సమయానికి వైద్యం అందక.. | - | Sakshi
Sakshi News home page

సమయానికి వైద్యం అందక..

Published Mon, Feb 17 2025 1:34 AM | Last Updated on Mon, Feb 17 2025 1:34 AM

-

జీజీహెచ్‌లో వాస్తవానికి డ్యూటీ షెడ్యూల్‌ ప్రకారం 24 గంటల పాటు ఒక్కరైనా గైనకాలజిస్ట్‌ అందుబాటులో ఉండాలి. అయితే వైద్యుల కొరతతో వారంలో రెండు, మూడు రోజుల్లో మాత్రమే అందుబాటులో ఉంటున్నారు. దీంతో ఆస్పత్రికి వచ్చేవారికి సరైన సేవలు అందడం లేదు. ప్రధానంగా ప్రసవం కోసం వచ్చే గర్భిణులు ఇబ్బందిపడుతున్నారు. వైద్యులు లేకపోవడంతో అత్యవసర పరిస్థితిలో సీజేరియన్‌లు చేయకపోవడంతో ఉమ్మనీరు మింగి, గర్భంలో నీరంతా పోయి, శ్వాస ఆడక, ఇతర కారణాలతో గర్భంలోనే శిశువులు మృత్యువాత పడుతున్నారు. జిల్లా ఆస్పత్రిలో ప్రతినెలా మూడుకుపైనే శిశుమరణాలు చోటు చేసుకుంటున్నాయి. ఉన్నతాధికారులు స్పందించి, వైద్యుల పోస్టులను భర్తీ చేసి, వైద్య సేవలు మెరుగుపడేలా చూడాలని, శిశుమరణాలను నివారించాలని ప్రజలు కోరుతున్నారు.

గైనకాలజిస్ట్‌లు లేక ఇబ్బందులు

జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో పూర్తి స్థాయిలో గైనకాలజిస్ట్‌లు లేరు. దీంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఖాళీల ను భర్తీ చేయాలని ఉన్నతాధికారులను కోరారు. కొరత ఉన్నా సేవల కు ఇబ్బంది కలగకుండా వైద్యులు అందుబాటులో ఉండేలా చూస్తున్నాం. ఎమర్జెన్సీ ఉంటే రిఫర్‌ చేస్తున్నాం.

– ఫరీదా, ఇన్‌చార్జి సూపరింటెండెంట్‌,

జీజీహెచ్‌, కామారెడ్డి

జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్‌ హాస్పిటల్‌

కామారెడ్డి టౌన్‌: జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రి(జీజీహెచ్‌)లో చాలా వైద్య పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రధానంగా గైనకాలజిస్ట్‌ పోస్టులు ఖాళీగా ఉండడంతో గర్భిణులకు సరైన సేవలు అందడం లేదు. సమయానికి ప్రసవాలు జరక్కపోవడంతో గర్భంలోనే శిశువులు మృతిచెందుతున్న ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. సమస్య పరిష్కారం కోసం ఉన్నతాధికారులూ చర్యలు తీసుకోకపోవడంతో జిల్లాలో శిశు మరణాలు ఆగడం లేదు.

జీజీహెచ్‌లో గైనిక్‌ విభాగంలో ఇద్దరు ప్రొఫెసర్లు, ముగ్గురు అసోసియేట్‌ ప్రొఫెసర్లు, ముగ్గురు అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు ఉండాలి. కానీ ప్రస్తుతం ఒక ప్రొఫెసర్‌, ఒక అసోసియేట్‌ ప్రొఫెసర్‌, ఒక అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ మాత్రమే ఉన్నారు. మిగతా ఐదు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న ముగ్గురూ మెడికల్‌ కళాశాలలో విద్యార్థులకు టీచింగ్‌తో పాటు, జీజీహెచ్‌లో మహిళలకు, గర్భిణులకు వైద్య సేవలు అందించాల్సి ఉంది. పోస్టులు ఖాళీగా ఉండడంతో జీజీహెచ్‌లో 24/7 గంటల పాటు సేవలందించలేకపోతున్నారు. అర్ధరాత్రి వేళలో, సెలవు రోజుల్లో పరిస్థితి మరింత దయనీయంగా ఉంటోంది. డ్యూటీలో ఉన్న ఇతర విభాగాల వైద్యులు ప్రసవాలు, ఆపరేషన్‌ చేయలేక నిజామాబాద్‌, హైదరాబాద్‌లకు రిఫర్‌ చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement