అప్పులు తీర్చలేక ఒకరి ఆత్మహత్య
రామారెడ్డి: ఇంటి నిర్మాణానికి చేసిన అప్పులు తీర్చలేక తను నిర్మించిన ఇంట్లోనే ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండలంలోని ఇసన్నపల్లి గ్రామంలో శనివారం వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా.. ఇసన్నపల్లి గ్రామానికి చెందిన ధరణీ నర్సింలు(44) ఇంటికి 3రోజులుగా ఒక వైపు తాళం ఇంకో వైపు గడియా పెట్టి ఉండడంతో స్థానికులు శనివారం పోలీసులకు సమచారం ఇచ్చారు. పోలీసులు వెళ్లి చూడగా అతడు తాడుతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడాడు. నర్సింలు మూడేళ్ల క్రితం కొత్త ఇల్లు నిర్మించుకున్నాడు. ఇల్లు నిర్మాణానికి చేసిన అప్పులు తీరకపోవడంతో అతడు బాధపడుతుండేవాడు. ఈక్రమంలో భార్య లక్ష్మి పుట్టింటికి వెళ్లగా, ఇంట్లో ఎవరులేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై రవీందర్‌రావు తెలిపారు.
నిజాంసాగర్‌లో ఒకరు..
నిజాంసాగర్(జుక్కల్): మండల కేంద్రంలో ఓ వ్యక్తి అప్పులు తీర్చలేక ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై శివకుమార్ శనివారం తెలిపారు. వివరాలు ఇలా.. బాన్సువాడ మండలం బుడ్మి గ్రామానికి చెందిన జీవన్(38), భార్య పిల్లలతో కలిసి నిజాంసాగర్ మండల కేంద్రానికి 8ఏళ్ల కిందట వలస వచ్చాడు. దంపతులు ఇద్దరు వ్యవసాయ కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. 2021లో అతడు పెద్ద కూతురు పెళ్లి కోసం రూ. 3లక్షలు అప్పు చేశారు. అప్పటి నుంచి అప్పులు పెరిగిపోవడంతో ఇంట్లో తరచూ గొడవలు జరుగుతుండేవి. ఈక్రమంలో అతడి భార్య కొన్నిరోజుల క్రితం పుట్టింటికి వెళ్లిపోయింది. అప్పటి నుంచి జీవన్ ఒక్కడే ఇంట్లో ఉంటుండగా, జీవితంపై విరక్తి చెంది ఇంట్లో చీరతో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment