‘పిగ్‌మి’ పేరుతో కుచ్చుటోపి
బిచ్కుంద: బ్యాంక్ ఉద్యోగినని నమ్మించి, పిగ్‌మీ పేరుతో డిపాజిట్లు సేకరించి అమాయకులకు కుచ్చుటోపీ పెట్టాడో మోసగాడు.. పలువురిని ముంచి, రూ. 60 లక్షలతో ఉడాయించాడు. వివరాలిలా ఉన్నాయి. బిచ్కుందకు చెందిన జంగం రాజు కెనరా బ్యాంక్‌లో ఉంటూ ఖాతాదారులకు దరఖాస్తులు, ఓచర్లు నింపడం, డీడీలు తీయడంలో సహకరించేవాడు. తనను బ్యాంకు సిబ్బందిగా పరిచయం చేసుకుంటూ మహిళలు, వ్యవసాయ కూలీలు, చిరు వ్యాపారులను టార్గెట్ చేసుకుని బ్యాంక్ పిగ్‌మీ డిపాజిట్ స్కీం గురించి వివరించేవాడు. రోజూ కొంత మొత్తాన్ని జమ చేస్తే ఆకర్షణీయమైన వడ్డీ వస్తుందని నమ్మించాడు. అతడిని నమ్మిన వందలాది మంది డబ్బులు డిపాజిట్ చేశారు. డిపాజిట్ చేసినవారికి అప్పుడప్పుడు వడ్డీ ఇచ్చేవాడు. కొందరికి చెక్కులు రాసి ఇచ్చాడు. నాలుగేళ్లనుంచి డిపాజిట్లు సేకరిస్తూ వస్తున్న రాజు.. సుమారు రూ. 60 లక్షలతో వారం క్రితం కుటుంబంతో సహా పరారయ్యాడు. రాజు కనిపించకపోవడంతో అనుమానించిన డిపాజిట్‌దారులు.. బ్యాంకు అధికారులను ప్రశ్నించగా అతడు తమ సిబ్బంది కాదని తెలిపారు. అతడితో తమకు ఎలాంటి సంబంధం లేదని చెప్పడంతో ఖాతాదారులు అవాక్కయ్యారు.
తండ్రి ఏజెంట్ కావడంతో..
చిరు వ్యాపారులు ఆదాయంలో కొంత నగదును ప్రతిరోజు తమ బ్యాంక్ ఖతాలో జమ చేసుకోవడానికి కెనరా బ్యాంక్(సిండికెట్ బ్యాంక్) అవకాశం కల్పించింది. వీటిని పిగ్‌మీ డిపాజిట్లుగా పేర్కొంటారు. రాజు తండ్రి బస్వంత్ గతంలో బ్యాంక్ ఏజెంట్‌గా పనిచేశాడు. ఆయన పిగ్‌మీ డిపాజిట్లను వసూలు చేసి బ్యాంకులో జమ చేసేవాడు. దీంతో రాజు కూడా బ్యాంకు సిబ్బంది అని ఖాతాదారులు నమ్మారు. వారి నమ్మకాన్ని రాజు సొమ్ము చేసుకుని డిపాజిట్లతో ఉడాయించాడు.
రూ. 60 లక్షలతో వ్యక్తి పరారు
ఆందోళనలో బాధితులు
Comments
Please login to add a commentAdd a comment