ఆరాంఘర్ టు ఆర్మూర్
బయటపడిందిలా..
● బయటపడ్డ బైక్ స్కాం
● ఆరాంఘర్‌లో సూత్రధారులు
● కామారెడ్డిలో మధ్యవర్తి..
సబ్ ఏజెంట్లతో దందా
● బైక్ పోయిందని ఇన్సూరెన్స్ క్లెయిమ్.. ఆ తర్వాత సగం రేటుకే విక్రయం
● ఆర్మూర్ పోలీసుల తనిఖీల్లో
వ్యవహారం గుట్టురట్టు
● ఇప్పటి వరకు 34 బైక్‌లు స్వాధీనం
ఖలీల్‌వాడి: సాధారణ వ్యక్తుల్లా షోరూమ్‌కు వస్తారు.. ఫైనాన్స్‌లో కొత్త బైక్‌ను కొని.. రెండు, మూడు నెలలపాటు ఈఎంఐలు చెల్లిస్తారు. ఆ తర్వాత బైక్ పోయిందంటూ బీమా క్లెయిమ్ చేసుకుంటారు. తీరా అదే బైక్‌ను సగం రేటుకే ఇతరులకు విక్రయించి సొమ్ము చేసుకుంటూ మోసాలకు పాల్పడుతోంది ఓ ముఠా. తీగ లాగితే డొంక కదిలినట్లు నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ ప్రాంతంలో పోలీసులు చేపట్టిన వాహన తనిఖీల్లో వ్యవహారం మొత్తం బయటపడింది.ఒకటి,రెండూ కాదు..ఇప్పటి వరకుఏకంగా 35 బైక్‌లను పోలీసులు ఈ స్కామ్‌లో గుర్తించారు.
బైక్ స్కామ్ జరిగింది ఇలా
హైదరాబాద్‌లోని ఆరాంఘర్ ప్రాంతానికి చెందిన ముగ్గురు వ్యాపారులు బైక్ స్కామ్‌లో కీలకపాత్ర పోషిస్తున్నారు. ఈ ముగ్గురికి కామారెడ్డి జిల్లాకు చెందిన ఓ బ్రోకర్‌తో పరిచయం ఏర్పడింది. ఆ బ్రో కర్ పలువురు సబ్ ఏజెంట్లను ఏర్పాటు చేసుకొని వారికి తెలిసిన వారి ఆధార్‌కార్డు, ఒక సిమ్ తీసుకుంటారు. ఆధార్‌లో చిరునామా, వివరాలను మా ర్ఫింగ్ చేస్తారు. ఆ తర్వాత ఆరాంఘర్ వ్యాపారులు బైక్‌కు కావాల్సిన డౌన్‌పేమెంట్‌ను బ్రోకర్‌కు పంపిస్తారు. ఆ బ్రోకర్ డబ్బులను సబ్ ఏజెంట్లతో పాటు ఇతరులకు అందజేస్తాడు. వాళ్లు బై క్ షో రూంకు వెళ్లి నచ్చిన వాహనాన్ని కొనుగోలు చేస్తారు. మొదటి, రెండు వాయిదాలను సక్రమంగా చెల్లించిన తర్వాత బైక్‌ను ఎత్తుకెళ్లారని సమీప పోలీ స్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేస్తారు. అలా బైక్‌కు ఉన్న ఇన్సూరెన్స్ డబ్బులను తీసుకుంటారు. ఇదంతా చే సినందుకు బ్రోకర్, సబ్ ఏజెంట్లు, బైక్ తీసుకున్న వ్యక్తులు ఒక్కొక్కరికి రూ. 5వేల వరకు ఆరాంఘర్ వ్యాపారులు ఇస్తారు. మిగితా డబ్బులను ఆ బ్రోకర్ ఆరాంఘర్ వ్యాపారులకు పంపిస్తారు. కొనుగోలు చేసిన బైక్‌లను కొన్ని నెలలపాటు దాచి ఉంచి.. ఆ తర్వాత గ్రామీణ ప్రాంతాల్లోని రైతులు, యువకులకు ఒక్కో బైక్‌ను సుమారు రూ.50వేల నుంచి 70 వేల వరకు విక్రయిస్తారు. అనంతరం ఆ డబ్బులను సైతం తిరిగి ఆరాంఘర్ వ్యాపారులకు పంపిస్తారు.
ఆర్మూర్ ప్రాంతంలో పోలీసులు వాహనాలు తనిఖీ చేయగా ఓ బైక్ పట్టుబడింది. సంబంధిత పత్రాలు సమర్పించాలని, లేదంటే పోలీస్‌స్టేషన్‌కు తరలిస్తామని వాహనదారుడికి పోలీసులు తేల్చి చెప్పారు. దీంతో భయపడ్డ వాహనాదారుడు జరిగిన వ్యవహారాన్ని పోలీసులకు స్పష్టంగా వివరించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన పోలీసులు ఈ ఒక్క బైక్ తీగలాగితే..హైదరాబాద్‌లోని ఆరాంఘర్ లింక్ దొరికింది. పెద్ద మొత్తంలో బైక్‌స్కామ్ జరిగినట్లు పోలీసులు గుర్తించినట్లు తెలిసింది.
మరిన్ని బైక్‌లు దొరికే అవకాశం..
ఆరాంఘర్ వ్యాపారులు చెప్పిన ప్రకారం బ్రోకర్‌తోపాటు సబ్ ఏజెంట్లు విక్రయించిన బైక్‌లన్నీ ఆర్మూర్, బాల్కొండ, నిజామాబాద్ రూరల్ ప్రాంతాల్లో లభ్యమయ్యాయి. పోలీసులు శనివారం వరకు 34 బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. మున్ముందు మరిన్ని బైక్‌లు దొరికే అవకాశాలున్నట్లు తెలిసింది. బ్రోకర్‌తోపాటు సబ్ ఏజెంట్లను పోలీసులు విచారిస్తున్నట్లు సమాచారం. ఆరాంఘర్‌కు చెందిన ముగ్గురితో ఉన్న సంబంధాలు, వ్యాపారాలపై కూడా ఆరా తీస్తున్నట్లు తెలిసింది. కాగా, తక్కువ ధరకే బైక్ కొనుగోలు చేసిన వారు కంగుతిన్నారు. వాహనాలతోపాటు డబ్బులు నష్టపోయామంటూ లబోదిబోమంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment