్డి నియోజకవర్గంలో ప్రధాన పార్టీలు ఎన్నికల కోసం సర్వం సిద్ధమై నిత్యం ఏదో ఒక కార్యక్రమం పేరుతో జనం మధ్యన తిరుగుతున్నారు. కాగా రాష్ట్రవ్యాప్తంగా అధికార బీఆర్‌ఎస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థులను ప్రకటించింది. ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిత్వాల కోసం దరఖాస్తులు స్వీకరించింది.
దరఖాస్తుల పరిశీలన, అభ్యర్థుల బలాబలాలు, సర్వేల ఆధారంగా అభ్యర్థుల ఎంపికై దృష్టి సారించనుంది. బీజేపీ కూడా అభ్యర్థిత్వాల కోసం కసరత్తు చేస్తోంది. ఈసారి కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీఆర్‌ఎస్ అభ్యర్థిగా సీఎం కేసీఆర్ పోటీ చేస్తారన్న ప్రకటనతో ఉమ్మడి జిల్లాలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఇదిలా ఉండగా కొంత కాలంగా కామారెడ్డి రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చిన ఎమ్మెల్సీ కవిత కామారెడ్డి నుంచి సీఎం కేసీఆర్ పోటీ చేస్తుండడంతో కామారెడ్డి మీద దృష్టి పెట్టారు.
అందులో భాగంగా ఈనెల 28న జిల్లాకు ముఖద్వారమైన భిక్కనూరు మండలం నుంచి ఎన్నికల నగారా మోగించనున్నారు. 44వ నంబరు జాతీయ రహదారిపై భిక్కనూరు మండలం బస్వాపూర్ నుంచి ప్రారంభమయ్యే బైక్ ర్యాలీలో కవిత పాల్గొంటారు. బస్వాపూర్ నుంచి భిక్కనూరు సిద్దరామేశ్వర స్వామి ఆలయానికి చేరుకుని పూజలు నిర్వహిస్తారు. అనంతరం మండల కేంద్రంలో కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారు.
సిట్టింగ్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ ఆధ్వర్యంలో జరిగే సమావేశంలో కవిత పాల్గొని దిశానిర్దేశం చేస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్నందున అప్పట్లో ఉద్యమానికి అండగా నిలిచిన పల్లెల్లో ఏకగ్రీవ తీర్మాణాలు చేసేలా కార్యచరణ రూపొందిస్తున్నారు. అందులో భాగంగా కామారెడ్డి మండలం గర్గుల్, మాచారెడ్డి మండలంలోని తొమ్మిది గిరిజన పంచాయతీల్లో కేసీఆర్‌కు మద్దతుగా తీర్మానించారు. 9 జీపీల ప్రజలతో కలిసి ఎంపీపీ నర్సింగరావ్ ఆధ్వర్యంలో ఎల్లంపేట గ్రామంలో భారీర్యాలీ నిర్వహించారు.
భిక్కనూరుతో మొదలు..
బీఆర్‌ఎస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి ఎమ్మెల్సీ కవిత భిక్కనూరు సభతో నగారా మోగించనున్నారు. భిక్కనూరు సభలో ఎన్నికల ప్రచారం మొదలవుతుందని భావిస్తున్నారు. కాగా కామారెడ్డి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రంగంలో నిలవనున్న మాజీ మంత్రి షబ్బీర్ అలీ ఇప్పటికే ఊరూరు తిరుగుతున్నారు. ఎన్నికల ప్రచారాన్ని జోరుగా సాగిస్తున్నారు.
ఇదే సమయంలో బీజేపీ నుంచి పోటీ చేయనున్న జెడ్పీ మాజీ చైర్మన్ వెంకటరమణారెడ్డి పార్టీ కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తున్నారు. సొంత డబ్బులతో కుల సంఘాలు, దేవాలయాలకు నిధులిస్తూ వాటికి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తున్నారు. అధికార పార్టీ భిక్కనూరు సభతో ఎన్నికల నగారా మోగిస్తుండడంతో రాజకీయం మరింత వేడెక్కుతుందని భావిస్తున్నారు.
శ్రేణుల్లో జోష్ నింపేలా..
అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వెలుబడకముందే క్యాడర్‌లో జోష్ నింపేందుకు బీఆర్‌ఎ్‌స్ నాయకత్వం ప్రణాళికలు రచిస్తోంది. అందులో భాగంగానే భిక్కనూరులో సమావేశం ఏర్పాటు చేశారు. కార్యకర్తల నుంచి ఫీడ్‌బ్యా క్, అభివృద్ధి కార్యక్రమా లు, పెండింగ్ అంశాలపై చర్చించే అవకాశముంది. ఎన్నికలకు ఇంకా స మయమున్నప్పటికీ ఇప్ప టి నుంచే కార్యకర్తల్లో జోష్ నింపే ప్రయత్నం జరుగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment