సాక్షి, కామారెడ్డి: జిల్లాలో గవద బిళ్లల వ్యాధి విజృంభిస్తోంది. ఒకరినుంచి ఇంకొకరికి వేగంగా వ్యాప్తి చెందుతోంది. రెండు నెలలుగా జిల్లావ్యాప్తంగా చాలామంది ఈ వ్యాధి బారిన పడి మంచం పడుతున్నారు. పిల్లలు నొప్పిని భరించలేక విలవిల్లాడుతుండడంతో తల్లిదండ్రులు ఆస్పత్రులకు పరుగులు తీస్తున్నారు.
జిల్లావ్యాప్తంగా మంప్స్ వైరస్ చిన్నారులను ఇబ్బందిపెడుతోంది. గవద బిళ్లల సమస్యతో పిల్లలు మంచం పడుతున్నారు. చెవుల కింద, దవడ భాగాల్లో వాపు రావడంతోపాటు తలనొప్పి, కండరాల నొప్పి, కీళ్ల నొప్పి, కీళ్లల్లో వాపు, నోరు తడారిపోవడం, ఆకలి మందగించడం, జ్వరం తదితర లక్షణాలతో పిల్లలు బాధపడుతున్నారు. చిన్న పిల్లలకు గవద బిళ్లల సమస్య ఎదురైనపుడు వారు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. సమస్య చెప్పుకోలేక ఏడుస్తున్నారు. ఇలాంటి సందర్భాలలో తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. వైరస్ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని, లేకపోతే మరింత ఇబ్బంది పడాల్సి వస్తుందని పేర్కొంటున్నారు.
ఇలా వ్యాపిస్తుంది..
గవద బిళ్లల సమస్యతో బాధపడుతున్న వ్యక్తి దగ్గినపుడు, తుమ్మినపుడు, మాట్లాడినపుడు వైరస్ గాలిలో ప్రయాణించి ఇతరులకు వ్యాప్తి చెందుతుంది. ఎక్కువగా 15 ఏళ్లలోపు పిల్లలలో ఈ సమస్య కనిపిస్తుంది. స్కూళ్లకు వెళ్లే చిన్న పిల్లల్లో ఒకరికి సమస్య ఎదురైతే తెలియకుండానే ఒకరి ద్వారా అందరికీ వ్యాప్తి చెందే అవకాశాలుంటాయి.
భయపడొద్దు.. తేలికగా తీసుకోవద్దు
గవద బిళ్లలుగా పేర్కొనే మంప్స్ వ్యాధి ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందుతుంది. జ్వరం, తలనొప్పి, నీరసించిపోవడం వంటి సమస్యలు ఎదురవుతాయి. ఇంట్లో ఒక చిన్నారిలో సమస్యను గమనిస్తే మిగతావారికీ వ్యాప్తి చెందే అవకాశాలుంటాయి. ఇలాంటి సమయంలో మిగతా పిల్లలనుంచి దూరంగా ఉంచాలి. ఈ వ్యాధికి భయపడొద్దు.. అలాగని తేలికగానూ తీసుకోవద్దు. వైరస్ బారిన పడినపుడు వైద్యులను సంప్రదించి చికిత్స చేయించాలి. వైద్యుల సూచనలకు అనుగుణంగా మందులు వాడడంతో పాటు శక్తినిచ్చే ద్రవాహారాన్ని అందిస్తే త్వరగానే వ్యాధి తగ్గిపోతుంది.
– నరేందర్‌రావు, పిల్లల వైద్యులు, కామారెడ్డి
ఆస్పత్రులకు క్యూ..
గవద బిళ్లలు సమస్యతో చిన్నపిల్లల ఆస్పత్రులు కిటకిటలాడుతున్నాయి. జిల్లా కేంద్రంలో ఏ ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లినా పదుల సంఖ్యలో గవద బిళ్లలు సమస్యతో వస్తున్నవారే కనిపిస్తున్నారు. ఇటీవలి కాలంలో వందలాది మందికి వైరస్ సోకింది. కొన్ని కుటుంబాల్లో పిల్లల ద్వారా పెద్ద వాళ్లకు సైతం వైరస్ వ్యాప్తి చెందింది. గవద బిళ్లలు సోకిన వారు వారం రోజుల పాటు ఐసోలేషన్‌లో ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. మంప్స్ వైరస్‌తో బాధపడుతున్న పిల్లలను బడికి పంపకుండా ఇంట్లోనే ఏకాంతంగా ఉంచాలని, ఇంట్లో తయారుచేసిన తేలికపాటి ఆహారాన్ని అందించాలని పేర్కొంటున్నారు. తగినంత మంచినీరు, పండ్ల రసాలు ఇవ్వాలని సూచిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment