కోటగిరి జీపీ కార్యదర్శికి ఏడాది జైలు | - | Sakshi
Sakshi News home page

కోటగిరి జీపీ కార్యదర్శికి ఏడాది జైలు

Published Sat, Feb 15 2025 1:44 AM | Last Updated on Sat, Feb 15 2025 1:44 AM

-

ఖలీల్‌వాడి/రుద్రూర్‌: లంచం తీసుకున్న కేసులో కోటగిరి జీపీ కార్యదర్శి జీఎం సుదర్శన్‌కు శుక్రవారం నాంపల్లి ఏసీబీ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి మహమ్మద్‌ ఆఫ్రోజ్‌ అక్తర్‌ ఏడాది కఠిన జైలు శిక్షతోపాటు రూ.40వేల జరిమానా విధించినట్లు ఏసీబీ డీఎస్పీ శేఖర్‌గౌడ్‌ తెలిపారు. వివరాలు ఇలా.. కోటగిరికి చెందిన వడ్డే నర్సింహులు తన తండ్రి లింగయ్య పేరు మీద ఉన్న ఇళ్లను అతడి సోదరుడి పేరు మీద బదిలీ చేయాలని గ్రామ కార్యదర్శి సుదర్శన్‌కు 2014లో విన్నవించాడు. కానీ అతడు రూ. 10వేలు లంచం డిమాండ్‌ చేయగా, నర్సింహులు రూ.8వేలకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. లంచం ఇవ్వడం ఇష్టంలేని నర్సింహులు ఏసీబీ డీఎస్పీని ఆశ్రయించాడు. ఈక్రమంలో ఫిబ్రవరి 21, 2024న సెక్రటరీ సుదర్శన్‌కు రూ.8వేలు ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ కేసులో ఏసీబీ తరపున స్పెషల్‌ పబ్లిక్‌ ప్రాసిక్యుటర్‌ మనోజ్ఞ వాదనలు వినిపించగా, ఇరువర్గాల వాదనలు విన్న నాంపల్లి ఏసీబీ కోర్టు జడ్జి ఏడాది కఠిన జైలు శిక్షతోపాటు రూ.40వేల జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించినట్లు తెలిపారు. జరిమానా చెల్లించని యెడల ఒకనెల అదనపు సాధారణ కారాగార శిక్ష అనుభవించాల్సి ఉంటుందని తీర్పు వెల్లడించినారు.

డ్రంకన్‌డ్రైవ్‌ కేసులో ఒకరికి రెండురోజుల జైలు

ఖలీల్‌వాడి: మద్యం తాగి వాహనం నడిపిన ఒకరికి జైలుశిక్ష పడ్డట్లు ట్రాఫిక్‌ ఏసీపీ నారాయణ శుక్రవారం తెలిపారు. ఇటీవల డ్రంకన్‌డ్రైవ్‌ తనిఖీల్లో 13మంది పట్టుబడగా ట్రాఫిక్‌ ఎస్సై చంద్రమోహన్‌ వారికి కౌన్సెలింగ్‌ నిర్వహించారు. అనంతరం సెకండ్‌క్లాస్‌ మెజిస్ట్రేట్‌ ఎదుట హాజరుపరచగా 12మందికి రూ.17వేలు జరిమానా విధించగా, ఒకరికి రెండు రోజుల జైలుశిక్ష విధించినట్లు తెలిపారు.

వివాహిత అదృశ్యం

మాచారెడ్డి: పాల్వంచ మండలం ఇసాయిపేట గ్రామానికి చెందిన దాసరి మమత అనే గృహిణి అదృశ్యమైనట్లు మాచారెడ్డి ఎస్సై అనిల్‌ తెలిపారు. శుక్రవారం ఉదయం ఇసాయిపేటలో ఆమె కామారెడ్డి వైపునకు వెళ్లే బస్సు ఎక్కి వెళ్లగా, ఇప్పటికీ ఇంటికి తిరిగిరాలేదు. దీంతో భర్త మహి పాల్‌ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఎస్సై తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు.

‘అనుమతి లేకుండా ఇసుక తరలిస్తే చర్యలు’

ఖలీల్‌వాడి: జిల్లాలో ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుక అక్రమ రవాణా చేసినా, సహకరించినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఇన్‌చార్జి పోలీస్‌ కమిషనర్‌ సిహెచ్‌ సింధుశర్మ ఒక ప్రకటనలో హెచ్చరించారు. నిజామాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో జనవరి, ఫిబ్రవరి నెలలో ఇసుక అక్రమ రవాణా చేసిన వారిపై 31కేసులు, నిజామాబాద్‌ డివిజన్‌లో 13కేసులు, ఆర్మూర్‌ డివిజన్‌లో 13కేసులు, బోధన్‌ డివిజన్‌లో 5కేసులు నమోదు చేశామన్నారు. ఎవరైనా ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుక అక్రమ రవాణా చేసినట్లు తెలిస్తే వెంటనే సంబంధిత పోలీస్‌ స్టేషన్‌ లేదా పోలీస్‌ కంట్రోల్‌ రూమ్‌ 08462–226090, డయల్‌ 100కు ఫోన్‌ చేసి, సమాచారం అందించాలని తెలిపారు. సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు.

ఒకరిపై కత్తితో దాడి

ఖలీల్‌వాడి: నిజామాబాద్‌ రైల్వేస్టేషన్‌లో యువకుడిపై మరో యువకుడు కత్తితో దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎస్సై మొగులయ్య తెలిపిన వివరాలు ఇలా.. ఉన్నాయి. నిర్మల్‌ జిల్లాకు చెందిన బాబు కూలీ పనులు చేస్తూ జీవిస్తుండేవాడు. ఈనెల 12న రాత్రి అతడు నిజామాబాద్‌ రైల్వే స్టేషన్‌లో నిద్రిస్తున్న సమయంలో పక్కన మరో యువకుడు వచ్చి పడుకున్నాడు. కొద్దిసేపటి తర్వాత అతడు బాబు జేబులో నుంచి డబ్బులు తీస్తుండగా, మెలుకువ వచ్చి, రైల్వే పోలీసులకు తెలిపాడు. వారు సదరు యువకుడిని అక్కడి నుంచి పంపించారు. కొంతసేపు తర్వాత మళ్లీ అతడు బాబు వద్దకు వచ్చి, కత్తితో దాడి చేశారు. వెంటనే స్థానికులు గాయపడిన బాబును జీజీహెచ్‌కు తరలించారు. చికిత్స అనంతరం శుక్రవారం అతడు డిశ్చార్జ్‌ అయ్యాడు. ఈ కేసును ఒకటో టౌన్‌ పోలీసులు రైల్వే పోలీసులకు ట్రాన్స్‌ఫర్‌ చేయనున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement